ఈ ఫోటోలో నెహ్రూ ధరించింది సేవా దళ్ యూనిఫామ్ , RSS యూనిఫామ్ కాదు

RSS శాఖాలో పాల్గొన్న నెహ్రూ అంటూ ఖాకీ చొక్కా మరియు నిక్కర్ లో ఉన్న నెహ్రూ ఫోటోని షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఖాకీ చొక్కా మరియు నిక్కర్ వేసుకొని RSS శాఖాలో పాల్గొన్న నెహ్రూ ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఈ ఫోటోలో నెహ్రు ధరించింది సేవా దళ్ యూనిఫామ్. 1924లో బ్రిటిష్ పాలకులతో పోరాడేందుకు సేవ దళ్ ని ప్రారంభించారు. దీనికి మొదటి ఛైర్మన్‌గా నెహ్రూను నియమించారు. నెహ్రూ సేవా దళ్ యూనిఫామ్ ధరించిన చాలా ఫోటోలు ఇంటర్నెట్ లో ఉన్నాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

1924లో కాంగ్రెస్ కార్యకర్తల్లో సైనిక క్రమశిక్షణను పెంపొందించి, వారిలో బ్రిటిష్ పాలకులతో పోరాడే స్పూర్తిని రేకెత్తించడానికి హిందూస్థానీ సేవాదళ్ అనే ఒక సంస్థని ఏర్పాటు చేసారు. తరువాత దీనిని సేవాదళ్ అని పిలవడం మొదలుపెట్టారు. నెహ్రూను దాని మొదటి ఛైర్మన్‌గా నియమించారు. ఐతే 1931 నుండి ఇది కాంగ్రెస్ యొక్క ముఖ్య వాలంటీర్ విభాగం అవడంతో, అప్పటి నుండి దీనిని కాంగ్రెస్ సేవా దళ్ అని కూడా పిలవడం మొదలుపెట్టారు.  ఈ సేవా దళ్ యూనిఫామ్ అయిన ఖాకీ చొక్కా, క్యాప్ మరియు నల్ల నిక్కరు RSS యూనిఫామ్ ని పోలి ఉంటాయి. నెహ్రు సేవా దళ్ యూనిఫార్మ్ ధరించిన చాలా ఫోటోలు చూడొచ్చు. పోస్టులో నెహ్రూ వేసుకున్న యూనిఫామ్ సేవా దళ్ కి సంబంధించింది.

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధికారిక వెబ్సైటులో కాంగ్రెస్ చరిత్ర గురించి వివరిస్తూ 1924 సేవా దళ్ ఏర్పాటు చేసారని పేర్కొన్నారు. ఈ వెబ్సైటులో నెహ్రూ సేవా దళ్ యూనిఫామ్ ధరించిన వేరొక ఫోటోని కూడా చూడొచ్చు.

ఈ పత్రికా థనం ప్రకారం RSS 1925లో తమ కార్యకర్తలకి ఖాకీ చొక్కా, నిక్కర్, బ్లాక్ క్యాప్ మరియు మిలిటరీ స్టైల్, బ్లాక్ బూట్లతో ఒక యూనిఫామ్ ప్రవేశపెట్టింది. ఆ తరవాత పలు సందర్భాలలో యూనిఫామ్ లో కొన్ని మార్పులు జరిగినప్పటికీ, ఇప్పటివరకు వారు బ్లాక్ కలర్ క్యాప్ నే వాడుతున్నారు. కాని పోస్టులోని ఫోటోలో నెహ్రూ ఖాకీ క్యాప్ ధరించడం చూడొచ్చు. దీన్నిబట్టి కూడా నెహ్రూ ధరించింది RSS యూనిఫామ్ కాదని అర్ధంచేసుకోవచ్చు.

లెటర్స్ టు చీఫ్ మినిస్టర్స్ బుక్ లో 7 డిసెంబర్ 1947న నెహ్రూ రాసిన లేఖలో RSS ని హిట్లర్ నేతృత్వంలోని నాజీ పార్టీతో పోల్చడాని కాంగ్రెస్ పార్టీ తమ అధికారిక ఫేస్ బుక్ పేజీలో షేర్ చేసింది. దీన్ని బట్టి నెహ్రూకి RSS పై ఉన్న అభిప్రాయాన్ని అర్ధంచేసుకోవచ్చు.

ఇంతకుముందు కూడా ఇలాంటి నెహ్రూ నిక్కర్ వేసుకున్న ఫోటోలు వైరల్ అయినప్పుడు నెహ్రూ ధరించింది సేవా దళ్ యూనిఫామ్ అని RSS యూనిఫామ్ కాదని ఒక వార్తా సంస్థ స్పష్టం చేసింది. ఈ ఫోటోకి సంబంధించి వివరణ కోసం వీరు RSS ప్రతినిధిని సంప్రదించగా నెహ్రూ ఎప్పుడూ RSS శాఖాకి హాజరు కాలేదని ఆయన స్పష్టం చేసారు.

చివరగా, ఈ ఫోటోలో నెహ్రూ ధరించింది సేవ దళ్ యూనిఫామ్, RSS యూనిఫామ్ కాదు.