2025 నాటికి బంగ్లాదేశ్ తలసరి జీడీపీ భారత్‌ను మించిపోతుందని IMF చేసిన వ్యాఖ్యలను, భారతదేశం పేదరికంలో బంగ్లాదేశ్ కంటే దిగజారిపోతుందని షేర్ చేస్తున్నారు

ప్రపంచ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ ఔట్లుక్ ఇటీవలి కథనంలో 2025 నాటికి భారతదేశం పేదరికంలో బంగ్లాదేశ్ కంటే దిగజారిపోతుందని పేర్కొందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 2025 నాటికి భారతదేశం పేదరికంలో బంగ్లాదేశ్ కంటే దిగజారిపోతుంది- ప్రపంచ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ ఔట్లుక్

ఫాక్ట్(నిజం): 2020లో IMF విడుదల చేసిన ఔట్లుక్‌లో భారత్ తలసరి జీడీపీ (per capita GDP)ను  బంగ్లాదేశ్‌తో పోల్చుతూ 2025 నాటికి బంగ్లాదేశ్‌ తలసరి జీడీపీ భారత్‌ను మించిపోతుందని అంచనా వేసింది. ఐతే ఈ అంశాన్ని ఆధారంగానే 2025 నాటికి భారతదేశం పేదరికంలో బంగ్లాదేశ్ కంటే దిగజారిపోతుందని వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. కాని ఈ వార్తను ప్రభుత్వం ఖండించింది. అలాగే PPP పరంగా చూసుకుంటే భారత్ తలసరి జీడీపీ బంగ్లాదేశ్ కన్నా మెరుగ్గా ఉంది.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

మొదటగా వరల్డ్ ఎకనామిక్ ఔట్లుక్ నివేదికను IMF (ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్) ప్రచురిస్తుంది, వరల్డ్ బ్యాంక్ కాదు. IMF సంవత్సరానికి రెండు సార్లు (ఏప్రిల్ & అక్టోబర్) ఈ నివేదికను విడుదల చేస్తుంది. అలాగే జనవరి మరియు జులై నెలలో ఒక అప్డేట్ విడుదల చేస్తుంది.

ఈ క్రమంలోనే అక్టోబర్ 2020లో విడుదల చేసిన ఔట్లుక్‌లో భారత్ తలసరి జీడీపీ (per capita GDP)ను  బంగ్లాదేశ్‌తో పోల్చుతూ 2025 నాటికి బంగ్లాదేశ్‌ తలసరి జీడీపీ భారత్‌ను మించిపోతుందని అంచనా వేసింది. కరోనా సంవత్సరం (2020లో) డాలర్ పరంగా బంగ్లాదేశ్ తలసరి జీడీపీ 4% పెరిగి $1,888కి చేరుకుంటుందని అంచనా ఐఎంఎఫ్ వేయగా. మరోవైపు, భారతదేశ తలసరి జీడీపీ 10.5% క్షీణించి $1,877కు చేరుకుంటుందని అంచనా వేసింది. ఐతే ఈ అంశాన్ని ఆధారంగానే 2025 నాటికి భారతదేశం పేదరికంలో బంగ్లాదేశ్ కంటే దిగజారిపోతుందని వార్త సోషల్ మీడియాలో షేర్ అవుతుంది.

ఐతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇటీవల ఏప్రిల్ 2023లో విడుదల చేసిన ఔట్లుక్ ప్రకారం ఈ సంవత్సరం భారత్ తలసరి జీడీపీ బంగ్లాదేశ్‌ను దాటిపోయింది. ఈ సంవత్సరం డాలర్ పరంగా భారత్ $2600 తలసరి జీడీపీ నమోదు చేయగా, బంగ్లాదేశ్ $2470 తలసరి జీడీపీ నమోదు చేసింది.

సాధారణంగా తలసరి జీడీపీ వృద్ధిని ప్రోత్సహించడం ద్వారా దేశంలో పేదరికాన్ని తగ్గించవచ్చు. కాని కేవలం ఈ అంశం ఆధారంగా భారత్ పేదరికంలో బంగ్లాదేశ్ కన్నా దిగజారిపోతుందని అనలేం. ఉదాహారణకి PPP పరంగా చూసుకుంటే భారత్ తలసరి జీడీపీ బంగ్లాదేశ్ కన్నా మెరుగ్గా ఉంది. కేవలం 2020ను మినహాయిస్తే అంతకుముందు మరియు ఆతర్వాత ఈ అంశంలో భారత్ బంగ్లాదేశ్ కన్నా మెరుగ్గా ఉంది.

గతంలో కూడా ఇదే వార్త వైరల్ అయినప్పుడు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(PIB) కూడా ఈ వార్తలో నిజం లేదని స్పష్టం చేసింది. 2023లో ప్రపంచ వృద్ధిలో భారత్ 15% దోహదం చేస్తుందని ఐఎంఎఫ్ తెలిపినట్టు పేర్కొంది.

చివరగా, 2025 నాటికి బంగ్లాదేశ్ తలసరి జీడీపీను భారత్‌ను మించిపోతుందని IMF చేసిన వ్యాఖ్యలను, భారతదేశం పేదరికంలో బంగ్లాదేశ్ కంటే దిగజారిపోతుందని షేర్ చేస్తున్నారు.