“భారతీయ రైల్వేలు/IRCTC తత్కాల్, ప్రీమియం తత్కాల్ రైలు టికెట్ బుకింగ్ సమయాలు, నియమాలను సవరించింది, ఈ కొత్త నియమాలు 15 ఏప్రిల్ 2025 నుండి అమలులోకి వస్తాయి” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: భారతీయ రైల్వేలు/IRCTC తత్కాల్, ప్రీమియం తత్కాల్ రైలు టికెట్ బుకింగ్ సమయాలు, నియమాలను సవరించింది, ఈ కొత్త నియమాలు 15 ఏప్రిల్ 2025 నుండి అమలులోకి వస్తాయి.
ఫాక్ట్(నిజం): ఏప్రిల్ 2025లో IRCTC తత్కాల్ బుకింగ్ సమయాలు, నియమాలను మార్చలేదు. తత్కాల్, ప్రీమియం తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ సమయాల్లో ఎటువంటి మార్పు లేదని, IRCTC ఏజెంట్లకు అనుమతించబడిన బుకింగ్ సమయాల్లో కూడా ఎటువంటి మార్పు లేదని IRCTC 11 ఏప్రిల్ 2025న X(ట్విట్టర్)లో స్పష్టం చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా, ఇటీవల ఏప్రిల్ 2025లో IRCTC తత్కాల్, ప్రీమియం తత్కాల్ రైలు టికెట్ బుకింగ్ సమయాలు, నియమాలను సవరించిందా? లేదా? అని తెలుసుకోవడానికి, మేము ముందుగా IRCTC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాము. అయితే, అక్కడ తత్కాల్ టికెట్ బుకింగ్ సమయాలను IRCTC మార్చినట్లు లేదా త్వరలో మారుస్తున్నట్లు ఎలాంటి సమాచారం మాకు లభించలేదు. తత్కాల్ టిక్కెట్ల బుకింగ్‌కు సంబంధించి IRCTC వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, రైలు ప్రారంభ స్టేషన్ నుండి బయలుదేరే తేదీకి ఒక రోజు ముందుగా తత్కాల్ ఇ-టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. AC తరగతులకు (2A/3A/CC/EC/3E) ఉదయం 10:00 గంటలకు, నాన్-AC తరగతులకు (SL/FC/2S) ఉదయం 11:00 గంటలకు తత్కాల్ బుకింగ్‌లు ప్రారంభమవుతాయి. ఉదాహరణకు, ఒక రైలు నెల రెండవ తేదీన ప్రారంభ స్టేషన్ నుండి బయలుదేరాల్సి ఉంటే, నెల మొదటి తేదీన AC తరగతులకు ఉదయం 10:00 గంటలకు, నాన్-AC తరగతులకు ఉదయం 11:00 గంటలకు తత్కాల్ బుకింగ్‌లు ప్రారంభమవుతాయి (ఇక్కడ, ఇక్కడ).
అలాగే, తత్కాల్, ప్రీమియం తత్కాల్ బుకింగ్ సమయాలను సవరించాలని లేదా సమీప భవిష్యత్తులో తత్కాల్ బుకింగ్‌కు సంబంధించి ఏవైనా కొత్త నియమాలను ప్రవేశపెట్టాలని IRCTC యోచిస్తోందా? అని తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతకగా, తత్కాల్ బుకింగ్‌కు సంబంధించి IRCTC మార్పులు చేసింది అనే వార్తలను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అధికారికంగా తోసిపుచ్చిందని పేర్కొంటూ పలు మీడియా సంస్థలు ప్రచురించిన కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ).
IRCTC తత్కాల్ బుకింగ్ సమయాలు మార్చిందని పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ కాగా, 11 ఏప్రిల్ 2025న IRCTC తన అధికారిక X (ట్విట్టర్) హ్యాండిల్‌లో స్పందిస్తూ, “తత్కాల్ మరియు ప్రీమియం తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ సమయాల్లో ఎటువంటి మార్పు లేదని, IRCTC ఏజెంట్లకు అనుమతించబడిన బుకింగ్ సమయాల్లో కూడా ఎటువంటి మార్పు లేదని” స్పష్టం చేసింది.
అలాగే, 11 ఏప్రిల్ 2025న, భారత ప్రభుత్వ PIB ఫ్యాక్ట్ చెక్ యూనిట్ కూడా తన అధికారిక X (గతంలో ట్విట్టర్)లో వైరల్ పోస్టులపై స్పందిస్తూ, IRCTC తత్కాల్ బుకింగ్‌కు సమయాలలో మార్పులు చేసింది అనే వార్తలో నిజం లేదని స్పష్టం చేసింది. “AC లేదా నాన్-AC తరగతులకు ప్రస్తుత తత్కాల్ లేదా ప్రీమియం తత్కాల్ బుకింగ్ షెడ్యూల్‌లలో ఎటువంటి మార్పులు లేవు, ఏజెంట్లకు అనుమతించబడిన బుకింగ్ సమయాలు మారలేదు” అని ఈ పోస్టులో పేర్కొంది.
చివరగా, IRCTC తత్కాల్ బుకింగ్ సమయాలు మార్చిందని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ సమయాలలో ఎటువంటి మార్పులు చేయలేదని IRCTC స్పష్టం చేసింది.