2014 నుండి ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడుల్లో ఒక్కరు కూడా చనిపోలేదన్న వాదనలో నిజం లేదు

2014 నుండి భారత దేశంలో ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడిలో మరణించలేదని చేప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 2014 నుండి ఇప్పటి వరకి ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడిలో ఒక్కరు కూడా మరణించలేదు.

ఫాక్ట్ (నిజం): లోక్ సభ లో భారత ప్రభుత్వం సమర్పించిన సమాచారం ప్రకారం 2014-18 మధ్య కాలంలో ఇస్లామిక్ ఉగ్రవాద ఘటనల్లో జమ్మూ కాశ్మీర్ మినహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాద ఘటనల్లో 11 మంది సాధారణ పౌరులు చనిపోగా, 11 మంది రక్షణ సిబ్బంది చనిపోయారు. అదే జమ్మూ కాశ్మీర్ లో 2014-2018 మధ్య కాలంలో ఉగ్రవాద ఘటనల్లో 139 మంది సాధారణ పౌరులు చనిపోగా, 339 మంది రక్షణ సిబ్బంది చనిపోయారు.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

25 జూన్ 2019న లోక్ సభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి భారత దేశంలో జరిగిన ఉగ్రవాద ఘటనలకి సంబంధించిన ప్రశ్నకి ఇచ్చిన జవాబు ప్రకారం 2014-2018 మధ్య కాలంలో జమ్మూ కాశ్మీర్ మినహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాద ఘటనల్లో 11 మంది సాధారణ పౌరులు చనిపోగా, 11 మంది రక్షణ సిబ్బంది చనిపోయారు. అదే జమ్మూ కాశ్మీర్ లో  2014-2019 మధ్య కాలంలో ఉగ్రవాద ఘటనల్లో 178 మంది సాధారణ పౌరులు చనిపోగా, 419 మంది రక్షణ సిబ్బంది చనిపోయారు.

అలాగే 03 మార్చ్ 2020న ఒక ప్రశ్నకి కేంద్రహోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి జవాబిస్తూ 2019లో జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద ఘటనల్లో 39 మంది సాధారణ పౌరులు చనిపోగా 80 మంది రక్షణ సిబ్బంది చనిపోయారు అని తెలిపారు.

South Asia Terrorism Portal’ లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 2014 నుండి 24 సెప్టెంబర్ 2020 మధ్య కాలంలో జమ్మూ కాశ్మీర్, పంజాబ్ మరియు ఈశాన్య రాష్ట్రాలను మినహాయించి మిగతా రాష్ట్రాల్లో ఇస్లామిక్ ఉగ్రవాద దాడుల్లో నలుగురు సాధారణ పౌరులు చనిపోగా ఆరుగురు బద్రత సిబ్బంది చనిపోయారు. ఐతే ఈ వెబ్సైటు ప్రకారం 2014 కన్నా ముందు సంవత్సరాలతో పోల్చుకుంటే 2014 నుండి ఉగ్ర దాడుల వల్ల చనిపోయిన వారి సంఖ్య తక్కువగా ఉంది. వీటన్నిటి ఆధారంగా 2014 నుండి ఇప్పటి వరకు ఇస్లామిక్ ఉగ్రవాద దాడుల్లో ఒక్కరు కూడా చనిపోలేదన్న వాదనలో నిజంలేదని కచ్చితంగా చెప్పొచ్చు.

చివరగా, 2014 తరవాత ఇస్లామిక్ ఉగ్ర దాడుల్లో ఒక్కరు కూడా చనిపోలేదన్నది నిజం కాదు.