కాన్పూర్ ఐఐటీలో సీనియర్ ప్రొఫెసర్ అయిన హెచ్.సి.వర్మ రాసిన “కాన్సెప్ట్స్ ఆఫ్ ఫిజిక్స్” అనే పుస్తకానికి సంవత్సరానికి సుమారు కోటి రూపాయల రాయల్టీ వస్తుంది, ఇలా వచ్చిన రాయల్టీని ఆయన ప్రతి సంవత్సరం ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ కు మరియు ఇతర సేవాసంస్థలకు విరాళంగా ఇస్తారు అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ హెచ్.సి. వర్మ ప్రతి సంవత్సరం కోటి రూపాయలను పీఎం రిలీఫ్ ఫండ్ మరియు ఇతర సేవాసంస్థలకు విరాళంగా ఇస్తున్నారు.
ఫాక్ట్(నిజం): ఐఐటి కాన్పూర్ మాజీ ఫిజిక్స్ ప్రొఫెసర్ హెచ్.సి. వర్మ ప్రతి సంవత్సరం కోటి రూపాయలను ప్రధానమంత్రి సహాయనిధికి విరాళంగా ఇవ్వడం లేదు. ఈ వైరల్ పోస్టు 2018 నుండే సోషల్ మీడియాలో ఉంది. 2018లో ఈ పోస్టు వైరల్ కాగా ప్రొఫెసర్ హెచ్.సి. వర్మ దీనిపై 13 ఏప్రిల్ 2018న ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా స్పందిస్తూ తాను కోటి రూపాయలను పీఎం రిలీఫ్ ఫండ్‌కి విరాళంగా ఇస్తున్నట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. పలు రిపోర్ట్స్ ప్రకారం, ప్రొఫెసర్ హెచ్.సీ. వర్మ 2017లో ఐఐటి కాన్పూర్ నుండి పదవీ విరమణ చేశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ క్లెయిమ్‌కు సంబంధించిన సమాచరం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ వైరల్ పోస్టు 2018 నుండే సోషల్ మీడియాలో ఉందని తెలిసింది (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). 2018లో ఈ పోస్టు వైరల్ కాగా ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ హెచ్.సి. వర్మ దీనిపై 13 ఏప్రిల్ 2018న తన ఫేస్‌బుక్ ద్వారా వివరణ ఇచ్చారు. పోస్టులో ఆయన ఇలా అన్నారు, “ప్రియమైన స్నేహితులారా, నేను 1 కోటి రాయల్టీని సంపాదిస్తున్నాను మరియు మొత్తం డబ్బును PM రిలీఫ్ ఫండ్‌కి విరాళంగా ఇస్తున్నట్లు ట్విట్టర్ పోస్ట్ గురించి నాకు తెలిసింది. నేను అలా చేయాలని అనుకుంటాను. నేను ఈ సమాచారాన్ని ఖచ్చితంగా తిరస్కరించాలనుకుంటున్నాను. పోస్ట్‌లో స్కూటర్ ఫోటో కూడా షేర్ చేయబడింది. నా దగ్గర ఎప్పుడూ ఈ రంగు మరియు ఇలాంటి స్కూటర్ లేదు. నేను మీలో ఒకడిని, సామాన్యుడిని మరియు ఫిజిక్స్ నేర్చుకునేవాడిని”.( ఇంగ్లిష్ నుండి తెలుగు అనువాదం).
ఈ పోస్టు వైరల్ కావడంతో ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ హెచ్.సీ. వర్మ ఇచ్చిన వివరణపై పలు వార్తా సంస్థలు, వెబ్‌సైట్‌లు కూడా వార్తా కథనాలను ప్రచురించాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). దీన్ని బట్టి ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్ హెచ్.సి. వర్మ ప్రతి సంవత్సరం కోటి రూపాయలను ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇవ్వడం లేదని మనం నిర్ధారించవచ్చు.
పలు రిపోర్ట్స్ ప్రకారం ప్రొఫెసర్ హెచ్.సీ. వర్మ 2017లో ఐఐటి కాన్పూర్ నుండి పదవీ విరమణ చేశారు అని తెలిసింది (ఇక్కడ & ఇక్కడ). అలాగే, ఆయన 2020లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు అని తెలిసింది (ఇక్కడ & ఇక్కడ).
చివరగా, ఐఐటి కాన్పూర్ మాజీ ఫిజిక్స్ ప్రొఫెసర్ హెచ్.సి. వర్మ ప్రతి సంవత్సరం కోటి రూపాయలను ప్రధానమంత్రి సహాయనిధికి విరాళంగా ఇవ్వడం లేదు.