మైనారిటీ ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్‌కు 1-8 తరగతుల మదర్సా విద్యార్ధులతో పాటు ఇతర మైనారిటీ విద్యార్ధులను కూడా అనర్హులుగా కేంద్రం ప్రకటించింది

“దేశంలో మాదర్సా విద్యార్ధులకు ఇచ్చే స్కాలర్‌షిప్స్ ను బంద్ చేసిన కేంద్ర ప్రభుత్వం” అని చెప్తున్న ఒక పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

YouTube Poster

క్లెయిమ్: దేశంలో మాదర్సా విద్యార్ధులకు ఇచ్చే స్కాలర్‌షిప్స్ ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.

ఫాక్ట్: ‘Ministry of Minority affairs’ అందించే ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్‌కు ఇప్పటి వరకు అన్ని తరగతులకు చెందిన పేద  మైనారిటీ విద్యార్ధులు అనగా ముస్లిం, సిక్కు, క్రిస్టియన్, బౌద్ధ, జైన మరియు పార్శీ మతానికి చెందిన వారు అర్హులుగా ఉన్నారు. అయితే, తాజాగా విడుదల అయిన గైడ్లైన్స్ ప్రకారం కేవలం 9&10 తరగతులకు చెందిన పేద మైనారిటీ విద్యార్ధులు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు అవుతారు. ఈ స్కాలర్‌షిప్‌ అన్ని మైనారిటీలకు ఉద్దేశించినది, కేవలం మాదర్సా విద్యార్ధులకు మాత్రమే కాదు.  కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా ఈ విషయాన్ని గురించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటీసులో ఏం ఉందో ఇప్పుడు చూద్దాం.

“ప్రతి విద్యార్థికి ఉచిత ప్రాధమిక (1-8 తరగతులకు) నిర్బంధ విద్యను ప్రభుత్వం తప్పనిసరిగా అందించాలి అని విద్యా హక్కు చట్టం, 2009 చెపుతుంది. దీని ప్రకారం కేవలం 9&10 వ తరగతి చదువుతున్న (SC/ST/OBC) విద్యార్ధులు మాత్రమే ‘Ministry of Social Justice & Empowerment and Ministry of Tribal Affairs’ వారు అందించే ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకానికి అర్హులుగా ఉన్నారు. అలాగే, 2022-23 నుంచి, ‘Ministry of Minority affairs’ అందించే ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్ కు కూడా 9&10 వ తరగతి చదువుతున్న (మైనారిటీ) విద్యార్ధులు మాత్రమే అర్హులు అవుతారు.”

అయితే, National commission for Minorities Act,1992 ప్రకారం మైనారిటీ విద్యార్ధులు అంటే ముస్లిం, సిక్కు, క్రిస్టియన్, బౌద్ధ, జైన మరియు పార్శీ మతానికి చెందిన వారు అని ఈ మైనారిటీ స్కాలర్‌షిప్ స్కీమ్ కు సంబంధించిన డాక్యుమెంట్ లో ఇచ్చారు.

ఇందులో ఎక్కడా కూడా కేవలం ముస్లిం మదర్సా విద్యార్ధులకు మాత్రమే స్కాలర్‌షిప్‌లు ఇచ్చే నియమం లేదు. అన్ని మైనారిటీల లాగానే ముస్లిం విద్యార్ధులకు కూడా ఈ స్కీమ్ వర్తిస్తుంది. అయితే నోటీసులో చెప్పిన విధంగా, 2022-23 నుంచి కేవలం 9&10 వ తరగతి చదివే పేద మైనారిటీ విద్యార్ధులు అనగా ముస్లిం, సిక్కు, క్రిస్టియన్, బౌద్ధ, జైన మరియు పార్శీ మతానికి చెందిన వారు మాత్రమే అర్హులు అవుతారు. ఇదే విషయాన్ని ఉత్తర్ ప్రదేశ్ మదర్సా శిక్షా పరిషద్ (UPMSP)వారు కూడా స్పష్టం చేశారు అని ‘The Print’ పేర్కొంది.

ఇక SC, ST, OBC విద్యార్ధులకు ఇస్తున్న ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్‌కు కూడా ఆయా సామాజిక వర్గానికి చెందిన 9&10 తరగతులు చదువుతున్న పేద విద్యార్ధులు మాత్రమే అర్హులుగా ఉంటారు. వాటికి సంబంధించిన వివరాలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, ‘Ministry of Minority affairs’ అందించే ప్రీ-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ లో చేసిన మార్పులు అన్ని మైనారిటీల విద్యార్ధులకు  అమలు అవుతాయి, కేవలం మాదర్సా విద్యార్ధులకు మాత్రమే కాదు.