ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 13 జనవరి 2025న ప్రారంభమైన మహా కుంభమేళా నేపథ్యంలో, కాశీలో మాంసం దుకాణాలు అన్ని మూసివేయబడ్డాయి అంటూ పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, మరియు ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 2025న ప్రారంభమైన మహా కుంభమేళా నేపథ్యంలో, కాశీలోని అన్ని మాంసం దుకాణాలు మూసివేయబడ్డాయి.
ఫాక్ట్(నిజం): కాశీ విశ్వనాథ ఆలయానికి రెండు కిలోమీటర్ల పరిధిలో మాత్రమే మాంసం దుకాణాలు నిషేదించారు, మొత్తం కాశీలో ఉన్న అన్ని మాంసం దుకాణాలు మూసివేయబడలేదు. ఒక కేసు తాలూకు FIR కాపీ వివరాల ప్రకారం, 15 జనవరి 2024న వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం, శ్రీ విశ్వనాథ ధామ్ ప్రాంగణం నుండి రెండు కిలోమీటర్ల పరిధిలో మాంసం, చేపలు, కోడి మాంసం దుకాణాలను మూసివేయాలని పేర్కొన్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తుల మతపరమైన భావాలను గౌరవించడమే దీని ఉద్దేశ్యమని వివరించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా కాశీలోని అన్ని మాంసం దుకాణాలు మూసివేయబడ్డాయా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతికితే, వైరల్ క్లెయింను సమర్థించే 12 జనవరి 2025న ప్రచురించబడిన పలు వార్త కథనాలు (ఇక్కడ, మరియు ఇక్కడ) మాకు లభించాయి. ఈ కథనాలు ప్రకారం, వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ చౌక్ ప్రాంతంలోని విశ్వనాథ ఆలయానికి రెండు కిలోమీటర్ల పరిధిలో ఉన్న 26 మాంసం దుకాణాల యజమానులకు వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. ఈ దుకాణాలు “నిబంధనలను ఉల్లంఘిస్తున్నందున” మూసివేయాలని ఆదేశించింది. గత ఏడాది ఆలయ పరిసరాల్లో మాంసం విక్రయాలను నిషేధించాలనే ప్రతిపాదనను మున్సిపల్ కార్పొరేషన్ ఏకగ్రీవంగా ఆమోదించిందని (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) మేయర్ అశోక్ తివారీ తెలిపారు. తొలుత నోటీసులు జారీ చేసినప్పుడు దుకాణదారులు ఏర్పాట్లు చేసుకోవడానికి 30 రోజుల గడువు కోరినా, ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.
మా పరిశీలనలో, అటువంటి దుకాణ యజమానులపై కేసు నమోదయిందని ఒక నివేదిక లభించింది. ఆ తర్వాత, మేము ఈ కేసుకు సంబంధించిన FIR కాపీని కనుగొన్నాము, అందులోని వివరాల ప్రకారం, 15 జనవరి 2024న వారణాసి మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం, శ్రీ విశ్వనాథ ధామ్ ప్రాంగణం నుండి రెండు కిలోమీటర్ల పరిధిలో మాంసం, చేపలు, కోడి మాంసం దుకాణాలను మూసివేయాలని పేర్కొన్నారు. దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తుల మతపరమైన భావాలను గౌరవించడమే దీని ఉద్దేశ్యమని వివరించారు.
పై ఆధారాల ప్రకారం, కాశీ విశ్వనాథ ఆలయానికి 2 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే మాంసం దుకాణాలు నిషేదించారు. మొత్తం కాశీ ప్రాంతంలో మాంసం దుకాణాలు మూసివేయబలేదు అని కచ్చితంగా చెప్పొచ్చు.
చివరిగా, కాశీ విశ్వనాథ ఆలయానికి రెండు కిలోమీటర్ల పరిధిలో మాత్రమే మాంసం దుకాణాలు మూసివేయబడ్డాయి, మొత్తం కాశీలో కాదు.