కేజ్రీవాల్ కొత్త వ్యవసాయ చట్టాలను సమర్దిస్తున్నాడని చెప్తూ ఎడిట్ చేసిన వీడియో షేర్ చేస్తున్నారు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను పొగుడుతూ మాట్లాడుతున్న వీడియో షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. BJP నేత సంబిత్ పాత్ర ఈ వీడియోని తన ట్విట్టర్ ఎకౌంటులో షేర్ చేసిన తరవాత ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయింది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను పొగుడుతూ మాట్లాడుతున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): 15 జనవరి 2021న Zee Punjab Haryana Himachal అనే ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ వ్యాఖ్యలు చేసారు. ఈ ఇంటర్వ్యూలోని పలు సందర్భాలలో కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను డిజిటల్ గా అతికించి, తను వ్యవసాయ చట్టాలకు మద్దత్తు తెలుపుతున్నట్టు ఒక 18 సెకండ్స్ వీడియో తయారు చేసారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

15 జనవరి 2021న Zee Punjab Haryana Himachal అనే ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టాలను వ్యతిరేకించాడు. ఐతే ఈ ఇంటర్వ్యూలో పలు సందర్భాలలో చేసిన వ్యాఖ్యలను కేజ్రీవాల్ కొత్త వ్యవసాయ చట్టాలకు మద్దతు తెలుపుతున్నట్టు డిజిటల్ గా అతికించి ఒక 18 సెకండ్స్ వీడియో తయారు చేసారు.

ఈ ఇంటర్వ్యూలో 6:00 నిమిషం వద్ద BJP నాయకులు కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతుల భూములు పోవు, కనీస మద్దతు ధర అలాగే ఉంటుంది, మార్కెట్లు అలాగే ఉంటాయని, ఇప్పుడు రైతులు దేశంలో ఎక్కడైనా తమ పంటలను అమ్ముకోవచ్చని చెప్తున్నారని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు, ఐతే ఈ వ్యాఖ్యలను కేజ్రీవాల్ కొత్త వ్యవసాయ చట్టాలకు మద్దతు తెలుపుతూ అన్నట్టు డిజిటల్ గా ఎడిట్ చేసారు. ఈ వ్యాఖ్యల తరవాత కేజ్రీవాల్ కొత్త చట్టాలను వ్యతిరేకిస్తూ చేసిన వ్యాఖ్యలను తొలగించారు.

ఇంకా ఈ ఇంటర్వ్యూలో 10:06వ సమయం వద్ద కేజ్రీవాల్ కనీస మద్దతు ధరకి సంబంధించి ఎంస్ స్వామినాథన్ చేసిన సిఫారసుల అమలునుద్దేశించి ‘ఈ సిఫారసులు అమలైతే, 70 సంవత్సరాలలో వ్యవసాయ రంగంలో  అతిపెద్ద విప్లవాత్మక అడుగవుతుందని’  కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలని కొత్త వ్యవసాయ చట్టాలకు మద్దతుగా అన్నట్టు డిజిటల్ గా ఎడిట్ చేసారు. పోస్టులోని వీడియోలో కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను తీసేసి కేవలం కొత్త చట్టాలకి మద్దతుగా BJP నాయకులూ చేసిన వ్యాఖ్యలను కేజ్రీవాల్ సంబోదిస్తూ చేసిన వ్యాఖ్యలను కేజ్రీవాల్ వ్యవసాయ చట్టాలకు మద్దతుగా వ్యాఖ్యానించినట్టు ఎడిట్ చేసారు.

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసనలు తెలుపుతున్న నేపధ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

చివరగా, కేజ్రీవాల్ కొత్త వ్యవసాయ చట్టాలను సమర్దిస్తున్నాడని చెప్తూ ఒక డిజిటల్ గా ఎడిట్ చేసిన వీడియో షేర్ చేస్తున్నారు.