ఎల్పీజీ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి, కాబట్టి 2014 ధరలని ఇప్పటి ధరలతో పోల్చలేము

YouTube Poster

2014లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాం చివరిలో నాన్- సబ్సిడైస్డ్ ఎల్పీజీ సిలిండర్ ధరలతో (రూ.928) పోలిస్తే ఇప్పుడు మోదీ హయాంలో ధరలు (రూ.884.50) తక్కువగా ఉన్నాయని చెప్తున్న పోస్టులు (ఇక్కడ మరియు ఇక్కడ) సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ఈ కథనం ద్వారా ఆ వార్తలో నిజమేంతో చూద్దాం.

క్లెయిమ్: 2014 కాంగ్రెస్ ప్రభుత్వ హయాం చివరిలో నాన్- సబ్సిడైస్డ్ ఎల్పీజీ సిలిండర్ ధరలతో (రూ.928)  పోలిస్తే ఇప్పుడు మోదీ హయాంలో ధరలు (రూ.884.50)  తక్కువగా ఉన్నాయి.

ఫాక్ట్ (నిజం): దేశీయంగా ఎల్పీజీ ధరలు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. 2014లో అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు ఎక్కువ ఉన్నందున దేశీయంగా నాన్- సబ్సిడైస్డ్ ఎల్పీజీ సిలిండర్ల ధర కూడా ఎక్కువగా ఉండింది, అదే ప్రస్తుతం అంతర్జాతీయ ఎల్పీజీ ధరలు తక్కువ ఉన్నాయి కాబట్టి,  దేశీయంగా నాన్- సబ్సిడైస్డ్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు కూడా తక్కువగా ఉన్నాయి. కాబట్టి 2014 ధరలని ఇప్పటి ధరలతో పోల్చలేము. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

సాధారణంగా మనం కొనే ఎల్పీజీ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ఎల్పీజీ ధరలపై ఆధారపడి ఉంటాయి. సౌదీ అరేబియాలో ఎల్పీజీకి సంబంధించిన FoB (ఫ్రీ ఆన్ బోర్డ్) ధరని అంతర్జాతీయ బెంచ్‌మార్క్‌  ధరగా పరిగణించబడుతుంది. సౌదీలోని అరాంకో కంపెనీలో ఒక నెలపాటు ఉన్న బ్యూటేన్ మరియు ప్రొపేన్ ధరల యొక్క సగటును (బ్యూటేన్ (60%) & ప్రొపేన్ (40%)) FoB (ఫ్రీ ఆన్ బోర్డ్) ధర  అని అంటారు.

ఐతే పోస్టులో నాన్- సబ్సిడైస్డ్ ఎల్పీజీ సిలిండర్లకి సంబంధించి పేర్కొన్న 2014 మరియు 2021 ధరలు కరెక్టే అయినప్పటికీ, ఇక్కడ మనం గమనించాల్సింది ఆయా సమయాల్లో  అంతర్జాతీయంగా ఉన్న ఎల్పీజీ ధరలు. ఎందుకంటే పైన చెప్పినట్టు దేశీయంగా ఎల్పీజీ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ఎల్పీజీ ధరలపై ఆధారపడి ఉంటాయి కాబట్టి. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ సమాచారం ప్రకారం 2014లో ఏప్రిల్- సెప్టెంబర్ మధ్య అంతర్జాతీయంగా ఒక మెట్రిక్ టన్ ఎల్పీజీ ధర సుమారు 800 డాలర్లు కాగా, అదే ప్రస్తుతం జూలైలో ఈ ధర 620 డాలర్లుగా ఉంది.

ఈ సంవత్సరంలో ప్రతీ నెల మారుతున్న అంతర్జాతీయ ఎల్పీజీ ధరలు కింది టేబుల్ లో చూడొచ్చు.

దీన్నిబట్టి దేశీయంగా ఎల్పీజీ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయని అర్డంచేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం కేవలం సబ్సిడీ సిలిండర్ ధరలు మాత్రామే నియంత్రిస్తూ ఉంటుంది. నాన్- సబ్సిడైస్డ్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అంతర్జాతీయ ధరల ఆధారంగా నిర్ణయిస్తూ ఉంటాయి.  2014లో అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు ఎక్కువ ఉన్నందున దేశీయంగా నాన్- సబ్సిడైస్డ్ ఎల్పీజీ సిలిండర్ల ధర ఎక్కువగా ఉండింది, అదే ప్రస్తుతం అంతర్జాతీయ ఎల్పీజీ ధరలు తక్కువ  ఉన్నాయి కాబట్టి,  దేశీయంగా నాన్- సబ్సిడైస్డ్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి 2014 ధరలని ఇప్పటి ధరలతో పోల్చలేము.

చివరగా, ఎల్పీజీ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి, కాబట్టి 2014 ధరలని ఇప్పటి ధరలతో పోల్చలేము.