Coronavirus Telugu, Fake News, Telugu
 

సంబంధం లేని పాత వీడియో క్లిప్పులు జోడించి కరోనా రోగులని చంపుతున్న హాస్పిటల్ సిబ్బంది అని షేర్ చేస్తున్నారు

0

బెంగళూరులో హాస్పిటల్ సిబ్బంది బెడ్స్ లేవన్న సాకు చూపించి బ్రతికి ఉన్న కరోనా రోగులను గొంతు పిసికి చంపుతున్న దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. భారతదేశంలో కరోనా వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: బెంగళూరు హాస్పిటల్స్ సిబ్బంది, కరోనా రోగులను గొంతు పిసికి చంపుతున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలోని మొదటి క్లిప్ తప్పితే మిగితా రెండు వీడియో క్లిప్పులు ఇటివల చోటుచేసుకున్న సంఘటనలకి సంబంధించినవి కావు. మొదటి వీడియో క్లిప్, కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఒక మహిళ తన తండ్రి చావుకి హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణమని ఇటివల మీడియాకి తెలిపిన దృశ్యాలని చూపిస్తుంది. రెండవ వీడియో క్లిప్ ని బంగ్లాదేశ్ ఫేస్బుక్ యూసర్లు మే 2020 నుండే తమ సోషల్ మీడియా హేండిల్స్ లో షేర్ చేస్తున్నట్టు తెలిసింది. అలాగే, చివరి వీడియో క్లిప్ ఆగష్టు 2020లో పటియాలలోని ఒక హాస్పిటల్ లో చోటుచేసుకున్న సంఘటనకి సంబంధించింది. దీన్ని బట్టి, హాస్పిటల్ సిబ్బంది రోగులని కొడుతున్నట్టుగా షేర్ చేసిన ఈ వీడియోలోని రెండు క్లిప్పులు పాతవి మరియు ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితులకి సంబంధించినవి కావు అని చెప్పవచ్చు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియోలో మూడు వేర్వేరు క్లిప్స్ ఉండటాన్ని మనం చూడవచ్చు. ఈ మూడు వీడియో క్లిప్స్ కు సంబంధించిన సమాచారాన్ని ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.

క్లిప్-1:

ఈ వీడియో క్లిప్ పై ‘NewsFirstKannada’ న్యూస్ ఛానల్ లోగో ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఈ వీడియో కోసం వారి యూట్యూబ్ ఛానల్ లో వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘NewsFirstKannada’ 22 ఏప్రిల్ 2021 నాడు తమ యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. కర్ణాటక కి చెందిన ఒక మహిళ తన తండ్రి చావుకి అనేకల్ లోని ఆక్స్ఫర్డ్ మెడికల్ హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణమని తెలిపినట్టు ఈ వీడియో వివరణలో తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ‘NewsFirstKannada’ పబ్లిష్ చేసిన మరికొన్ని వీడియోలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. Prajavani న్యూస్ సంస్థ ఈ ఘటనకి సంబంధించి ‘Neglect of treatment at Oxford Hospital: Allegation’ (in Kannada) అనే టైటిల్ తో ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఈ ఘటనకి మిగితా రెండు వీడియో క్లిప్స్ కి ఎటువంటి సంబంధం లేదు.

క్లిప్-2:

వీడియోలో కనిపిస్తున్న ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుందో మాకు తెలియలేదు. కానీ, ఈ వీడియో కనీసం మే 2020 నుండి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్టు తెలిసింది. ఈ వీడియోని షేర్ చేస్తూ బంగ్లాదేశ్ ఫేస్బుక్ యూసర్లు పెట్టిన పాత పోస్టులని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో క్లిప్ పాతది అని, ప్రస్తుత COVID-19 పరిస్థితులకి సంబంధించింది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

క్లిప్-3:

పోస్టులో కనిపిస్తున్న చివరి వీడియో క్లిప్, ఆగష్టు 2020లో పటియాల లోని ఒక ప్రైవేటు హాస్పిటల్ లో చోటుచేసుకున్న ఒక ఘటనకు సంబంధించింది. పటియాల ప్రైవేటు హాస్పిటల్ లో డిప్రెషన్ తో బాధపడుతున్న రోగిని కంట్రోల్ చేయడానికి ఇద్దరు హాస్పిటల్ సిబ్బంది అతన్ని కొట్టినట్టు ‘The Tribune’ తమ ఆర్టికల్ లో రిపోర్ట్ చేసింది. పోలీసులు ఆ ఇద్దరు హాస్పిటల్ సిబ్బందిని అరెస్ట్ చేసినట్టు ఈ ఆర్టికల్ లో తెలిపారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో పాతది అని, మిగితా రెండు క్లిప్స్ లో చూపిస్తున్న దృశ్యాలకు సంబంధించింది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, ఈ వీడియోలో మహిళ హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యాన్ని వివరిస్తున్న మొదటి క్లిప్ తప్పితే మిగితా రెండు వీడియో క్లిప్పులు ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితులకి సంబంధించినవి కావు.  

Share.

About Author

Comments are closed.

scroll