‘హంటా వైరస్’ కొత్త వ్యాధి కాదు. చాలా ఏళ్ళగా వివిధ దేశాల్లో ప్రజలు దాని బారిన పడ్డారు

చైనాలో ‘హంటా వైరస్’ అనే మరో కొత్త వ్యాధి వచ్చినట్టు చెప్తూ ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: చైనాలో ‘హంటా వైరస్’ అనే మరో కొత్త వ్యాధి వచ్చింది.

ఫాక్ట్ (నిజం): ‘హంటా వైరస్’ వల్ల చాలా ఏళ్ళగా వివిధ దేశాల్లో ప్రజలు వ్యాధి బారిన పడ్డారు. అది కొత్త వైరస్ కాదు. 1993 నుండి 2017 మధ్యలో సుమారు 728 మంది అమెరికాలో హంటా వైరస్ బారిన పడినట్టు సీడీసీ వెబ్సైటులో చూడవొచ్చు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని విషయం గురించి గూగుల్ లో వెతకగా, తాజాగా చైనాలో ఒకరు హంటా వైరస్ తో చనిపోయినట్టు, అతనితో బస్సులో ఉన్న మిగితా 32 మంది సాంపిల్స్ కూడా టెస్టుకు పంపించినట్టు ‘గ్లోబల్ టైమ్స్’ వారి ట్వీట్ ద్వారా తెలుస్తుంది. అయితే, పోస్ట్ లో చెప్పినట్టు ‘హంటా వైరస్’ అనేది కొత్త వైరస్ కాదు.

1978 లో హంటాన్ నది (సౌత్ కొరియా) సమీపంలో ఒక ఎలుక నుండి ఆ వైరస్ ను వేరుచేసినందు వల్ల ఆ వైరస్ కి ఆ పేరు పెట్టినట్టు ‘NCBI’ వారి వెబ్సైటులోని ఒక రీసెర్చ్ పేపర్ లో చదవొచ్చు. గత శతాబ్దంలో ప్రధానంగా రెండు సార్లు హంటా వైరస్ల వల్ల చాలా మందికి వ్యాధులు వచ్చాయి. 1950 నుండి 1953 వరకు జరిగిన కొరియా యుద్ధంలో మొదటి వ్యాప్తి సంభవించింది. అక్కడ HFRS (Hemorrhagic Fever with Renal Syndrome) వ్యాధి వ్యాపించింది. రెండవ వ్యాప్తి 1993 లో యునైటెడ్ స్టేట్స్ యొక్క ఫోర్ కార్నర్స్ ప్రాంతంలో సంభవించింది. అక్కడ HPS (Hantavirus Pulmonary Syndrome) వ్యాధి వ్యాపించింది. హంటా వైరస్ల వల్ల వివిధ దేశాల్లో ప్రజలకు వ్యాధులు వచ్చినట్టు కింది మ్యాప్ లో చూడవొచ్చు.

ప్రధానంగా ‘హంటా వైరస్’ వల్ల రెండు వ్యాధులు వస్తాయి. ఒకటి, Hantavirus Pulmonary Syndrome (HPS). ఇది ముఖ్యంగా నార్త్ మరియు సౌత్ అమెరికా దేశాల్లో వస్తుంది. రెండవది, Haemorrhagic Fever with Renal Syndrome (HFRS). ఇది ముఖ్యంగా తూర్పు ఆసియా, స్కాండినేవియా, పశ్చిమ ఐరోపా మరియు పశ్చిమ రష్యా దేశాల్లో వస్తుంది. 1993 నుండి 2017 మధ్యలో సుమారు 728 మంది అమెరికాలో ‘హంటా వైరస్’ వ్యాధిన పడినట్టు సీడీసీ వెబ్సైటులో చూడవొచ్చు. కావున, ఇది కొత్త వైరస్ కాదు. అంతేకాదు, ఇది కేవలం చైనాకి పరిమితం కాదు.

ఎలుకల్లో ఉన్న ‘హంటా వైరస్’, వాటి మూత్రం మరియు లాలాజలాల ద్వారా బయటికి వస్తుంది. అది గాల్లోకి వ్యాపించినప్పుడు, మనుషులు ఆ గాలిని పీల్చడం ద్వారా అది మనుషులకు సోకుతుంది. అంతేకానీ, మనుషుల నుండి మనుషులకు సోకదు (చిలీ మరియు ఆర్జెంటినా లో కొన్ని సందర్భాల్లో మనుషుల నుండి మనషులకు సోకినట్టు చూడవొచ్చు) అని సీడీసీ వారి వెబ్సైటులో చూడవొచ్చు.

‘హంటా వైరస్’ వల్ల వ్యాధి వచ్చిన అందరు చనిపోరు. మోర్టాలిటీ శాతం హంటా వైరస్ రకం బట్టి మారుతుంది. కొన్ని హంటా వైరస్ల యొక్క మోర్టాలిటీ శాతాలను కింద ఫోటోలో చూడవొచ్చు.

‘హంటా వైరస్’ కి సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, ‘హంటా వైరస్’ కొత్త వ్యాధి కాదు. చాలా ఏళ్ళగా వివిధ దేశాల్లో ప్రజలు వ్యాధి బారిన పడ్డారు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?