ధరణి పోర్టల్ ఉండాల్నా, తీసేయాల్నా అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక బహిరంగ సభలో ప్రజలను అడిగితే, ప్రజలు తీసేయాలని మొర పెట్టుకుంటున్న దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా షేర్ అవుతోంది. ధరణి పోర్టల్ కావాలనుకొనే వారు చేతులేత్తండి అని కేసిఆర్ అడిగితే, బహిరంగ సభలో పాల్గొన్న ప్రజాలెవరూ చేతులు ఎత్తకపోవడాన్ని మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: బీఆర్ఎస్ సభకు హాజరైన ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ను ధరణి పోర్టల్ తీసేయాలని కోరుతున్న దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో ఎడిట్ చేయబడినది. 09 జూన్ 2023 నాడు మంచిర్యాలలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభలో, ధరణి పోర్టల్ ఉంచాలా లేదా తీసేయాలా అని కేసీఆర్ ప్రజలను అడిగి, ఉండాలనుకున్నవాళ్ళు చేతులు ఎత్తమని అన్నాడు. దీని తర్వాత సభకి హాజరైన చాలా మంది చేతులు ఎత్తారు. మంచిర్యాల సభలో కేసిఆర్ ప్రసంగిస్తున్నప్పుడు తీసిన వేర్వేరు వీడియో క్లిప్పులని జోడిస్తూ ఈ వీడియోని రూపొందించారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియో కోసం కీ పదాలను ఉపయోగించి వెతికితే, ఈ వీడియో 9 జూన్ 2023 నాడు మంచిర్యాలలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభ దృశ్యాలను చూపిస్తున్నట్టు తెలిసింది. మంచిర్యాల బీఆర్ఎస్ బహిరంగ సభలో కేసిఆర్ ప్రసంగం యొక్క పూర్తి వీడియోని ‘T News’ వార్తా సంస్థ తమ యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ యొక్క సత్ఫలితాలను చెబుతూ, వీడియోలోని 26:45 నిమిషాల దగ్గర, ధరణి పోర్టల్ ఉంచాలా లేదా తీసేయాల్నా అని కేసిఆర్ ప్రజలను అడిగారు. దీనికి సభకు హాజరైన ప్రజలు ధరణి పోర్టల్ ఉండాలి అని సమాధానమిచ్చారు.
ధరణి పోర్టల్ కావాలనుకొనే వారు చేతులేత్తండి అని కేసిఆర్ అడిగితే, బహిరంగ సభలో పాల్గొన్న చాలా మంది జనం చేతులు పైకి ఎత్తిన దృశ్యాలను మనం ఈ వీడియోలో చూడవచ్చు. సింగరేణి బొగ్గుగణుల గురించి మాట్లాడుతున్నప్పుడు, బహిరంగ సభలోని కొంతమంది అరుస్తుండడంతో, కేసిఆర్, “ఎవరయ్య వీళ్ళు. మనవాళ్లేనా. మధ్యలో అరవకుండయ్యా బాబు”, అని అన్నారు. ఈ దృశ్యాలను మనం వీడియోలోని 16:28 నిమిషాల దగ్గర చూడవచ్చు. మంచిర్యాల బహిరంగ సభలో కేసిఆర్ ప్రసంగిస్తున్నప్పుడు తీసిన వేర్వేరు వీడియో క్లిప్పులని జోడిస్తూ ఈ వీడియోని రూపొందించారు.
చివరగా, ఎడిట్ చేసిన వీడియోని బీఆర్ఎస్ సభకు హాజరైన ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ను ధరణి పోర్టల్ తీసేయాలని కోరుతున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.