Fake News, Telugu
 

భారత దేశం ఇస్లామిక్ రాజ్యంగా మారబోతుందని AIDUF నేత బద్రుద్దీన్ అజ్మల్ ఈ వీడియోలో అనలేదు

0

భారత దేశం ఇస్లామిక్ రాజ్యం అవుతుందని ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (AIDUF) పార్టీ నేత బద్రుద్దీన్ అజ్మల్ ఒక బహిరంగ సభలో మాట్లాడుతున్న ద్రుశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. దేశంలో ఒక్క హిందువు కూడా మిగలడని, అందరు ఇస్లాం మతంలోకి మారిపోతారని బద్రుద్దీన్ అన్నట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు.  ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భారత దేశం ఇస్లామిక్ రాజ్యంగా మారబోతుందని AIDUF పార్టీ నేత బద్రుద్దీన్ అజ్మల్ ఒక బహిరంగ సభలో మాట్లాడుతున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో ఎడిట్ చేయబడినది. ఒరిజినల్ వీడియోలో బద్రుద్దీన్ అజ్మల్ మాట్లాడిన మాటలని అనువదిస్తే, “ఈ భారత దేశాన్ని మొఘలులు 800 సంవత్సరాలు పరిపాలించారు. కాని వారు భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చడానికి ధైర్యం చేయలేదు…. “అంటూ కొన్ని వ్యాఖ్యలు చేసారు. ఈ ఒరిజినల్ వీడియోలోని కొన్ని క్లిప్పులని తమకు అనుగుణంగా మార్చి ఇలా తప్పుగా షేర్ చేస్తున్నారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియోకి సంబంధించిన సమాచారం కోసం కీ పదాలతో వెతికితే,  సోషల్ మీడియాలో షేర్ అవుతున్న పోస్టులోని ఈ వీడియోకి గురించి స్పష్టతనిస్తూ AIDUF పార్టీ MLA Dr. హాఫిజ్ రఫికుల్ ఇస్లాం ట్వీట్ చేసినట్టు తెలిసింది. ఎడిట్ చేయబడిన ఈ వీడియోని కొన్ని మీడియా ఛానల్స్ బద్రుద్దీన్ అజ్మల్ మత విద్వేషాలు రెచ్చగొట్టేల బహిరంగ సభలో మాట్లాడినట్టు షేర్ చేస్తున్నారని తెలిపారు. అంతేకాదు, ఈ వీడియో యొక్క ఒరిజినల్ వెర్షన్ ని హాఫిజ్ రఫికుల్ తన ట్వీట్ లో షేర్ చేసారు. అంతేకాదు, ఈ ఒరిజినల్ వీడియోని  ‘Maulana Badruddin Ajmal speech at Barpeta [ Sharukhatri Samasti #kayakuchi​] M.P Election 2019’ అనే టైటిల్ తో యూట్యూబ్ లో ఏప్రిల్ 2019లో పోస్ట్ చేసినట్టు తెలిసింది.

ఒరిజినల్ వీడియో లో బద్రుద్దీన్ అజ్మల్ మాట్లాడిన మాటలని అనువదిస్తే, అతను “ఈ భారత దేశాన్ని మొఘలులు 800 సంవత్సరాలు పరిపాలించారు. కానీ, ఇస్లామిక్ దేశంగా మార్చడానికి ధైర్యం చేయలేదు. బ్రిటిష్ వారు భారత దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించినప్పటికి, ఈ దేశాన్ని క్రైస్తవ మత దేశంగా మార్చలేక పోయింది. అలాగే, భారత దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత 55 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దేశాన్ని హిందూ మత దేశంగా మార్చాలనుకోలేదు. అలాంటి ఈ భారత దేశాన్ని ఇప్పుడు నరేంద్ర మోదీ హిందూ మత దేశంగా మార్చాలని కలలు కంటున్నారు, అవి నిజం కావు” అనే అర్థం వచ్చేలా మాట్లాడినట్టు తెలిసింది. ఈ ఒరిజినల్ వీడియోలోని కొన్ని క్లిప్పులని తమకు అనుగుణంగా మార్చి ఇలా తప్పుగా షేర్ చేస్తున్నారు.

ఈ ఎడిటెడ్ వీడియో గురించి బద్రుద్దీన్ అజ్మల్ ఇచ్చిన స్పష్టతని ‘ANI’ తమ ట్వీట్ లో రిపోర్ట్ చేసింది. వివిధ బహిరంగ సభలో తను మాట్లాడిన మాటలని జతచేసి, తమ పార్టీ అధికారంలోకి వస్తే అస్సాం ని ఇస్లామిక్ రాష్టంగా మారుస్తానని తెలిపినట్టుగా షేర్ చేస్తున్నారని బద్రుద్దీన్ మీడియాకి తెలిపారు. బద్రుద్దీన్ అజ్మల్ ఇచ్చిన ప్రెస్ మీట్ లో “ఈ వీడియో 100 శాతం అబద్దం. ఒరిజినల్ వీడియోలో నేను బహిరంగ సభలో ఉన్న ప్రజలని, ‘నన్ను హిమంతా బిస్వా శర్మ ఒక మొఘల్ గా వర్ణించారు. 800 సంవత్సరాలు భారత దేశాన్ని పరిపాలించిన మొఘలులు ఈ దేశాన్ని ఇస్లాం మత దేశంగా ఎప్పుడైనా మార్చాలని ప్రయత్నించాయా?, అని అడిగినప్పుడు ప్రజలు దానికి ‘లేదు’ అని సమాధానం ఇచ్చారు.” అని తెలిపారు.  

బద్రుద్దీన్ అజ్మల్ ఇదివరకు చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరగా, ఎడిట్ చేయబడిన వీడియోని చూపిస్తూ AIDUF నేత బద్రుద్దీన్ అజ్మల్ భారత దేశం ఇస్లామిక్ రాజ్యంగా మారబోతుందని మాట్లాడినట్టు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll