మెక్సికో దేశానికి సంబంధించిన వీడియోని చూపిస్తూ వికారాబాద్ జిల్లాలో మూసీ నది వరద అని షేర్ చేస్తున్నారు.

వికారాబాద్ జిల్లాలో మూసీ నది వరద ప్రవాహం అంటూ షేర్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వరద నీటి ప్రవాహంలో పశువులు కొట్టుకుపోతున్న దృశ్యాలు ఈ వీడియోలో మనం చూడవచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: వికారాబాద్ జిల్లాలో మూసీ నది వరద ప్రవాహంలో పశువులు కొట్టుకుపోతున్న వీడియో.

ఫాక్ట్ (నిజం):  వరద నీటి ప్రవాహంలో పశువులు కొట్టుకుపోతున్న ఈ వీడియో మెక్సికో దేశంలోని నయారిట్ రాష్ట్రంలో జరిగిన ఘటనది. పోస్టులోని ఈ వీడియో భారత దేశానికి సంబంధించినది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Atolo kecil’ అనే యూసర్ ‘29 జులై 2020’ నాడు యూట్యూబ్ లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. నదీ ప్రవాహంలో పశువులు కొట్టుకుపోతున్న ఈ దృశ్యాలు మెక్సికో దేశంలోని నయారిట్ రాష్ట్రంలో ‘28 జూలై 2020’ నాడు చోటుచేసుకున్నట్టు తెలిపారు. ఈ వివరాల ఆధారంగా ఆ ఘటనకి సంబంధించిన మరింత అధికారిక సమాచారం కోసం వెతకగా, ఇదే వీడియోని ‘Imagen Noticias’ తమ అధికారిక యూట్యూబ్ ఛానెల్లో ‘28 జూలై 2020’ నాడు పోస్ట్  చేసినట్టు తెలిసింది. మెక్సికో దేశానికి చెందిన ‘Imagen TV’ టెలివిజన్ నెట్వర్క్ లో ఈ ‘Imagen Noticias’ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. నయారిట్ రాష్ట్రంలోని Zacualpan నది ప్రవాహంలో కొట్టుకుపోతున్న పశువులు, అని ఈ వీడియో వివరణలో తెలిపారు.

ఇదే వీడియోని చూపిస్తూ ‘UNO TV’ న్యూస్ వెబ్ సైట్ ‘28 జూలై 2020’ నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. మెక్సికో లోని నయారిట్ రాష్ట్రంలో ‘Hanna Storm’ వరద దాటికి పశువులు కొట్టుకుపోతున్న దృశ్యాలు, అని ఈ ఆర్టికల్ లో తెలిపారు.

‘Times of India’ న్యూస్ వెబ్ సైట్ ఈ వీడియోని షేర్ చేస్తూ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దేవాస్ నగరంలో నది ప్రవాహానికి కొట్టుకుపోతున్న పశువులు అని ఆర్టికల్ పబ్లిష్ చేసినప్పుడు, FACTLY దానికి సంబంధించి రాసిన ఫాక్ట్ చెక్ ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, మెక్సికో దేశానికి సంబంధించిన వీడియోని చూపిస్తూ వికారాబాద్ జిల్లాలో మూసీ నది వరద ప్రవాహం అని షేర్ చేస్తున్నారు.