ఎడిట్ చేసిన వీడియోని గోరఖ్‌పూర్ కిడ్నాప్ ముఠా గురించి పోలీసులు హెచ్చరిస్తున్నట్టు తప్పుగా షేర్ చేస్తున్నారు

గోరఖ్‌పూర్‌లో చిన్న పిల్లలని కిడ్నాప్ చేస్తున్న ముఠా గురించి పోలీస్ ఆఫీసర్ ప్రజలను హెచ్చరిస్తున్న దృశ్యాలు, అంటూ ఒక వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసారు. పోలీస్ ఆఫీసర్ చెబుతున్న ఆ ముఠా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రంలో చొరబడ్డట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: గోరఖ్‌పూర్‌లో చిన్న పిల్లలని కిడ్నాప్ చేస్తున్న ముఠా గురించి ఒక పోలీస్ ఆఫీసర్ ప్రజలను హెచ్చరిస్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో ఎడిట్ చేయబడినది. చిన్నపిల్లలను కిడ్నాప్ చేసే ముఠా గురించి సోషల్ మీడియాలో వస్తున్నవి తప్పుడు వార్తలని, అవి నమ్మకూడదని గోరఖ్‌పూర్ పోలీస్ పెట్టిన ప్రెస్ మీట్ వీడియోలోని ఒక భాగాన్ని కత్తిరించి ఇలా షేర్ చేస్తున్నారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియోలో ‘Gorakhpur News’ లోగో కనపడుతునట్టు మనం గమనించవచ్చు. ఈ వీడియో కోసం ‘Gorakhpur News’ యూట్యూబ్ చానెల్లో వెతికితే, ఈ వీడియో యొక్క పూర్తి వెర్షన్ ‘Gorakhpur News’ యూట్యూబ్ చానెల్లో దొరికింది. ఈ వీడియోని ఆ ఛానల్ 25 ఆగష్టు 2019 నాడు అప్లోడ్ చేసింది. 2 నిమిషాల 35 సెకెన్ల వ్యవధి కలిగిన ఈ వీడియోలో, పోస్టులో షేర్ చేసిన వీడియో 0:21 నుండి 1:47 నిమిషాల వ్యవధిలో ఉండటాన్ని మనం గమనించవచ్చు. గోరఖ్‌పూర్ కిడ్నాప్ ముఠా గురించి సోషల్ మీడియాలో పెడుతున్న తప్పుడు వార్తని ‘Gorakhpur News’ యాంకర్ చదువుతున్న భాగాన్ని మాత్రమే ఈ  పోస్టులో షేర్ చేసారు.

ఈ వీడియోలోని 1:47 నిమిషం తర్వాత గోరఖ్‌పూర్ జిల్లా SP సోషల్ మీడియాలో చిన్న పిల్లలని కిడ్నాప్ చేసే ముఠా గురించి వస్తున్న వార్తలు తప్పని స్పష్టం చేసారు. గోరఖ్‌పూర్ లో అటువంటి ఘటనలేవి చోటుచేసుకోలేదని SP ఆ ప్రెస్ మీట్లో తెలిపారు. ఇవే క్లెయిమ్స్ చేస్తూ ఇదివరకు కూడా సోషల్ మీడియాలో కొందరు పోస్టులు పెట్టినట్టు ఆ పోలీస్ ఆఫీసర్ వీడియోలో తెలిపారు.

తమ యూట్యూబ్ ఛానెల్లో 25 ఆగష్టు 2019 నాడు పోస్ట్ చేసిన వీడియోలోని ఒక భాగాన్ని కత్తిరించి కొందరు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు షేర్ చేస్తున్నారని ‘Gorakhpur News’ ఛానల్ 12 సెప్టెంబర్ 2019 నాడు మరొక వీడియోని తమ చానెల్లో అప్లోడ్ చేసింది. ఈ వీడియోలో గోరఖ్‌పూర్ జిల్లా SP ‘Gorakhpur News’ ఛానల్ రిపోర్ట్ చేసిన వీడియోని కత్తిరించి తప్పుడు క్లెయిమ్స్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తునట్టు తెలిపారు. గోరఖ్‌పూర్ జిల్లా SP మాట్లాడిన మాటలని 2:38 నిమిషాల తర్వాత వినవచ్చు.

పోస్టులో షేర్ చేసిన  వీడియోని ఇదే క్లెయిమ్ తో 2019లో షేర్ చేసినప్పుడు, FACTLY దానికి సంబంధించి ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది.

చివరగా, ‘Gorakhpur News’ ఛానల్ రిపోర్ట్ చేసిన వీడియోలోని ఒక భాగాన్ని కత్తిరించి గోరఖ్‌పూర్‌లో చిన్న పిల్లలని కిడ్నాప్ చేస్తున్న ముఠా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చొరబడినట్టు తప్పుగా షేర్ చేస్తున్నారు.