22 ఫిబ్రవరి 2025న తెలంగాణలోని శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (SLBC) సొరంగంలో ప్రమాదం జరిగి 8 మంది చిక్కుకుపోయిన నేపథ్యంలో, తెలంగాణ రోడ్లు & భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దుబాయ్‌లో జల్సా చేస్తున్నారంటూ అయిన ఒక బోటులో కూర్చొని ఉన్న వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: SLBC సొరంగంలో 8 మంది చిక్కుకుపోయిన సమయంలో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దుబాయ్‌లో ఉన్నప్పటి వీడియో.
ఫాక్ట్: SLBC సొరంగం ప్రమాద సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నమాట నిజమే అయినప్పటికీ వైరల్ వీడియో అక్టోబర్ 2022లో ఆయన ఆస్ట్రేలియాలో పర్యటించినప్పటిది. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా వైరల్ వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వీడియోని అక్టోబర్ 2022లో పలు మీడియా సంస్థలు ప్రసారం (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) చేయడం గుర్తించాం. వీటి ప్రకారం, ఈ వీడియో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆస్ట్రేలియా పర్యటించిన నాటిది. మీడియా కథనాల ప్రకారం, ఆయన 21 అక్టోబర్ 2022 నుంచి 01 నవంబర్ 2022 వరకు ఆయన ఆస్ట్రేలియాలో పర్యటించారు.
అయితే, 24 ఫిబ్రవరి 2025న SLBC టన్నెల్ సహాయక చర్యలను పర్యవేక్షించిన వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, బంధువుల పెళ్లి సందర్భంగా తాను రెండు రోజులుగా విదేశాల్లో ఉన్నట్లు తెలిపారు. కొన్ని మీడియా కథనాలు (ఇక్కడ & ఇక్కడ) ఆయన అబుదాబికి(యుఏఈ) వెళ్లినట్లు వెల్లడించాయి.
చివరిగా, 2022లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆస్ట్రేలియా పర్యటన నాటి వీడియోని 2025 SLBC ప్రమాద సమయంలో దుబాయ్‌లో ఉన్నప్పటి వీడియో అంటూ షేర్ చేస్తున్నారు.