‘కుంభమేళా మోనాలిసా’ మారు వేషంలో ఉన్న కలెక్టర్ అంటూ ఎడిట్ చేసిన ఫోటోలను షేర్ చేస్తున్నారు

2025 ప్రయాగరాజ్‌ మహాకుంభ మేళాలో రుద్రాక్ష మాలలు విక్రయించే మోనాలిసా భోన్స్లే అనే యువతి మీడియా, సోషల్ మీడియాలలో ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలో, మోనాలిసా ఒక కలెక్టర్ స్థాయి అధికారి అని, మారువేషంలో ఇలా కుంభమేళాకి వచ్చిందని చెప్తూ కొన్ని ఫోటోలు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో ప్రచారమావుతున్నాయి. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

A person and person sitting at a desk

AI-generated content may be incorrect.
ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: 2025 మహాకుంభ మేళాలో వైరల్ అయిన యువతి మోనాలిసా భోన్స్లే ఒక కలెక్టర్ (IAS అధికారి).

ఫాక్ట్: వైరల్ ఫోటోలు మోనాలిసా ముఖంతో ఎడిట్ చేయబడ్డాయి. మోనాలిసా వయసు పదహారేళ్లని పలు వార్త కథనాలు పేర్కొన్నాయి. అలాగే, తాను పెద్దగా చదువుకోలేదని మోనాలిసా పలు సందర్భాల్లో పేర్కొన్నారు. మోనాలిసా ఐఏఎస్ అధికారి అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కాబట్టి పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా వైరల్ వీడియోలోని మోనాలిసా ఫోటోలుగా చెప్పబడుతున్న వాటిని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, వీటి అసలు ఫోటోలు లభించాయి. ఈ ఫోటోలు స్మిత సబర్వాల్ (ఇక్కడ & ఇక్కడ), సృష్టి దేశ్ముఖ్ (ఇక్కడ & ఇక్కడ) మొదలగు IAS అధికారులవని గుర్తించాం. ఈ ఫోటోలను మోనాలిసా ముఖం వచ్చేలా మార్ఫింగ్ చేసినట్లు తెలుస్తుంది. దీన్ని బట్టి వైరల్ ఫోటోలలో ఉన్నది మోనాలిసా కాదని నిర్ధారించవచ్చు.

అలాగే, వార్తా కథనాల ప్రకారం మోనాలిసా మధ్యప్రదేశ్ కు చెందిన పదహారేళ్ల యువతి. తాను పెద్దగా చదువుకోలేదని మోనాలిసా పలు సందర్భాల్లో (ఇక్కడ & ఇక్కడ) పేర్కొన్నారు. ఆమె IAS అధికారి అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. పైగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయడానికి అభ్యర్థికి కనీసం 21 ఏళ్ల వయసు ఉండాలి.

చివరిగా, కుంభమేళా యువతి మోనాలిసా భోన్స్లే కలెక్టర్ అంటూ ఎడిట్ చేసిన ఫోటోలను షేర్ చేస్తున్నారు.