షహీన్ బాగ్ లో CAA మరియు NRC కి విరుద్ధంగా జరుగుతున్న నిరసనల శిబిరంలోకి ముస్లిం మహిళ లాగా బురకా వేసుకొని వెళ్ళిన గుంజా కపూర్ ఫోటో మరియు వీడియో పెట్టి, తను బీజేపీ పార్టీ మహిళా మోర్చా ఢిల్లీ విభాగం అధ్యక్షురాలు అని పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్: బీజేపీ పార్టీ మహిళా మోర్చా ఢిల్లీ విభాగం అధ్యక్షురాలు గుంజా కపూర్ బురకా వేషంలో షహీన్ బాగ్ లో నిరసనకారులకు పట్టుబడింది.
ఫాక్ట్ (నిజం): బురకా వేషంలో గుంజా కపూర్ షహీన్ బాగ్ లో నిరసనకారులకు పట్టుబడింది. కానీ, తను ఒక రాజకీయ విశ్లేషకురాలు, బీజేపీ పార్టీ మహిళా మోర్చా ఢిల్లీ విభాగం అధ్యక్షురాలు కాదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
షహీన్ బాగ్ శిభిరంలోకి ముస్లిం మహిళ లాగా బురకా వేసుకొని తను వెళ్లినట్టు మరియు తను ఎందుకు అలా వెళ్లిందో చెప్తూ, ‘ఇండియా ఎహెడ్’ వారికి గుంజా కపూర్ ఇచ్చిన ఇంటర్వ్యూని ఇక్కడ చూడవొచ్చు.
గుంజా కపూర్ బురకా ఘటన పై ‘ANI’ వారు కూడా ట్వీట్ చేసారు. కానీ, అందులో తనను ‘రాజకీయ విశ్లేషకురాలు’ గా అభివర్ణించారు. మిగితా వార్తాసంస్థలు కూడా ఎక్కడా తను బీజేపీ పార్టీ మహిళా మోర్చా ఢిల్లీ విభాగం అధ్యక్షురాలు అని చెప్పలేదు.
గుంజా కపూర్ గురించి వెతకగా, తను ఒక రాజకీయ విశ్లేషకురాలు అని తెలుస్తుంది. తను ‘రైట్ నరేటివ్’ అనే యూట్యూబ్ ఛానల్ ని క్యురేట్ చేస్తుందని తన ట్విట్టర్ ప్రొఫైల్ లో చూడవొచ్చు. తను బీజేపీకి అనుకూలంగా పోస్టులు మరియు వీడియోలు పెట్టినట్టు చూడవొచ్చు మరియు ప్రధానమంత్రి మోడీ కూడా తనను ట్విట్టర్ లో ఫాలో అవుతున్నారు. కానీ, తను బీజేపీ పార్టీ మహిళా మోర్చా ఢిల్లీ విభాగం అధ్యక్షురాలు మాత్రం కాదు.
బీజేపీ పార్టీ మహిళా మోర్చా ఢిల్లీ విభాగం అధ్యక్షురాలు పేరు ‘పూనం ఝా’ అని ‘ఫస్ట్ పోస్ట్’ ఆర్టికల్ లో చూడవొచ్చు. అంతేకాదు, తన ఫోటోలను ‘@pparasharjhabjp’ ట్విట్టర్ ప్రొఫైల్ లో చూడవొచ్చు.
చివరగా, గుంజా కపూర్ ఒక రాజకీయ విశ్లేషకురాలు, బీజేపీ పార్టీ మహిళా మోర్చా ఢిల్లీ విభాగం అధ్యక్షురాలు కాదు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?