కేంద్ర ప్రభుత్వం ఎల్.వి. సుబ్రహ్మణ్యం ని సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గా నియమించిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ గా పని చేసిన ఎల్.వి. సుబ్రహ్మణ్యం ని ఇటీవల ఆ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. అప్పటినుండి సోషల్ మీడియా లో కేంద్ర ప్రభుత్వం ఆయన్ని సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గా నియమించిందంటూ ప్రచారం జరుగుతోంది. దాంట్లో, ఎంతవరకు నిజముందో విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఎల్.వి. సుబ్రహ్మణ్యం ని కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గా నియమించింది.

ఫాక్ట్ (నిజం): చీఫ్ సెక్రటరీ గా ఉన్న ఎల్. వి. సుబ్రహ్మణ్యంను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదిలీ చేసి బాపట్ల లోని ఏ.పి. మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ గా నియమించింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (CVC) వెబ్సైటు లో సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గా శరద్ కుమార్ ఉన్నట్లుగా చూడవచ్చు. కావున, పోస్ట్‌లో చెప్పింది తప్పు.

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ గా పని చేస్తున్న ఎల్.వి. సుబ్రహ్మణ్యం ని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిందనీ, ఆయన్ని బాపట్ల లోని ఏ.పి. మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ గా నియమించిందని ‘The News Minute’ వారి నవంబర్ 4, 2019 వార్తా కథనం ద్వారా తెలుస్తుంది.

సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(CVC) వెబ్సైటు లో సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గా శరద్ కుమార్ ఉన్నట్లుగా చూడవచ్చు. సాధారణంగా, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ మరియు విజిలెన్స్ కమిషనర్ల పదవీ కాలం వారు తమ కార్యాలయంలోకి ప్రవేశించిన తేదీ నుండి నాలుగు సంవత్సరాలు లేదా వారి వయస్సు 65 సంవత్సరాలు చేరేవరకు (ఏది ముందు అయితే అది) ఉంటుంది. శరద్ కుమార్ CVC లో జూన్ 12, 2018 న విజిలెన్స్ కమిషనర్ గా చేరారనీ, ఆ తర్వాత  జూన్ 11, 2019న తాత్కాలిక సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గా ఎంపికైనట్లుగా ‘The Hindu’ వారి కథనం ద్వారా తెలుస్తుంది. అప్పటి నుండి ఆయనే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గా కొనసాగుతున్నారు.

చివరగా, కేంద్ర ప్రభుత్వం ఎల్.వి. సుబ్రహ్మణ్యం ని సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గా నియమించిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?