ఫిబ్రవరి లో పోస్ట్ చేసిన వీడియోని చూపించి, ప్రపంచదేశాలు కరోన బారిన పడి బాధపడుతుంటే ఆమీర్ ఖాన్ చైనా దేశ ప్రజలకు మాత్రమే తన సంతాపం తెలిపారని షేర్ చేస్తున్నారు

ప్రపంచదేశాలు కరోన వైరస్ తో బాధపడుతుంటే బాలీవుడ్ నటుడు ఆమీర్ ఖాన్ చైనా దేశస్థులకి మాత్రమే తన సానుభూతి వ్యక్తపరుస్తున్నారు అంటూ షేర్ చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కరోన కారణంగా మరణించిన చైనా దేశస్థులకు మాత్రమే ఆమీర్ ఖాన్ తన సానుభూతి వ్యక్తపరిచారు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఆ వీడియో ఫిబ్రవరి లో పోస్ట్ చేసినట్టుగా మా విశ్లేషణలో తెలిసింది. కరోన వైరస్ చైనా దేశంలో మాత్రమే ప్రభావం చుపిస్తునప్పుడు, ఆమీర్ ఖాన్ ఆ దేశ ప్రజలకు మనోదైర్యం చెప్తూ పెట్టిన వీడియో అది. అప్పటికి ఇతర దేశాలలో కరోన ప్రభావం అంతగా లేదు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

పోస్టులో షేర్ చేసిన వీడియో కోసం యుట్యూబ్ లో వెతకగా, ‘24 Feb 2020’ నాడు ‘South China Morning post’ వారు తమ అధికారిక యూట్యూబ్ ఛానల్ లో ఈ వీడియో పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఆ వీడియో కింద వివరణలో, కరోన వైరస్ కారణంగా బాధపడుతున్న చైనా దేశ ప్రజలకు బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ మనోదైర్యం చెప్తూ పెట్టిన వీడియో అని రాసి ఉంది. కావున, ఈ వీడియో ఇటివల పోస్ట్ చేసింది కాదు.

‘24 Feb 2020’ నాటికి కరోన వైరస్ చైనా దేశంలో మాత్రమే ఎక్కువగా ప్రభావం చూపెట్టింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)  ‘24 Feb 2020’ నాడు రిలీజ్ చేసిన కోవిడ్-19 హెల్త్ బులెటిన్లో ప్రపంచవ్యాప్తంగా 79331 మంది కరోన కేసులు నమోదైనట్టు వెల్లడించారు. ఆ 79331 కేసులలో చైనా దేశస్థులు 77262 మంది ఉండగా, మిగితా దేశాలకు సంబంధించి 2069 మంది ఈ వ్యాధి బారిన పడినట్టు వెల్లడించారు. దీనిబట్టి ఆమీర్ ఖాన్ ఆ వీడియో పోస్ట్ చేసే సమయానికి చైనా తప్ప మిగితా దేశాలలో కరోన ప్రభావం అంతగా లేదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, చైనా దేశంలో మాత్రమే కరోన ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఆమీర్ ఖాన్ చేసిన ఈ వీడియోని ఇటీవల చేసినట్టు ప్రచారం చేస్తున్నారు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?