కరోనావైరస్ చికిత్స విధానాలపై మరియు అది వైరస్ కాదు బాక్టీరియా అని ఇటలీ ప్రభుత్వం చెప్పలేదు

కరోనావైరస్ పై వచ్చిన కొత్త థియరీలు అని చెబుతూ ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ షేర్ అవుతుంది.  ఆ పోస్ట్ లో ఇటలీ వాళ్ళు  కరోనావైరస్ ని,  వైరస్ కాదు బాక్టీరియా అని అంటున్నారని , దాని ద్వారా DIC (disseminated intravascular coagulation) వ్యాధి వస్తుందని, ఆస్ప్రిన్ ద్వారా ఆ వ్యాధిని నయం చేయవచ్చని అంటున్నారని క్లెయిమ్ చేస్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: కరోనావైరస్, వైరస్ కాదు బాక్టీరియా, మరియు ఆస్ప్రిన్ ఔషధం ఉపయోగించి ఆ వ్యాధిని నయం చేయవచ్చని అంటున్న ఇటలీ.

ఫాక్ట్ (నిజం): కరోనా వైరస్ గురించి పోస్ట్ లో చెప్పిన విషయాలను ఇటలీ వెల్లడించలేదు. ఇందులో చెప్పినవన్నీ తప్పు అని ఇటలీ యొక్క ‘Ministry of health’ వైబ్సైట్ లో చూడవచ్చు. కావున పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.    

పోస్ట్ లో ఇటలీ COVID-19 ని  వైరస్ కాదు బాక్టీరియా అని అంటుంది అని ఉంది. కానీ, ఇటలీ కి సంబంధించిన ‘Ministero della Salute’ (ఆరోగ్య మంత్రిత్వ శాఖ)  వెబ్సైట్ లో COVID-19 వ్యాధి SARS-COV-2 అనే వైరస్ ద్వారా సోకుతుందని ఉంది. అంతేకాక, ఈ వైరస్ బాక్టీరియా ద్వారా సోకుతుందనే ఆరోపణను తప్పు అని చెప్పారు. కావున, ఇటలీ అంతకు ముందున్న అభిప్రాయానికి వ్యతిరేకంగా ఎలాంటి క్లెయిమ్ చేయలేదు.

పోస్ట్ లో కరోనా వైరస్ ద్వారా DIC వ్యాధి వస్తుందని, ఆ వ్యాధి వచ్చిన వారికి ఆస్ప్రిన్ 100mg మందు ఇస్తే కోలుకుంటున్నారని ఉంది. కానీ ఇటలీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్సైట్ లో COVID-19  చికిత్స లో ఇంకా ఏ ఔషధం సరైన ప్రభావాన్ని చూపెట్టలేదని మరియు COVID-19 ని నయం చేయడానికి ఏ నిర్దిష్టమైన మందు లేదు అని ఉంది. అందులో రోగుల లక్షణాలని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుందని,  ఆక్సిజన్ థెరపీ, ఫ్లూయిడ్ మేనేజ్‌మెంట్ లాంటి సహాయక చికిత్సలే రోగులకు చేస్తారని, అవి చాలా ప్రభావవంతంగా ఉంటాయని చదవవచ్చు. COVID-19 ఔషధం కోసం అనేక క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి అని ఆ వెబ్సైటు లో ఉంది.  WHO వారి వెబ్‌సైట్‌ లో కూడా అదే విషయాన్ని చదవవచ్చు.

ఇటలీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ COVID-19 వ్యాధికి ఔషధం కనిపెట్టినట్టు అవుతున్న ప్రచారంలో నిజం లేదని తెలిపారు.

కరోనా రోగుల కోసం అందుబాటులో ఉంచిన కొన్ని మందులను ఇటాలియన్ మెడిసిన్స్ ఏజెన్సీ – AIFA వెబ్‌సైట్‌ లో చూడవచ్చు. COVID-19 రోగులలో నాన్ స్టెరాయిడల్ యాంటీ-ఇన్ఫల్మె టరీ డ్రగ్స్ (NSAIDS) వాడకం పై 19 ఏప్రిల్ 2020న ‘WHO’ చేసిన సైంటిక్ బ్రీఫ్ లో NSAID లు వాడడం వలన  COVID-19 ఉన్న రోగులలో తీవ్రమైన ప్రతికూల ప్రభావం, దీర్ఘకాలిక  జీవన ప్రమాణాలు మెరుగవుతాయని అనటానికి ప్రస్తుతం ఎటువంటి ఆధారాలు లేవు అని ఉంది.

అంతేకాక, కేంద్ర ప్రభుత్వ అధికారిక పౌర సమాచార శాఖ, PIB (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) వారు కూడా COVID-19 ని ఆస్ప్రిన్ నయం చేస్తుంది అని ఉన్న మెసేజ్ ఫేక్ అని ట్వీట్ చేసింది.

చివరగా, పోస్ట్ లో చెప్పినట్టు కరోనావైరస్ పై ఇటలీ ఎటువంటి కొత్త వాదనలు చేయలేదు. 

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?