తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) చెందిన 1400 కేజీల బంగారాన్ని సీజ్ చేసిన ఘటన 2019 ఎన్నికలప్పటిది

తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) సంబంధించిన 1400కేజీల బంగారాన్ని ఇటీవల మూడు వాహనాలలో అక్రమంగా తరలిస్తుండగా చెన్నై పోలీసులు పట్టుకున్నారు, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. ఈ బంగారం టీటీడీకి సంబంధించినదని తరలిస్తున్న సిబ్బంది, తిరువళ్లూరు ఎస్పీ ప్రకటించినప్పటికీ, దీనికి సంబంధించి టీటీడీ చైర్మన్, ఈవో లేదా మరే ఇతర అధికారులు ఇప్పటివరకు స్పందించలేదని ఈ పోస్టులో ఆరోపిస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.  

YouTube Poster

క్లెయిమ్: తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) సంబంధించిన 1400 కేజీల బంగారాన్ని మూడు వాహనాలలో అక్రమంగా తరలిస్తుండగా ఇటీవల చెన్నై పోలీసులు పట్టుకున్నారు.

ఫాక్ట్ (నిజం): 2019లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ చెన్నై నుండి 1400 కేజీల బంగారాన్ని టీటీడీకి తరలిస్తుండగా ఎన్నికల కమిషన్‌కు చెందిన స్టాటిక్ సర్వేలియన్స్ టీం (SST) వాటిని పట్టుకొని సీజ్ చేసింది. టీటీడీతో కుదుర్చుకున్న మూడేళ్ళ ఒప్పందం ముగియడంతో, పంజాబ్ నేషనల్ బ్యాంక్ టీటీడీకి ఇవ్వవలిసిన బంగారాన్ని చెన్నై నుండి తరలిస్తుండగా ఎన్నికల కమిషన్ అధికారులు తమిళనాడు తిరువళ్లూరు జిల్లాలో పట్టుకున్నారు. సంబంధిత పత్రాలని, వివరాలని తనిఖీ చేసిన తరువాత ఎన్నికల కమిషన్ అధికారులు సీజ్ చేసిన బంగారాన్ని తిరిగి టీటీడీకి అప్పచెప్పింది. పోస్టులో తెలుపుతున్న సంఘటన పాతది, ఈ బంగారాన్ని టీటీడీ తరలిస్తుండగా పోలీసులు పట్టుకోలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.  

పోస్టులో తెలుపుతున్న సంఘటనకు సంబంధించిన వివరాల కోసం ఇంటర్నెట్లో వెతికితే, 2019లో చెన్నై నుండి 1400కేజీల బంగారాన్ని మూడు వాహనాలలో తరలిస్తుండగా ఎన్నికల కమిషన్‌కు చెందిన స్టాటిక్ సర్వేలియన్స్ టీం (SST) వాటిని పట్టుకొని సీజ్ చేసినట్టు తెలిసింది. ఈ వాహనాలలో 22 కిలోల బంగారం కలిగి ఉన్న 56 బాక్సులను పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ బంగారాన్ని టీటీడీకి తరలిస్తుండగా ఎన్నికల కమిషన్ అధికారులు పట్టుకున్నట్టు పలు వార్తా సంస్థలు రిపోర్ట్ చేసాయి. 

టీటీడీ గోల్డ్  డిపాజిట్ పథకాల కింద SBI మరియు ఇతర ప్రైవేటు బ్యాంకులలో తమ బంగారాన్ని డిపోజిట్ చేస్తుంది. డిపోజిట్ చేసిన దానితో పాటు వడ్డీని కూడా ఈ బ్యాంకులు బంగారం రూపంలో టీటీడీకి చెల్లిస్తుంది.  టీటీడీతో కుదుర్చుకున్న మూడేళ్ళ ఒప్పందం ముగియడంతో, పంజాబ్ నేషనల్ బ్యాంక్ టీటీడీకి ఇవ్వవలిసిన 1381 కిలోల బంగారాన్ని చెన్నై నుండి తరలిస్తుండగా ఎన్నికల కమిషన్ అధికారులు తమిళనాడు తిరువళ్లూరు జిల్లాలో పట్టుకున్నారు. ఎన్నికల కమిషన్ సీజ్ చేసిన బంగారం టీటీడీ ట్రెజరికి చేరేంత వరకు పంజాబ్ నేషనల్ బ్యాంకుదే పూర్తి బాధ్యత ఉంటుందని టీటీడీ ఎక్షిక్యుటివ్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ అప్పట్లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి స్పష్టం చేసారు.  

సంబంధిత పత్రాలని, వివరాలని తనిఖీ చేసిన తరువాత ఎన్నికల కమిషన్ అధికారులు సీజ్ చేసిన బంగారాన్ని టీటీడీకి అప్పచెప్పినట్టు తెలిసింది. 2019లో జరిగిన ఈ సంఘటనని ఇటీవల టీటీడీని కించపరిచే విధంగా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఫాక్ట్-చెక్ టీం ఇటీవల ఆర్టికల్ కూడా పబ్లిష్ చేసింది.

చివరగా, 2019లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ టీటీడీకి బంగారాన్ని తరలిస్తున్న క్రమంలో ఎన్నికల కమిషన్ అధికారులు వాటిని పట్టుకొని సీజ్ చేసిన సంఘటనని ఇటీవల జరిగిన సంఘటనగా షేర్ చేస్తున్నారు.