20 ఆగస్టు 2025న ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడి జరిగింది. ఈ నేపథ్యంలో, 20 ఆగస్టు 2025న ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడి చేసింది అహ్మద్ భాషా అనే ముస్లిం అని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: 20 ఆగస్టు 2025న, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై అహ్మద్ భాషా అనే ముస్లిం వ్యక్తి దాడి చేశాడు.
ఫాక్ట్(నిజం): 20 ఆగస్టు 2025న, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడి చేసిన వ్యక్తి సకారియా రాజేష్‌భాయ్ ఖిమ్జీభాయ్‌గా పోలీసులు గుర్తించారు. అలాగే, Factlyతో మాట్లాడుతూ, ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్) రాజా బంతియా కూడా దాడి చేసిన వ్యక్తి ముస్లిం కాదని ధృవీకరించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఢిల్లీ సీఎం రేఖాగుప్తాపై జరిగిన దాడికి సంబంధించి పూర్తి వివరాల తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ ఘటన రిపోర్ట్ చేస్తూ పలు మీడియా సంస్థలు ప్రచురించిన వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, 20 ఆగస్టు 2025 ఉదయం ఉత్తర ఢిల్లీలోని సివిల్ లైన్స్ ప్రాంతంలోని ఢిల్లీ సీఎం అధికారిక నివాసంలో రేఖాగుప్తా ‘జన్ సున్‌వాయి’(ప్రజావాణి) కార్యక్రమంలో ప్రజలతో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి ఆమె దగ్గరికి వచ్చి.. కొన్ని పేపర్లు అందజేశి, హఠాత్తుగా ఆమె చేయి పట్టుకుని తనవైపు లాక్కునేందుకు ప్రయత్నించి ఆమెపై దాడి చేశాడు. ఈ క్రమంలో సీఎం రేఖాగుప్తా తలకు స్వల్ప గాయమైంది. అక్కడ ఉన్నవారు అతడిని బంధించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని హత్యాయత్నం కేసు నమోదుచేశారు. నిందితుడు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన సకారియా రాజేష్‌భాయ్ ఖిమ్జీభాయ్‌గా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనకు సంబంధించి సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్) సెక్షన్ 109(1) (హత్యాయత్నం)తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్) రాజా బంతియా తెలిపారు.
అలాగే ఈ సంఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం, ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్) రాజా బంతియాను సంప్రదించగా, ఆయన Factlyతో మాట్లాడుతూ, దాడి చేసిన వ్యక్తి ముస్లిం కాదని ధృవీకరించారు.
చివరగా, 20 ఆగస్టు 2025న ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడి చేసిన వ్యక్తి సకారియా రాజేష్‌భాయ్ ఖిమ్జీభాయ్ అని పోలీసులు గుర్తించారు. అలాగే, అతను ముస్లిం కాదని నిర్ధారించారు.