రాష్ట్రపతి భవన్ భద్రతా విభాగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము PSO (వ్యక్తిగత భద్రతా అధికారి)గా పనిచేస్తున్న CRPF అసిస్టెంట్ కమాండెంట్ పూనమ్ గుప్తా వివాహం 12 ఫిబ్రవరి 2025న రాష్ట్రపతి భవన్‌లో జరిగింది (ఇక్కడ). ఈ నేపథ్యంలో “సీఆర్పీఎఫ్ (CRPF) అసిస్టెంట్ కమాండెంట్ పూనం గుప్తా వివాహం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన మొదటి వివాహ వేడుక” అని చెప్తూ పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి (ఇక్కడ, ఇక్కడ). అలాగే, CNBC-TV18, ఇండియా టుడే, ది మింట్, డెక్కన్ హెరాల్డ్, PTI, ఎకానమిక్ టైమ్స్ వంటి ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు, సాక్షి, ఆంధ్రజ్యోతి, V6 వెలుగు వంటి ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు పూనమ్ గుప్తా వివాహం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన మొదటి వివాహ వేడుక అని పేర్కొంటూ కథనాలను ప్రచురించాయి. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: 12 ఫిబ్రవరి 2025న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన సీఆర్పీఎఫ్ (CRPF) అసిస్టెంట్ కమాండెంట్ పూనం గుప్తా వివాహం రాష్ట్రపతి భవన్‌లో జరిగిన మొదటి వివాహ వేడుక.
ఫాక్ట్(నిజం): 12 ఫిబ్రవరి 2025న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన CRPF అసిస్టెంట్ కమాండెంట్ పూనమ్ గుప్తా వివాహానికి ముందు కూడా రాష్ట్రపతి భవన్‌లో పలువురి వివాహ వేడుకలు జరిగాయి. ఇదే విషయాన్ని భారత ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) 12 ఫిబ్రవరి 2025న తన అధికారిక ఫాక్ట్-చెకింగ్ X (ట్విట్టర్)లో స్పష్టం చేసింది. అలాగే, రాష్ట్రపతి భవన్ అధికారిక డిజిటల్ ఫోటో లైబ్రరీ వెబ్‌సైట్‌లోని ఫోటోలను పరిశీలిస్తే, గతంలో కూడా రాష్ట్రపతి భవన్‌లో పలు వివాహ వేడుకలు జరిగాయని తెలుస్తుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
వైరల్ పోస్టులు, ప్రముఖ మీడియా సంస్థల కథనాలు పేర్కొన్నట్లుగా 12 ఫిబ్రవరి 2025న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన CRPF అసిస్టెంట్ కమాండెంట్ పూనం గుప్తా వివాహం వేడుకే రాష్ట్రపతి భవన్‌లో జరిగిన మొదటి వివాహ వేడుకా? కాదా? అని తెలుసుకోవడానికి అని తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ వైరల్ వార్తపై భారత ప్రభుత్వానికి చెందిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) 12 ఫిబ్రవరి 2025న తన అధికారిక ఫాక్ట్-చెకింగ్ X (ట్విట్టర్) హ్యాండిల్‌లో స్పందిస్తూ, చరిత్రలో మొదటిసారిగా రాష్ట్రపతి భవన్ ఓ వివాహాన్ని నిర్వహిస్తున్నట్లు పలు మీడియా సంస్థలు తప్పుగా కథనాలు ప్రచురించాయని, అలాగే ఈ వార్తలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఈ X(ట్విట్టర్) పోస్టులో (ఆర్కైవ్డ్) “చరిత్రలో తొలిసారిగా రాష్ట్రపతి భవన్ వివాహానికి ఆతిథ్యం ఇవ్వనుంది అనే వార్తాలో నిజం లేదు. ప్రెసిడెంట్స్ ఎస్టేట్ (రాష్ట్రపతి భవన్) ప్రారంభం నుండి అనేక వివాహాలకు వేదికగా ఉంది” అని PIB పేర్కొంది.
తదుపరి మేము రాష్ట్రపతి భవన్ యొక్క అధికారిక డిజిటల్ ఫోటో లైబ్రరీ వెబ్‌సైట్‌ను పరిశీలించగా, రాష్ట్రపతి ఎస్టేట్‌లో జరిగిన పలు వివాహ వేడుకలు, రిసెప్షన్‌ల యొక్క ఫోటో ఆల్బమ్‌లు మాకు లభించాయి (ఇక్కడ, ఇక్కడ,& ఇక్కడ) (ఆర్కైవ్డ్ ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). వీటిలో రాష్ట్రపతి, రాష్ట్రపతి భవన్‌లో పనిచేసే సిబ్బంది కుటుంబాలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమాలకు మాజీ అధ్యక్షులు రామ్ నాథ్ కోవింద్, ప్రణబ్ ముఖర్జీ హాజరయ్యారు. దీన్ని బట్టి CRPF అసిస్టెంట్ కమాండెంట్ పూనమ్ గుప్తా వివాహానికి ముందు కూడా రాష్ట్రపతి భవన్‌లో పలువురి వివాహ వేడుకలు జరిగాయిని నిర్ధారించవచ్చు.
12 ఫిబ్రవరి 2025న రాష్ట్రపతి భవన్‌లో పెళ్ళి చేసుకున్న పూనమ్ గుప్తా 74వ గణతంత్ర దినోత్సవ కవాతులో మహిళా CRPF బృందానికి నాయకత్వం వహించారు. ఆమె వివాహం చేసుకున్న వ్యక్తి పేరు అవనీష్ కుమార్, అతను ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్‌లో CRPF అధికారిగా పనిచేస్తున్నాడు (ఇక్కడ, ఇక్కడ). అలాగే ఈ వైరల్ పోస్టులో ఉన్న ఫోటోలో ఉంది పూనమ్ గుప్తానే (ఇక్కడ, ఇక్కడ).
చివరగా, CRPF అసిస్టెంట్ కమాండెంట్ పూనమ్ గుప్తా వివాహానికి ముందు కూడా రాష్ట్రపతి భవన్‌లో పలువురి వివాహ వేడుకలు జరిగాయి.