ఇటీవల వచ్చిన ఒక సెట్టింగ్ వల్ల, మెటా AI(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) వాట్సాప్ గ్రూప్ చాట్స్ అన్నిటినీ చదివేస్తుందని చెప్తూ, దాని నుంచి తప్పించుకోవడానికి అడ్వాన్స్ చాట్ ప్రైవసీ అనే సెట్టింగ్ ఆన్ చేసుకోవాలని ఒక వ్యక్తి చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అడ్వాన్స్ చాట్ ప్రైవసీ ఆన్ చేసుకోవడం ద్వారా, మెటా AI వాట్సాప్ చాట్స్ చదవడాన్ని నివారించుకోవచ్చు అని ఈ వ్యక్తి ఈ వీడియోలో చెబుతున్నారు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: అడ్వాన్స్‌డ్ చాట్ ప్రైవసీ సెట్టింగ్ ఆన్ చేయకపోతే, మెటా AI, వాట్సాప్ గ్రూప్ చాట్‌లను యాక్సెస్ చేస్తుంది (చదివేస్తుంది).
ఫ్యాక్ట్(నిజం): మెటా AI, @Meta AI అని మెన్షన్ చేస్తూ, దానితో షేర్ చేసిన వాట్సాప్ మెసేజీలను మాత్రమే యాక్సెస్ చేయగలుగుతుంది, మొత్తం గ్రూప్ చాట్‌లను కాదు. వాట్సాప్‌లోని అన్ని వ్యక్తిగత, గ్రూప్ మెసేజీలు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో రక్షింపబడి ఉంటాయి, అంటే ఈ మెసేజీలను మీరు, మీరు మెసేజ్ చేసిన వ్యక్తి తప్ప ఎవరూ చదవలేరు. అడ్వాన్స్‌డ్ చాట్ ప్రైవసీ ఫీచర్ ఇతరులు మెటా AIతో మీ మెసేజీలను ఉపయోగించకుండా, చాట్‌లను డౌన్‌లోడ్ చేయకుండా లేదా మీడియాను ఆటో-డౌన్‌లోడ్ చేయకుండా నివారిస్తుంది. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు
మెటా AI ఫీచర్‌ను, మెటా వారు ఏప్రిల్ 2025లో వాట్సాప్‌లో ప్రవేశ పెట్టారు. ఈ ఆప్షనల్ సర్వీస్ మెటా వారు తయారు చేసిన జనరేటివ్ AI టెక్నాలజీని ఉపయోగిస్తుంది. దీన్ని ఉపయోగించి యూజర్లు Meta AIతో నేరుగా చాట్ చేయవచ్చు, లేదా గ్రూప్ చాట్‌లలో చాట్ చేయడానికి కూడా దీన్ని ఉపయోగించవచ్చు. యూజర్లు Meta AIను ప్రశ్నలు అడగడానికి, సూచనలను పొందడానికి, AI-జనరేటెడ్ చిత్రాలను సృష్టించడానికి దీన్ని వాడవచ్చు. యూజర్లు పంపే ప్రాంప్ట్‌లు, సందేశాల ఆధారంగా Meta AI responses (ప్రతిస్పందనలు) రూపొందిస్తుంది. యూజర్లు Meta AIని ఉపయోగించినప్పుడు, reply (జవాబు) ఇవ్వడానికి Meta వారు మనం రాసే ప్రాంప్ట్‌లను, మెసేజీలను, ఇచ్చే ఫీడ్ బ్యాక్‌ను అందుకుంటారు.
వాట్సాప్ హెల్ప్ సెంటర్‌లో ఉన్న సమాచారం ప్రకారం, యూజర్లు Meta AIకు ఇచ్చిన ప్రాంప్ట్‌ల ఆధారంగా మెటా AI పంపే రెస్పాన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జెనెరేట్ (తయారు) చేయబడతాయి. @Meta AI అని ప్రస్తావించే లేదా దానికి ఉద్దేశపూర్వకంగా మనం పంపిన మెసేజీలను మాత్రమే Meta యాక్సెస్ చేయగలదు, ఇతర కంటెంట్‌ను కాదు. ఇది మొత్తం గ్రూప్ చాట్‌లను యాక్సెస్ చేయలేదు.
WhatsAppలోని పర్సనల్ మెసేజీలు, కాల్స్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో ప్రొటెక్ట్ చేయబడి (రక్షించబడి) ఉంటాయి, అంటే చాట్ బయట వారు ఎవరూ వాటిని చదవలేరు. WhatsApp లేదా Meta వారు కూడా వాటిని చదవలేరు, వినలేరు లేదా షేర్ చేయలేరు.
ఇక అడ్వాన్స్‌డ్ చాట్ ప్రైవసీ ఫీచర్ విషయానికి వస్తే, వ్యక్తిగత, గ్రూప్ చాట్‌లకు ఇచ్చిన ఒక కొత్త సెట్టింగ్ ఇది. ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోవడం ద్వారా, ఇతరులు మెటా AIతో మీ మెసేజీలను ఉపయోగించకుండా, చాట్‌లను డౌన్‌లోడ్ చేయకుండా లేదా మీడియాను ఆటో-డౌన్‌లోడ్ చేయకుండా మీరు నివారించ వచ్చు. వైరల్ పోస్టులో చెప్తున్నట్టుగా మెటా AI మన గ్రూప్ చాట్స్ అన్నిటినీ చదవడాన్ని నిరోధించడానికి ఉన్న ఫీచర్ కాదు.
ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటి ఉంది. ఒకవేళ మాన ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్‌లో హానికరమైన బ్రౌజర్ extension ఏదైనా ఇన్‌స్టాల్ చేసి ఉంటే, అది వాట్సాప్ వెబ్ డేటాను స్క్రేప్ చేసే అవకాశం ఉంది. అయితే, ఈ రిస్క్ మెటా AI ఫీచర్ లేదా అడ్వాన్స్‌డ్ చాట్ ప్రైవసీ ఫీచర్‌కు సంబంధించినది కాదు.
చివరగా, మెటా AI మన వాట్సాప్ గ్రూపులలో ఉండే మెసేజీలను యాక్సెస్ చేయలేదు; ఈ క్లెయిమ్ ఫేక్.