కర్ణాటక రాష్ట్రం దావణగెరె జిల్లాలోని కెరెబిలాచి గ్రామంలో ముస్లింలతో పాటు ఇతర మతస్థులు కూడా ఉన్నారు

కర్ణాటకలోని దావణగెరె జిల్లా చన్నగిరిలోని కెరెబిలాచి అనే గ్రామంలో ఒక్క హిందువు కూడా లేడంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్  వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కర్ణాటకలోని దావణగెరె జిల్లా చన్నగిరిలోని కెరెబిలాచి గ్రామంలో హిందువులు లేరు, ఆ గ్రామంలోని జనాబా అంతా ముస్లింలే.

ఫాక్ట్(నిజం): 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా, కెరెబిలాచి గ్రామానికి సంబంధించి భారత ఎన్నికల సంఘం వెలువరించిన ఓటర్ల జాబితా, కర్ణాటక రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు & వినియోగదారుల వ్యవహారాల శాఖ వారి వెబ్సైటులో కెరెబిలాచి గ్రామానికి సంబంధించిన ఆహార భద్రత కార్డులను పరిశీలించగా, కర్ణాటక రాష్ట్రం దావణగెరె జిల్లాలోని కెరెబిలాచి గ్రామంలో ముస్లింలతో పాటు ఇతర మతాలు వారు కూడా ఉన్నారు అని స్పష్టం అవుతుంది. కాకపోతే, ఇక్కడ మెజారిటీ ముస్లిం మతస్తులు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టిస్తుంది.

భారతదేశ అధికారిక 2011 జనాభా లెక్కల ప్రకారం కెరెబిలాచి గ్రామ జనాభా 9754 మంది. కర్ణాటకలోని దావణగెరె జిల్లా చన్నగిరిలోని కెరెబిలాచి గ్రామంలో హిందువులు ఉన్నారా?లేరా? అని తెలుసుకోవడానికి మేము ముందుగా భారత ఎన్నికల సంఘం వెబ్సైటులో ఇటీవల జరిగిన 2024 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా,కెరెబిలాచి గ్రామానికి సంబంధించి వెలువరించిన ఓటర్ల జాబితాలను పరిశీలించగా, ముస్లిమేతరుల పేర్లు కూడా అందులో దొరికాయి.

అలాగే, మేము కర్ణాటక రాష్ట్ర ఆహార, పౌర సరఫరాలు & వినియోగదారుల వ్యవహారాల శాఖ వారి అధికారిక వెబ్‌సైట్‌లో కెరెబిలాచి గ్రామానికి సంబంధించిన రేషన్ కార్డుల(ఆహార భద్రత కార్డులు) వివరాలను పరిశీలించగా, అందులో కూడా ముస్లిమేతరుల(హిందువుల) పేర్లు లభించాయి.

తదుపరి మేము కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారి వెబ్సైటులో కర్ణాటకలోని దావణగెరె జిల్లా చన్నగిరిలోని కెరెబిలాచి గ్రామానికి సంబంధించి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం క్రింద జారి అయిన జాబ్ కార్డులను (ఆర్కైవ్డ్ లింక్) పరిశీలించగా, అందులో కూడా ముస్లిమేతరుల(హిందువుల) కూడా ఉన్నాయి. కాకపోతే, ఇక్కడ మెజారిటీ ముస్లిం మతస్తులు

చివరగా, కర్ణాటక రాష్ట్రం దావణగెరె జిల్లాలోని కెరెబిలాచి గ్రామంలో ముస్లింలతో పాటు ఇతర మతాలు వారు కూడా ఉన్నారు.