5 ఆగష్టు 2020 న అయోధ్య రామ మందిరం యొక్క పునాది వేసే వేడుక జరగవచ్చని, దానికి ప్రధాని మోదీ వచ్చే అవకాశం ఉందని వివిధ వార్తాసంస్థలు రిపోర్ట్ చేసాయి. అయితే, అయోధ్యలో రామ మందిర నిర్మాణమంటూ జరిగితే తను ఆత్మహత్య చేసుకుంటానని కాంగ్రెస్ లీడర్ కపిల్ సిబల్ అన్నాడని, ఇప్పుడు నిర్మాణం మొదలవుతున్నందున ఆ విషయాన్ని కపిల్ సిబల్ కి గుర్తుచేస్తున్నట్టు చెప్తూ ఒక పోస్ట్ ని చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగితే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పిన కపిల్ సిబల్.
ఫాక్ట్ (నిజం): అయోధ్య రామ మందిరానికి సంబంధించి పోస్ట్ లోని వ్యాఖ్యలు కపిల్ సిబల్ చేసినట్టు ఎక్కడా కూడా సమాచారం లేదు. ఆ వ్యాఖ్యలు కపిల్ సిబల్ చేసినట్టు ప్రముఖ వార్తాసంస్థలు ఏవీ కూడా ఎక్కడా ప్రచురించలేదు. అంతేకాదు, అయోధ్య రామ మందిరం కేసు పై సుప్రీమ్ కోర్టు తీర్పు ఇచ్చాక మీడియాతో మాట్లాడుతూ ఆ తీర్పుని స్వాగతిస్తున్నానని కపిల్ సిబల్ చెప్పారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని వ్యాఖ్యలు కబిల్ సిబల్ చేసాడా అని ఇంటర్నెట్ లో వెతకగా, ఆ వ్యాఖ్యలు కబిల్ సిబల్ చేసినట్టు ఎక్కడా కూడా సమాచారం దొరకలేదు. ఒక వేళ నిజంగానే కబిల్ సిబల్ అలాంటి వ్యాఖ్యలు చేసినట్లైతే, అన్నీ ప్రముఖ వార్తాసంస్థలు వాటి గురించి ప్రచురించేవి. కానీ, పోస్ట్ లోని వ్యాఖ్యల గురించి ప్రముఖ వార్తాసంస్థలు ఏవీ కూడా ప్రచురించలేదు. నవంబర్ 2020 లో కోర్టు తీర్పు వచ్చినప్పుడు ఇలాంటి వ్యాఖ్యలే (“నేను బ్రతికి ఉండగా అయోధ్య లో రామ మందిరం కట్టనివ్వను”) కపిల్ సిబల్ అన్నట్టు ఒక పోస్ట్ వైరల్ అవ్వగా, అది కూడా తప్పే అని FACTLY రాసిన ఫ్యాక్ట్-చెక్ ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు.
అంతేకాదు, అయోధ్య రామ మందిరం కేసు పై సుప్రీమ్ కోర్టు తీర్పు ఇచ్చాక మీడియాతో మాట్లాడుతూ ఆ తీర్పుని స్వాగతిస్తున్నానని కపిల్ సిబల్ చెప్పినట్టు ఇక్కడ చూడవొచ్చు. తీర్పుకు ముందు కూడా, ‘దేవుడు అనుకున్నప్పుడే రామ మందిరం కట్టబడుతుంది. మోదీ చెప్పినప్పుడు కాదు. ప్రస్తుతానికి కేసు కోర్టులో ఉంది’, అని కపిల్ సిబల్ వ్యాఖ్యలు చేసినట్టు ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.
చివరగా, అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగితే ఆత్మహత్య చేసుకుంటానని కపిల్ సిబల్ అనలేదు.