కొన్ని కూల్ డ్రింక్స్ లో 20 శాతానికి పైగా పురుగుమందు ఉన్నట్టు చెప్తూ, IMA ఎటువంటి రిపోర్ట్ ఇవ్వలేదు

వివిధ కూల్ డ్రింక్స్ లో ఉండే పురుగుమందు శాతం గురించి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) వారు ఇచ్చిన సమాచారం అని చెప్తూ, కొన్ని అంకెలతో కూడిన పోస్ట్ ని చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: IMA వారు వివిధ కూల్ డ్రింక్స్ లో ఉండే పురుగుమందు శాతం గురించి ఇచ్చిన అంకెలు. కొన్నిట్లో 20 శాతానికి పైగా పురుగుమందు ఉన్నట్టు తెలిపారు.

ఫాక్ట్:  పోస్ట్ లోని అంకెలు IMA వారు ఇచ్చినట్టు ఎక్కడా ఎటువంటి అధికారిక సమాచారం లేదు. 2003 లో సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సీఎస్‌ఈ) వారు కూల్ డ్రింక్స్ లో అనుమతికి మించి పురుగుమందు (‘pesticide residues’) ఉన్నట్టు చెప్పినా, పోస్ట్ లో చెప్పినట్టు 20 శాతం కి పైగా అని చెప్పలేదు. వారు టెస్ట్ చేసిన శాంపిల్స్ లో సగటున ‘మొత్తం పురుగుమందు’ (‘Total pesticide residues’) సుమారు 0.0168 mg/l ఉన్నట్టు తెలిపారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని సమాచారం గురించి ఇంటర్నెట్ లో వెతకగా, ఆ అంకెలకు సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారం లభించలేదు. పురుగుమందు శాతానికి సంబంధించి IMA విడుదల చేసిన అంకెలు అని చెప్తూ, వివిధ పోస్టులు కనీసం గత పదిహేను సంవత్సరాల నుండి ఇంటర్నెట్ లో షేర్ అవుతున్నట్టు తెలిసింది. అయితే, 2006లో ఆ మెసేజ్ల గురించి IMA వారికి మెయిల్ చేయగా, వారు అలాంటి స్టడీ ఏదీ కూడా నిర్వహించలేదని తెలిపినట్టు ఒకరు తన బ్లాగ్ (ఆర్కైవ్డ్) లో రాసారు. ఈ విషయం పై మరింత స్పష్టత కోసం FACTLY కూడా IMA వారికి మెయిల్ చేసింది. వారి నుండి సమాధానం వచ్చిన తర్వాత ఈ ఆర్టికల్ అప్డేట్ చేయబడుతుంది.

2003 లో సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సీఎస్‌ఈ) వారు కూల్ డ్రింక్స్ లో పురుగుమందు (‘Analysis of Pesticide Residues in Soft Drinks’) పై అధ్యయనం చేసారు. అయితే, పోస్ట్ లో చెప్పినట్టు 20 శాతానికి పైగా పురుగుమందు ఉన్నట్టు వారు చెప్పలేదు. వారు అంకెలు ‘mg/L’ (లీటరుకు మిల్లీగ్రాములు) యూనిట్స్ లో ఇచ్చారు. వారు టెస్ట్ చేసిన శాంపిల్స్ లో సగటున ‘మొత్తం పురుగుమందు’ (‘Total pesticide residues’) సుమారు 0.0168 mg/l [గమనిక: 1మిల్లీగ్రాము = 0.000001 కేజీ] ఉన్నట్టు తెలిపారు. కాబట్టి, పోస్ట్  లో చెప్పినట్టు 20 శాతం (చాలా ఎక్కువ) ఉండే అవకాశం లేదు. మొత్తం రిపోర్ట్ ని ఇక్కడ చదవొచ్చు. 2006లో సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ వారు నిర్వహించిన అధ్యయనం రిపోర్ట్ ని ఇక్కడ చదవొచ్చు.

సీఎస్‌ఈ వారి 2003 అధ్యయనం పై అప్పట్లో శరద్ పవార్ చైర్మన్ గా ఒక జాయింట్ కమిటీ కూడా వేసారు. 2004 లో వారు ఇచ్చిన రిపోర్ట్ ని ఇక్కడ చదవొచ్చు. వారు కూడా పోస్ట్ లో ఇచ్చిన అంకెలు ఇవ్వలేదు.

కూల్ డ్రింక్స్ లో కలుషిత పదార్థాల పై వివిధ సమయాల్లో ప్రభుత్వం లోక్ సభలో ఇచ్చిన సమాధానాలను ఇక్కడ, క్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చదవొచ్చు. కలుషిత పదార్థాల అనుమతించ దగిన పరిమితులకు సంబంధించి 2015లో లోక్ సభలో ఇచ్చిన సమాధానం ఇక్కడ చదవొచ్చు.

చివరగా, కొన్ని కూల్ డ్రింక్స్ లో 20 శాతానికి పైగా పురుగుమందు ఉన్నట్టు IMA తెలుపలేదు. అలాంటి స్టడీ ఒకటి IMA వారు నిర్వహించినట్టు కూడా ఎక్కడా ఎటువంటి అధికారిక సమాచారం లేదు.