కరోనా & వలస కార్మికుల సంక్షోభాన్ని విజయవంతంగా మేనేజ్ చేసారంటూ హార్వర్డ్ యూనివర్సిటీ యోగీ ఆదిత్యనాథ్‌ను ప్రశంసించలేదు

కరోనా & వలస కార్మికుల సంక్షోభాన్ని విజయవంతంగా మేనేజ్ చేశారని, హార్వర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన స్టడీలో యోగీ ఆదిత్యనాథ్‌ను ప్రశంసించిందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఈ స్టడీకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: హార్వర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన స్టడీలో కరోనా & వలస కార్మికుల సంక్షోభాన్ని విజయవంతంగా మేనేజ్ చేశారని యోగీ ఆదిత్యనాథ్‌ను ప్రశంసించింది.

ఫాక్ట్(నిజం): ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కరోనా & వలస కార్మికుల సంక్షోభాన్ని మేనేజ్ చేసిన విధానాన్ని అధ్యయనం చేస్తూ ‘COVID-19 & the migrant crisis resolution: A report on Uttar Pradesh’ అనే రిపోర్ట్ రూపొందించింది IFC అనే సంస్థ. ఈ రిపోర్ట్‌తో హార్వర్డ్ యూనివర్సిటీకి ఎటువంటి సంబంధంలేదు. పైగా ఈ రిపోర్ట్‌లో ఎక్కడా యోగీ ఆదిత్యనాథ్‌ను ప్రశంసించలేదు. కేవలం ఉత్తరప్రదేశ్ అమలు చేసిన విధానాన్ని అధ్యయనం చేసారు. ఇదే విషయాన్ని IFC చైర్మన్ అమిత్ కపూర్ కూడా ద్రువీకరించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టిస్తుంది.

ఏప్రిల్ 2021 కరోనా సమయంలో హార్వర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన ఒక స్టడీలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌  కరోనా & వలస కార్మికుల సంక్షోభాన్ని విజయవంతంగా మానేజ్ చేసారంటూ పొగిడిందని చెప్తూ అనేక వార్త సంస్థలు రిపోర్ట్ చేసాయి.

కాని నిజానికి ఈ స్టడీకి హార్వర్డ్ యూనివర్సిటీకి ఎటువంటి సంబంధం లేదు. పైగా ఈ స్టడీ యోగీ ఆదిత్యనాథ్‌ను ప్రశంసించలేదు. కేవలం కరోనా & వలస కార్మికుల విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన విధానంపై ఒక అద్యయనం చేసింది.

ఈ స్టడీ నిర్వహించింది హార్వర్డ్ యూనివర్సిటీ కాదు:

ఆల్ట్ న్యూస్ & బూమ్ అనే ఫాక్ట్-చెకింగ్ సంస్థలు ఈ అంశంపై చేసిన ఫాక్ట్-చెక్ ప్రకారం ఈ స్టడీ నిర్వహించింది గుర్గావ్‌కు చెందిన Institute for Competitiveness (IFC) అనే సంస్థ. IFC అనేది, మైక్రోఎకనామిక్స్ ఆఫ్ కాంపిటీటివ్‌నెస్ (MOC) అనే హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (HBS) అనుబంధ నెట్‌వర్క్‌లో భాగమైన సంస్థ.

హార్వర్డ్ యూనివర్సిటీ నిర్వహించిందని క్లెయిమ్ చేస్తున్న రిపోర్ట్‌ను (COVID-19 & the migrant crisis resolution: A report on Uttar Pradesh) ఫాక్ట్-చెకింగ్ సంస్థలైన ఆల్ట్ న్యూస్ & బూమ్ సేకరించాయి . ఈ డాక్యుమెంట్‌లో ఎక్కాడ కూడా ఈ స్టడీ నిర్వహించింది హార్వర్డ్ యూనివర్సిటీ అని పేర్కొనలేదు.

ఈ అంశంపై ఆల్ట్ న్యూస్ & బూమ్ సంస్థలు వివరణ కోరుతూ అమిత్ కపూర్‌ను సంప్రదించగా, ఆయన కూడా ఈ స్టడీకి హార్వర్డ్ యూనివర్సిటీతో సంబంధం లేదని స్పష్టం చేసాడు. పైగా ఈ రిపోర్ట్‌పై హార్వర్డ్ యూనివర్సిటీ లోగో వాడే అధికారం IFCకి లేదని, దానిని వెంటనే తొలగిస్తామని కూడా ఆయన అన్నారు.

ఈ స్టడీ యోగీ ఆదిత్యనాథ్‌ను ప్రశంసించలేదు:

ఈ రిపోర్ట్ యోగీ ఆదిత్యనాథ్‌ ప్రభుత్వాన్ని పోగిడిందన్న వార్తలో కూడా ఎలాంటి నిజం లేదు. ఇది స్టడీ కేవలం కరోనా & వలస కార్మికుల విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన విధానానికి సంబంధించిన ఒక అధ్యయనం మాత్రమే. IFC చైర్మన్ అమిత్ కపూర్ కూడా ఇదే విషయాన్ని ద్రువీకరించారు.

“ఇది కరోనా & వలస కార్మికుల నిర్వహణలో వివిధ రాష్ట్రాల పనితీరును పోల్చుతూ చేసిన స్టడీ కాదు. కేవలం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కరోనా & వలస కార్మికుల విషయంలో వ్యవహరించిన విధానాన్ని అధ్యయనం చేస్తూ చేసిన స్టడీ మాత్రమే. పైగా ఈ స్టడీలో ఉత్తరప్రదేశ్ పనితీరును ఎక్కడ ప్రశంసించలేదు. ఇది స్టడీ అంతర్గత వినియోగం కోసం నిర్వహించింది మాత్రమే” అని అమిత్ కపూర్ అన్నారు.

ఉత్తరప్రదేశ్ ఒక దీర్ఘకాలిక ప్రణాళికను అభివృద్ధి చేసుకోవాలని రిపోర్ట్ పేర్కొంది:

రిపోర్ట్‌లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వలస కార్మికులకు అందించిన మద్దతు, ఆరోగ్య మౌలిక సదుపాయాలు మరియు జీవనోపాధి అవకాశాలు అనే అంశాలపై అధ్యయనం చేసినట్టు అమిత్ కపూర్ తెలిపారు. రిపోర్ట్‌లో ప్రస్తావించిన కొన్ని అంశాలు కింద చూడొచ్చు.

“దేశంలో జనాభా ప్రాతిపదికన తక్కువ హెల్త్ కేర్ సెంటర్లు ఉన్న రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్‌ 7వ స్థానంలో ఉందని నివేదిక పేర్కొంది. లక్ష మంది జనాభాకు కేవలం 10 హెల్త్ కేర్ సెంటర్లు మాత్రమే ఉన్నాయని నివేదిక తెలిపింది. అదేవిధంగా ఆసుపత్రి పడకలు మరియు ప్రభుత్వ వైద్యుల సంఖ్య (లక్ష జనాభాకు) విషయంలో ఉత్తరప్రదేశ్ దేశంలోని అట్టడుగు ఐదు రాష్ట్రాలలో ఒకటని పేర్కొంది.”

“వలస కార్మికుల ఉపాధికి సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ, ఈ అంశాలకు సంబంధించి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించుకోవాలని ఈ అధ్యయనం పేర్కొంది.”

ఇది కేవలం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని అధ్యయనం చేసిన స్టడీ మాత్రమే అన్నది పైన పేర్కొన్న ఉదాహరణల నుండి అర్ధం చేసుకోవచ్చు.

FACTLY అమిత్ కపూర్‌ను సంప్రదించింది:

హార్వర్డ్ యూనివర్సిటీ స్టడీలో ఆదిత్యనాథ్‌ను ప్రశంసించిందన్న విషయానికి సంబంధించి వివరణ కోరుతూ మేము అమిత్ కపూర్‌ను మెయిల్ ద్వారా సంప్రదించగా, అమిత్ కపూర్ గతంలో ఇదే అంశంపై ఆల్ట్ న్యూస్‌కి ఇచ్చిన వివరణకు సంబంధించిన కథనాన్ని మాకు షేర్ చేసాడు. 

దీన్నిబట్టి ఆల్ట్ న్యూస్‌ కథనం ఆధారంగా పైన తెలిపిన విషయాలను అమిత్ కపూర్ ద్రువీకరించినట్టు అర్ధం చేసుకోవచ్చు.

చివరగా, కరోనా & వలస కార్మికుల సంక్షోభాన్ని విజయవంతంగా మేనేజ్ చేసారంటూ హార్వర్డ్ యూనివర్సిటీ యోగీ ఆదిత్యనాథ్‌ను ప్రశంసించలేదు.