షరియా చట్టానికి చెక్ పెడుతూ అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ తమ రాష్ట్రంలో 14 ఏళ్ల లోపు మైనర్ బాలికల వివాహాలు నిర్వహించిన ముస్లింలపై 4000లకు పైగా కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేయడం ప్రారంభించారంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతోంది. షరియా చట్టం ప్రకారం 14 సంవత్సరాలకే ముస్లిం అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేయవచ్చని అక్కడి ముస్లిం మత పెద్దలు హుకుం జారీ చేయడంతో, దీనితో రెచ్చిపోయిన హిమంత బిశ్వ శర్మ, మైనర్ బాలికలకు పెళ్ళిళ్ళు చేసిన వారిపై ఏకంగా 4,000 కేసులు పెట్టి వారిని అరెస్టులు చేయటం ప్రారంభించారంటూ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. హిమాంత బిశ్వ శర్మ ప్రభుత్వం చేపపట్టిన ఈ చర్యతో నెల వ్యవధిలో అస్సాం రాష్ట్రంలో బాల్య వివాహాలు పూర్తిగా ఆగిపోయాయని పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ 14 ఏళ్ల లోపు మైనర్ బాలికలను వివాహం చేసుకున్న 4,000 ముస్లింలపై కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేశారు.
ఫాక్ట్ (నిజం): అస్సాం రాష్ట్రంలో ప్రసూతి మరణాలు, శిశు మరణాలు పెరగడానికి అమ్మాయిలు నిషిద్ద వయసులోపు పెళ్లి చేసుకోవడమే ప్రధాన కారణంగా పేర్కొంటూ, అస్సాం ప్రభుత్వం 14 ఏళ్ల లోపు మైనర్ బాలికలకు వివాహాలు చేసిన వారికి POCSO చట్టం కింద, 14 నుండి 18 వయసు బాలికలకు పెళ్లి చేసిన వారికి బాల్య వివాహాల నిషేద చట్టం, 2006 కింద కేసులు పెట్టి అరెస్ట్ చేయనున్నట్టు 23 జనవరి 2023 నాడు ప్రకటించింది. ఈ బాల్య వివాహాల నిరోధక చర్యలలో భాగంగా 03 ఫిబ్రవరి 2023 నాటి నుండి జరిపిన అరెస్టులలో 55:45 నిష్పత్తిలో ముస్లిం-హిందువులను అరెస్ట్ చేసినట్టు హిమాంత బిశ్వ శర్మ ఇటీవల స్పష్టం చేశారు. షరియా చట్టాన్ని లక్ష్యంగా చేసుకొని అస్సాం ప్రభుత్వం కేవలం ముస్లింలను మాత్రమే అరెస్ట్ చేసిందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టిస్తోంది.
పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించి వివరాల కోసం వెతికితే, అస్సాం రాష్ట్రంలో బాల్య వివాహాలను నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకొనున్నట్టు అస్సాం ప్రభుత్వం 23 జనవరి 2023 నాడు ప్రకటించినట్టు తెలిసింది. అస్సాం రాష్ట్రంలో ప్రసూతి మరణాలు, శిశు మరణాలు పెరగడానికి అమ్మాయిలు నిషిద్ద వయసు లోపు పెళ్లి చేసుకోవడమే ప్రధాన కారణంగా పేర్కొంటూ, అస్సాం ప్రభుత్వం 14 ఏళ్ల లోపు మైనర్ బాలికలకు వివాహాలు చేసిన వారికి POCSO చట్టం కింద, 14 నుండి 18 వయసు బాలికలకు పెళ్లి చేసిన వారికి బాల్య వివాహల నిషేద చట్టం, 2006 కింద కేసులు పెట్టి అరెస్ట్ చేయనున్నట్టు 23 జనవరి 2023 నాడు ప్రకటించింది. ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పలు వార్తా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి.
2019 మరియు 2020 మధ్య నిర్వహించిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే (NFHS-5) అధ్యయనాన్ని చూపిస్తూ, అస్సాం రాష్ట్రంలో సగటుగా 31.8% అమ్మాయిలు నిషిద్ద వయసు లోపే వివాహం చేసుకుంటున్నారని, వారిలో 11.7% అమ్మాయిలు యుక్త వయసుకు రాక ముందే తల్లులు అవుతున్నారని తేలిందని అస్సాం ప్రభుత్వం తెలిపింది. జాతీయ సగటుతో పోలిస్తే అస్సాం రాష్ట్రంలో బాల్య వివాహాల శాతం ఎక్కువగా ఉండటంతో, బాల్య వివాహాలను నిరోధించడానికి ప్రత్యేక చర్యలు తీసుకొనున్నట్టు అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ 2023 జనవరి నెలలో ప్రకటించారు.
02 ఫిబ్రవరి 2023 నాటికి రాష్ట్రంలో బాల్య వివాహాలకి వ్యతిరేకంగా మొత్తంగా 4,004 కేసులు రిజిస్టర్ అయినట్టు, 03 ఫిబ్రవరి 2023 నుండి ఈ కేసులపై చర్యలు ప్రారంభమవుతాయని హిమాంత బిశ్వ శర్మ ట్వీట్ ద్వారా స్పష్టం చేశారు.
బాల్య వివాహాల నిరోధ చర్యలలో భాగంగా 03 ఫిబ్రవరి 2023 నాటి నుండి జరిపిన అరెస్టులలో 55:45 నిష్పత్తిలో ముస్లిం-హిందువులను అరెస్ట్ చేసినట్టు హిమాంత బిశ్వ శర్మ ఇటీవల అస్సాం అసెంబ్లీలో ప్రసంగిస్తూ తెలిపారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు చేస్తున్న చర్యలలో తాము ఎటువంటి మతపరమైన వివక్షను చూపించడం లేదని హిమాంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు. షరియా చట్టాన్ని లక్ష్యంగా చేసుకొని అస్సాం ప్రభుత్వం కేవలం ముస్లింలను మాత్రమే అరెస్ట్ చేసిందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.
చివరగా, అస్సాం ముఖ్యమంత్రి హిమాంత బిశ్వ శర్మ బాల్య వివాహాల నిరోధక చర్యలలో భాగంగా కేవలం ముస్లింలపై కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేయలేదు.