ఈ వీడియోలో ‘భారత్ మాతాకు జై’ అంటూ నినాదాలు చేస్తుంది ఇంగ్లాండ్ క్రికెటర్ సామ్ కరన్ కాదు, ఆస్ట్రేలియాకు చెందిన ఒక క్రికెట్ అభిమాని

IPLలో పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సామ్ కరన్ ఒక విదేశీ అయ్యుండి కూడా భారత్ కు అనుకూలంగా నినాదాలు చేసాడంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ ఉంది. వీడియోలోని వ్యక్తి స్టేడియంలో అందరిముందు ‘భారత్ మాతాకు జై’, ‘వందేమాతరం’ అంటూ నినాదాలు చేయడం చూడొచ్చు (ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఈ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం. 

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పంజాబ్ కింగ్స్ IPL జట్టు కెప్టెన్‌ సామ్ కరన్ ‘భారత్ మాతాకు జై’, ‘వందేమాతరం’ అంటూ నినాదాలు చేసిన వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వీడియోలో ‘భారత్ మాతాకు జై’ అంటూ నినాదాలు చేస్తుంది ఇంగ్లాండ్ క్రికెటర్ సామ్ కరన్ కాదు. అతనిని పోలి ఉన్న ‘జాక్ జేయాకింగ్స్’ అనే వ్యక్తి. ఇతను ఆస్ట్రేలియాకు చెందిన ఒక క్రికెట్ అభిమాని. ఏప్రిల్ 2024లో పంజాబ్‌లోని ముల్లన్‌పూర్‌లో ముంబై మరియు పంజాబ్‌ మధ్య జరిగిన IPL మ్యాచ్ సందర్బంగా అతను ఇలా నినాదాలు చేసాడు. ఈ వీడియోను వార్తా సంస్థలు కూడా రిపోర్ట్ చేశాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వీడియోలోని వ్యక్తి ఇంగ్లాండ్ క్రికెటర్ సామ్ కరన్ కాదు. అతనిని పోలి ఉన్న ఆస్ట్రేలియాకు చెందిన ఒక క్రికెట్ అభిమాని. ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియోకు సంబంధించి సమాచారం కోసం ఇంటర్నెట్‌లో వెతకగా ‘జాక్ జేయాకింగ్స్’ అనే వ్యక్తి ఇదే వీడియోను 19 ఏప్రిల్ 2024న తన ఇంస్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్ట్ మాకు కనిపించింది.

ఇతని ఇంస్టాగ్రామ్ బయో ప్రకారం ఇతను ఆస్ట్రేలియాకు చెందిన ఒక క్రికెట్ అభిమాని. ఇతనిని భారత్‌కు చెందిన ‘urpopular.india’ అనే సంస్థ ఇతనికి భారత్ లో మార్కెటింగ్ చేస్తుందని పేర్కొన్నారు. కాగా ఈ సంస్థ ఇంస్టాగ్రామ్ బయో ప్రకారం ఇది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ నిర్వహిస్తుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వ్యక్తి సామ్ కరన్‌ను పోలి ఉండడంతో అతనికి మార్కెటింగ్ నిర్వహిస్తుందని అర్థంచేసుకోవచ్చు. ఈ సంస్థ ఇంస్టాగ్రామ్ పేజీలో అతని వీడియోలు కూడా చూడొచ్చు.

ఈ వీడియోకు సంబంధించి మరింత సమాచారం కోసం వెతకగా ఇదే వీడియోను రిపోర్ట్ చేసిన వార్తా కథనం మాకు కనిపించింది. ఈ కథనం ప్రకారం ఈ వీడియో లోని దృశ్యాలు 18 ఏప్రిల్ 2024 నాడు పంజాబ్‌లోని ముల్లన్‌పూర్‌లో ముంబై మరియు పంజాబ్‌ మధ్య జరిగిన IPL మ్యాచ్ సందర్బంగా జరిగినవి. ఈ కథనాలు కూడా ఇతనిని ఆస్ట్రేలియాకు చెందిన ఒక క్రికెట్ అభిమాని ‘జాక్ జేయాకింగ్స్’ గానే గుర్తించాయి. అలాగే ఇదే మ్యాచ్‌లో ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు అనుకూల నినాదాలు చేసినట్టు కూడా రిపోర్ట్స్ ఉన్నాయి.  

కాగా జాక్ జేయాకింగ్స్ ఇలా భారత్ అనుకూల నినాదాలు చేయడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో కూడా ఇతను ఇలా చేసిన వీడియోలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

చివరగా, ఈ వీడియోలో ‘భారత్ మాతాకు జై’ అంటూ నినాదాలు చేస్తుంది ఇంగ్లాండ్ క్రికెటర్ సామ్ కరన్ కాదు, ఆస్ట్రేలియాకు చెందిన ఒక క్రికెట్ అభిమాని.