ఎడిట్ చేసిన వీడియోని కేసీఆర్ సభలో ప్రజలు రేవంత్ రెడ్డికి హర్షధ్వానాలు చేస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

కేసీఆర్ సభలో రేవంత్ క్రేజ్,” అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. సభలో కేసీఆర్ కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధి గురించి ప్రస్తావించిన వెంటనే బిఆర్ఎస్ కార్యకర్తలు హర్షధ్వానాలు చేస్తున్న దృశ్యాలను మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కామారెడ్డి కేసీఆర్ సభలో బిఆర్ఎస్ కార్యకర్తలు రేవంత్ రెడ్డికి హర్షధ్వానాలు చేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో ఎడిట్ చేయబడినది. కామారెడ్డి సభలో కేసీఆర్ ప్రసంగాన్ని చూపిస్తున్న పూర్తి వీడియోలోని వేర్వేరు వీడియో క్లిప్పులని జోడిస్తూ ఈ వీడియోని రూపొందించారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో కోసం కీ పదాలను ఉపయోగించి వెతికితే, కామారెడ్డి సభలో కేసీఆర్ పూర్తి ప్రసంగం వీడియో మాకు ‘Aadhan Telugu’ అనే యూట్యూబ్ ఛానెల్లో దొరికింది.  1:18:56 నిమిషాల దగ్గర కేసీఆర్, “ఎన్నో ఎలెక్షన్లు వచ్చినై, పోయినై. ఇక ముందు కూడా వస్తాయి, పోతై. ఎలెక్షన్ అన్నప్పుడు పార్టీకి ఒకరు నిలబడుతారు. ఇప్పుడు బీఆర్ఎస్ నుండి నేను నిలబడ్డ కామారెడ్డిలో, కాంగ్రెస్‌ నుండి ఒకాయన వస్తారు, బీజేపీకి కూడా ఒక ఆయన వస్తాడు. ఉంటే ఎవరో ఒకరు ఇండిపెండెంట్లు కూడా ఉండవచ్చు. వ్యక్తుల గురించి ఆలోచన చేయాలి. అభ్యర్ధి గుణం, గణము, మంచి చెడ్డలు చూడాలి,” అని మాట్లాడారు. కేసీఆర్ కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధి గురించి ప్రస్తావించినప్పుడు, పోస్టులో షేర్ చేసిన వీడియోలో కనిపిస్తున్నట్టు, ప్రజలు హర్షధ్వానాలు చేస్తున్నట్టు అసలైన లైవ్ విడియోలో కనిపించలేదు.  

కామారెడ్డి సభలో కేసీఆర్ ప్రసంగించేందుకు వెళ్లేటప్పుడు బిఆర్ఎస్ కార్యకర్తలు హర్షధ్వానాలు చేసిన వీడియో క్లిప్పుని, కేసీఆర్ ప్రసంగిస్తున్నప్పుడు తీసిన వీడియో క్లిప్పులను జోడిస్తూ ఈ వీడియోని రూపొందించారు.

చివరగా, కేసీఆర్ సభలో రేవంత్ రెడ్డి ప్రజాధారణ దృశ్యాలంటూ షేర్ చేస్తున్న ఈ వీడియో ఎడిట్ చేయబడినది.