FCI ప్రైవేటు సంస్థల గోదాములలో చాలా సంవత్సరాల ముందునుండే ఆహార ధాన్యాలు నిల్వ చేస్తోంది

దేశంలో 30 సంవత్సరాల పాటు ఆహారధాన్యాలు నిల్వచేసే కాంట్రాక్టు FCI ని కాదని అదానికి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం’ అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: దేశంలో 30 సంవత్సరాల పాటు ఆహారధాన్యాలు నిల్వచేసే కాంట్రాక్టు FCI ని కాదని అదానికి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.

ఫాక్ట్ (నిజం): National policy on handling, storage and transportation of foodgrains ద్వారా 2000వ సంవత్సరంలోనే ఆహార ధాన్యాల నిల్వ చేయడానికి ప్రైవేటు గోదాములు నిర్మించాలని నిర్ణయించింది. ఈ పాలసీకి అనుగుణంగా 2008 లో ప్రవేశపెట్టిన  Private Entrepreneurs Guarantee (PEG) Scheme  PPP పద్దతిలో ప్రైవేటు సంస్థలను భాగస్వామ్యం చేస్తుంది. ఆహార ధాన్యాలు నిల్వచేయడానికి ప్రైవేటు సంస్థల గోదాములుకు కేంద్ర ప్రభుత్వం నేరుగా టెండర్లు ఇవ్వదు, FCI ద్వారా టెండర్లు కేటాయిస్తుంది. అదానికి చెందిన వ్యవసాయ రంగ సంస్థ గోదాముల నిర్మాణంలో 2005 నుండే ఉంది. కేవలం అదానికి చెందిన కంపెనీలే కాదు, చాలా ఇతర ప్రైవేటు కంపెనీలకు కూడా టెండర్లు కేటాయించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఆహార ధాన్యాల నిల్వ మరియు రవాణా సమయంలో నష్టాలను తగ్గించడానికి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) సేకరించే ఆహార ధాన్యాల నిర్వహణ, నిల్వ మరియు రవాణాలో FCI పై భారం తగ్గించి, ఈ రంగంలో ప్రైవేటు భాస్వామ్యం ద్వారా అదనంగా వనరులను తీసుకురావడానికి 2000లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ‘National policy on handling, storage and transportation of foodgrains’ కి ఆమోదం తెలిపింది. పెద్ద ఎత్తున ఆహార ధాన్యాల నిల్వ చేయడానికి మౌళిక వసతులను ఆధునీకరించే క్రమంలో ఈ రంగంలోకి ప్రైవేటు సంస్థలను అనుమతించాలని ఈ పాలసీ ద్వారా నిర్ణయం తీసుకున్నారు.

ఈ పాలసీకి అనుగుణంగా 2008 లో ప్రవేశపెట్టిన  Private Entrepreneurs Guarantee (PEG) Scheme  PPP పద్దతిలో ప్రైవేటు సంస్థలను భాగస్వామ్యం చేస్తుంది. ఈ స్కీం ప్రకారం గోదాములను ఆధునీకరించే భాగంగా PPP పద్దతిలో ప్రైవేటు కంపెనీలు నిర్మించే “స్టీల్ గోదాములను” FCI 30 సంవత్సరాలవరకి అద్దెకి తీసుకుంటుందని హామీ ఇస్తుంది. Private Entrepreneurs Guarantee (PEG) Scheme, 2008 కింద PPP పద్దతిలో ప్రైవేటు కంపెనీలు నిర్మించే గోదాములను మాత్రం FCI 10 సంవత్సరాలవరకి అద్దెకి తీసుకుంటుందని హామీ ఇస్తుంది.

Private Entrepreneurs Guarantee Scheme కింద ఆహార ధాన్యాల నిల్వ చేయడానికి తమ సొంత గోదాములతో పాటు సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మరియు ప్రైవేటు సంస్థల గోదాములను అద్దెకి తీసుకుంటుంది. సాధారణంగా ఆహార ధాన్యాల నిల్వ చేయడానికి ప్రైవేటు సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నేరుగా టెండర్ల ఇవ్వదు, FCI ద్వారా టెండర్లకు ఆహ్వానించి ప్రైవేటు గోదాములను అద్దెకు తీసుకుంటుంది. FCI, PPP లో కింద ఇచ్చిన పద్దతుల్లో ప్రైవేటురంగ భాగస్వామ్యం కోసం టెండర్లు ఆహ్వానిస్తుంది.

ఈ టెండర్లకి సంబంధించి విధివిధానాలకు సంబంధించిన సమాచారం ఇక్కడ చూడొచ్చు. ఈ స్కీం కింద 2016-2020 మధ్యలో అదానితో పాటు మరికొన్ని ప్రైవేటు కంపెనీలు దేశంలోని పలు రాష్ట్రాలలో గోదాముల నిర్మించేందుకు టెండర్లు పొందిన సమాచారం ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. FCI లో టెండర్లకు సంబంధించి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం 2020లో గోదాములకి సంబంధించి అదానికి చెందిన సంస్థకి ఎటువంటి టెండర్ కేటాయించలేదు. దీన్నిబట్టి ఆహార ధాన్యాల నిల్వ చేయడానికి ప్రైవేటు సంస్థల గోదాములను ఎప్పటినుండో వాడుతున్నట్టు అర్ధమవుతుంది.

2000వ సంవత్సరంలో తీసుకొచ్చిన పాలసీకి అనుగుణంగా 2005లో అదానికి చెందిన కంపెనీ గోదాములకు FCI ఇచ్చిన కాంట్రాక్టుకి సంబంధించిన సమాచారం ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఈ పోస్టు ద్వారా చెప్తున్న విషయం వైరల్ అయిన నేపథ్యంలో అదాని సంస్థ ఈ విషయం గురించి వివరణ ఇచ్చింది. ఈ వివరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వ పాలసీ అనుగుణంగా FCI 2003లో ప్రైవేటు సంస్థలను టెండర్లకు ఆహ్వానించగా, 2005లోనే అదాని సంస్థకి టెండర్ కేటాయించారు. 2007లో 20 సంవత్సరాల కన్సెషన్ పీరియడ్ తో ఈ ప్రాజెక్ట్ మొదలైందని తెలిపింది. పైగా ఈ వివరణలో వ్యవసాయ రంగానికి సంబంధించి అదాని సంస్థ (Adani Agri Logistics Ltd. (AALL)) 2005లోనే స్థాపించబడిందని తెలిపింది. వీటన్నిటి ఆధారంగా ఆహార ధాన్యాలు నిల్వచేయడానికి ప్రైవేటు సంస్థల గోదాములుకు కేంద్ర ప్రభుత్వం నేరుగా టెండర్లు ఇవ్వదు, FCI ద్వారా టెండర్లు కేటాయిస్తుంది, పైగా ఈ పద్ధతి చాలా సంవత్సరాల ముందు నుండే ఉంది.

వ్యవసాయంలో ప్రైవేట్ రంగాన్ని అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహిస్తున్న ఆందోళనల నేపథ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే పోస్టులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. 

చివరగా, FCI ప్రైవేటు సంస్థల గోదాములలో చాలా సంవత్సరాల ముందునుండే ఆహార ధాన్యాల నిల్వ చేస్తోంది.