భారత రైల్వే ఫిబ్రవరి 2025 నాటికి రైల్వే టిక్కెట్లపై సీనియర్ సిటిజన్లకు రాయితీను పునరుద్ధరించలేదు

“భారత రైల్వే సీనియర్ సిటిజన్ల కోసం కొత్త విధానాన్ని ప్రకటించింది, ఈ కొత్త విధానం ప్రకారం, సీనియర్ సిటిజన్లకు రైలు టిక్కెట్లపై 50% వరకు తగ్గింపు లభిస్తుంది” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: సీనియర్ సిటిజన్లకు రైలు టిక్కెట్లపై 50% తగ్గింపును అందించే కొత్త విధానాన్ని భారతీయ రైల్వే ప్రకటించింది.

ఫాక్ట్(నిజం): సీనియర్ సిటిజన్లకు రైలు టిక్కెట్లపై 50% తగ్గింపు అందించడానికి భారత రైల్వేలు ఎటువంటి కొత్త విధానాన్ని ప్రకటించలేదు. IRCTC పోర్టల్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు సాధారణ ప్రయాణీకుల మాదిరిగానే ఛార్జీలు వసూలు చేయబడుతున్నాయి. మార్చి 2020 లో సీనియర్ సిటిజన్లకు రైలు టిక్కెట్లపై రాయితీలను భారత రైల్వే నిలిపివేసింది. ఆర్థిక పరిమితుల కారణంగా సీనియర్ సిటిజన్లకు రైలు టిక్కెట్లపై రాయితీలను పునరుద్ధరించే ప్రణాళికలు లేవని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో పలుమార్లు స్పష్టం చేసింది. అలాగే 2025-26 కేంద్ర బడ్జెట్‌లో సీనియర్ సిటిజన్లకు రైలు టిక్కెట్లపై రాయితీలను పునరుద్ధరించే అంశం గురించి ప్రస్తావించలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

కోవిడ్-19 వ్యాప్తిని నివారించే చర్యల్లో భాగంగా, కేంద్ర ప్రభుత్వం మార్చి 2020లో కోవిడ్-19 వ్యాప్తి నివారణ చర్యలలో భాగంగా రైళ్లలో వృద్ధుల రాయితీతో సహ పలు రాయితీలను ఎత్తివేసింది (ఆర్కైవ్డ్). వృద్ధులకు ఇచ్చే రాయితీని తొలగించక ముందు భారత రైల్వేలు అన్ని రైళ్లలో (మెయిల్/ఎక్స్‌ప్రెస్/రాజధాని/శతాబ్ది/జన్ శతాబ్ది/దురంతో రైళ్లలో) 58 ఏళ్ల దాటిన మహిళలకు టికెట్ ఛార్జీలలో 50% తగ్గింపు మరియు 60 ఏళ్లు దాటిన పురుషులకు టికెట్ ఛార్జీలలో 40% రాయితీ కల్పించేది. అయితే తిరిగి సీనియర్ సిటిజన్లకు రైల్వే టిక్కెట్లపై రాయితీలనుపునరుద్ధరిస్తున్నట్లు రైల్వేశాఖ ఎక్కడా వెల్లడించలేదు. అలాగే, IRCTC పోర్టల్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ప్రస్తుతం సీనియర్ సిటిజన్లకు సాధారణ ప్రయాణీకుల మాదిరిగానే ఛార్జీలు వసూలు చేయబడుతున్నాయి.

సీనియర్ సిటిజన్లకు రైలు టిక్కెట్లపై రాయితీలను పునరుద్ధరించే ప్రణాళికలు లేవని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో పలుమార్లు స్పష్టం చేశారు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). జులై 2022లో వృద్ధుల రాయితీ పునరుద్ధరణకు సంబంధించి అడిగిన ప్రశ్నకు రైల్వేశాఖ మంత్రి  అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో సమాధానమిస్తూ, ప్రయాణీకులకు రాయితీల వలన ప్రభుత్వంపై మోయలేని భారం పడుతుందని, కోవిడ్-19 కారణంగా ప్రయాణికుల టికెట్ల ఆదాయం తగ్గిపోయిందని, వయో వృద్ధులు సహా మొత్తం అన్ని వర్గాలకూ రాయితీలను విస్తరించడం వాంఛనీయం కాదని తెలిపారు. టికెట్ ధర తక్కువగా ఉన్న కారణంగా ప్రయాణ వ్యయంలో సగటున 50 శాతాన్ని రైల్వే శాఖే భరిస్తోందని, ఇలాంటి పరిస్థితులలో కూడా వైకల్యం ఉన్న వారికి, రోగులకు, విద్యార్థులకు రాయితీలను కొనసాగిస్తున్నట్టు అశ్విని వైష్ణవ్ తెలిపారు. అలాగే జనవరి 2023లో వయోవృద్ధుల రాయితీలను రైల్వే శాఖ తిరిగి ప్రవేశపెట్టాలని కోరుతూ ఎం. కె. బాలకృష్ణన్ అనే వ్యక్తి సుప్రీం కోర్టులో కేసు వేయగా (రిట్ పిటిషన్ నంబర్ 494/2023), ఈ విషయంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోలేదని, వృద్ధుల అవసరాలు, రైల్వే శాఖ లాభనష్టాల ప్రకారం ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని పేర్కొంటూ ఏప్రిల్ 2023లో సుప్రీంకోర్టు ఈ రిట్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు కాపీని ఇక్కడ చూడవచ్చు.

డిసెంబర్ 2024లో, తిరుచిరాపల్లి ఎంపీ దురై వైకో సీనియర్ సిటిజన్లకు, గుర్తింపు పొందిన జర్నలిస్టులకు రాయితీలు ఇచ్చే అంశంపై లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు రైల్వేశాఖ మంత్రి  అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో సమాధానమిస్తూ, భారత ప్రభుత్వం అన్ని వర్గాల (సీనియర్ సిటిజన్‌లతో సహా) ప్రయాణీకులకు ప్రస్తుతం అందించే మొత్తం సబ్సిడీ ₹56,993 కోట్లు అని అన్నారు. అలాగే రైల్వే ప్రయాణీకుల రవాణా కోసం ₹100 ఖర్చు చేస్తే, ప్రయాణీకుల నుండి ₹54 మాత్రమే వసూలు చేస్తుందని, అంటే భారతీయ రైల్వే ఇప్పటికే ఒక్కో ప్రయాణీకుడికి టికెట్‌కు ₹46 సబ్సిడీని అందిస్తుంది అని పేర్కొన్నారు.

అలాగే, నవంబర్ & డిసెంబర్ 2024లో, సీనియర్ సిటిజన్లకు రైల్వే టిక్కెట్లపై రాయితీలు ఇచ్చే అంశంపై పలువురు ఎంపీలు లోక్‌సభలో అడిగిన ప్రశ్నలకు రైల్వేశాఖ మంత్రి  అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో సమాధానమిస్తూ, ఇదే విషయాన్ని తెలియజేశారు (ఇక్కడ,& ఇక్కడ). అంతేకాకుండా, 2025-26 కేంద్ర బడ్జెట్‌లో కూడా సీనియర్ సిటిజన్లకు రైలు టిక్కెట్లపై రాయితీలను పునరుద్ధరించే అంశం గురించి ప్రస్తావించలేదు.

చివరగా, ఫిబ్రవరి 2025 నాటికి, సీనియర్ సిటిజన్లకు రైల్వే టిక్కెట్లపై రాయితీలు అందించడానికి భారత రైల్వేలు ఎటువంటి కొత్త విధానాన్ని ప్రకటించలేదు.