ఈ వాదనల ద్వారా మోదీ M.A. సర్టిఫికేట్ నకిలీదని నిర్ధారించలేము

ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీ డిగ్రీ వివరాలపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో, 1983లో గుజరాత్ విశ్వవిద్యాలయం జారీ చేసిన మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ (M.A.) సర్టిఫికేట్‌పై చర్చలు తీవ్రమయ్యాయి. ఈ సర్టిఫికేట్ పూర్తి ప్రామాణికతను మేము స్వతంత్రంగా నిర్ధారించలేనప్పటికీ దీనిపై చేసిన నిర్దిష్ట వాదనలను (ఇక్కడ మరియు ఇక్కడ) ఈ వ్యాసం ద్వారా పరిశీలిద్దాం.

క్లెయిమ్: 1983 నాటికి డిగ్రీ సర్టిఫికెట్లను కేవలం చేతితో రాసేవారు. అప్పటికి ప్రింట్ చేసిన సర్టిఫికేట్లు లేవు. మోదీ M.A. సర్టిఫికెట్లో ఉపయోగించిన అక్షర శైలి 1992లో రూపొందించినది. ‘University’ పదాన్ని ‘Unibersity’ అని తప్పుగా ముద్రించారు. సర్టిఫికెట్లో సంతకం చేసిన గుజరాత్ విశ్వవిద్యాలయ ఉప కులపతి అయిన ప్రొ. కె.ఎస్. శాస్త్రి 1981లోనే పదవీ విరమణ చేశారు.

ఫాక్ట్: 1920 నాటి నుంచే దేశంలో ప్రింట్ చేసిన విద్యా సర్టిఫికెట్లను జారీ చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. 1990లలో రూపొందించిన ‘Old English Text MT’, ‘marriage’ ఫాంట్‌లను ఈ సర్టిఫికెట్లో వాడలేదు. ‘University’ అనే పదాన్ని సరిగ్గానే ముద్రించారు. కె.ఎస్. శాస్త్రి 1980-81 లో సౌత్ గుజరాత్ విశ్వవిద్యాలయానికి, 1981-87 మధ్య కాలంలో గుజరాత్ విశ్వవిద్యాలయానికి వైస్ చాన్సలర్‌గా పని చేశారు. కావున పోస్టులో చేయబడ్డ ఈ క్లెయిమ్స్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

1992లో రూపొందించిన అక్షర శైలిని మోదీ సర్టిఫికేట్లో ఉపయోగించారా?

సర్టిఫికెట్లో వాడిన అక్షర శైలి(Font) 1992లో మైక్రోసాఫ్ట్ కాపీరైట్ పొందిన ‘Old English Text MT’ అని కొందరు పేర్కొన్నారు. అయితే సర్టిఫికెట్లో ఉన్న అక్షర శైలితో దీన్ని పోల్చిచూడగా, రెండూ వేరు అని తెలిసింది.

అదే విధంగా, సర్టిఫికెట్లో వాడిన అక్షర శైలి 1992లో రూపొందించిన ‘marriage’ ఫాంట్ అని మరికొందరు పేర్కొన్నారు. సాధారణంగా చూస్తే ఇవి రెండూ ఒకే అక్షర శైలిలాగా కనిపిస్తాయి. కానీ, ఒక్కో అక్షరాన్ని జాగ్రత్తగా గమనిస్తే స్వల్ప తేడాలను గుర్తించవచ్చు. ఉదాహరణకు సర్టిఫికెట్లో ఉన్న ‘M’, ‘A’, ‘v’ అక్షరాలను ‘marriage’ ఫాంట్ అక్షరాలతో పోల్చి చూడగా రెండూ ఒకటి కాదని తెలుస్తుంది.

అదనంగా, ‘Old English Text MT’ ఫాంట్ కాపీరైట్‌ని కలిగిన సంస్థ అయిన మోనోటైప్ కార్పొరేషన్ వెబ్‌సైట్‌తో సహాయ మరికొన్ని వెబ్‌సైట్లలో పరిశీలించినా కూడా ఈ ఫాంట్ సర్టిఫికెట్లో ఉండే అక్షర శైలితో సరిపోలేదు.

పై ఆధారాలను బట్టి, 1990 లలో రూపొందించిన ‘Old English Text MT’ మరియు ‘marriage’ ఫాంట్లను మోది M. A. సర్టిఫికెట్లో వాడలేదని నిర్ధారించవచ్చు.

1983 నాటికి చేతితో రాసిన సర్టిఫికెట్లు మాత్రమే ఉండేవా?

ఈ విషయంపై నిజానిజాలను తెలుసుకోవడానికి మేము బీ.ఆర్. అంబేద్కర్, ఎం.కె. గాంధీ, జగదీష్ చంద్రబోస్, నోబెల్ గ్రహీత లైనస్ పాలింగ్ వారి సర్టిఫికేట్లను పరిశీలించగా, కేవలం కొన్ని మినహాయిస్తే మిగతావన్నీ కూడా ప్రింట్ చేసినవిగా గుర్తించాం. అలాగే, 1979లో గుజరాత్ యూనివర్సిటీకి చెందిన సర్టిఫికెట్లో కూడా ప్రింటింగ్ ఉండటాన్ని ఇక్కడ చూడవచ్చు. ఈ ఆధారాలను బట్టి, 1983 నాటికి కేవలం చేతితో రాసిన సర్టిఫికేట్లను మాత్రమే జారీ చేసే వాళ్లని జరిగే ప్రచారంలో ఎటువంటి నిజం లేదని నిర్ధారించవచ్చు.

పైగా, 15వ శతాబ్దంలోనే ప్రింటింగ్ ప్రెస్ మరియు 19 శతాబ్దంలో టైపు రైటర్లు వాడుకలోకి వచ్చిన కారణంగా 1980లలో సర్టిఫికెట్లను ప్రింట్ చేయడమనేది సాధారణ ప్రక్రియగా ఉంటుంది.

‘University’ పదాన్ని ‘Unibersity’ అని తప్పుగా రాశారా?

ఈ విషయాన్ని నిర్ధారించడానికి, సర్టిఫికెట్లో ఉన్న అక్షరాలని ‘Font Detection Website’లలో అప్‌లోడు చేయగా Mariage Pro Regular, Lincoln Text Pro, Wedding Text Standard Regular, Black Letter మొదలగు ఫాంట్లు సర్టిఫికెట్లో ఉన్న అక్షర శైలికి దగ్గరగా ఉన్నట్లు గుర్తించాం. వీటిలో ‘Lincoln Text Pro’ ఫాంట్లోని ‘v’ అక్షరం ‘b’ అక్షరంవలె ఉండటం చూడవచ్చు. కానీ జాగ్రత్తగా పరిశీలించగా, ‘b’ అక్షరంలోని గీత నిటారుగా ఉంటుంది. అదే ‘v’ అక్షరంలోని గీత కొంచెం ఒంపు తిరిగి ఉంటుంది.

పైన ఇచ్చిన బి. ఆర్. అంబేద్కర్ యొక్క సర్టిఫికెట్లో కూడా ఇదే ఉండటం గమనించవచ్చు. ఈ ఆధారాలని బట్టి, సర్టిఫికెట్లో ‘University’ పద్యం సరిగ్గానే ఉందని స్పష్టమవుతుంది.

సర్టిఫికెట్లో సంతకం చేసిన వైస్ చాన్సలర్ 1981లోనే పదవీ విరమణ చేశాడా?

ముందుగా సర్టిఫికెట్లో సంతకం చేసిన వైస్ చాన్సలర్ ప్రొ. కె.ఎస్. శాస్త్రి గురించి వెతకగా, ఆయన ‘వీర్ నర్మద్ సౌత్ గుజరాత్ యూనివర్సిటీ’ వైస్  చాన్సలర్‌గా 22 ఆగస్టు 1980 నుంచి 13 జులై 1981 వరకు పని చేసినట్లు ఆ యూనివర్సిటీ వెబ్‌సైట్లలో పేర్కొన్నారు.

ఇక ఆయన గుజరాత్ యూనివర్సిటీలో వైస్ చాన్సలర్‌గా చేసింది 1981 నుంచి 1987 వరకు అని యూనివర్సిటీ వెబ్‌సైట్లో పేర్కొన్నారు.

చివరిగా, నరేంద్ర మోదీ M.A. సర్టిఫికేట్ ప్రామాణికతను మేము స్వతంత్రంగా నిర్ధారించలేనప్పటికీ, పైన చేసిన వాదనలు సరైనవి కానందున, వీటి ఆధారంగా ఆ సర్టిఫికేట్ నకిలీదని చెప్పడానికి వీలు కాదు.