‘డ్రోన్ బాయ్’ ప్రతాప్ ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ DRDOలో శాస్త్రవేత్తగా నియమించలేదు.

21 ఏళ్ళ యువ శాస్త్రవేత్త ‘డ్రోన్ బాయ్’ ప్రతాప్ ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ DRDO లో నియమించినట్టు చెప్తూ ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. అంతేకాదు, ప్రతాప్ గురించిన చాలా వివరాలు ఆ పోస్ట్ లో ఇచ్చినట్టు కూడా చూడవొచ్చు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 21 ఏళ్ళ యువ శాస్త్రవేత్త డ్రోన్ బాయ్ ప్రతాప్ ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ DRDOలో శాస్త్రవేత్తగా నియమించారు.

ఫాక్ట్ (నిజం): ఇప్పటివరకు అయితే తనను ఎవరు DRDOలో నియమించలేదని ‘బూమ్ లైవ్’ వారితో మాట్లాడుతూ ప్రతాప్ తెలిపాడు. అంతేకాదు, తన గురించి పోస్టులో ఉన్న చాలా వరకు విషయాలకి కూడా ఎటువంటి ఆధారాలు లేవు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లో ఇచ్చిన నియామకం గురించి ‘బూమ్ లైవ్’ వారితో ప్రతాప్ మాట్లాడుతూ, ‘నాకు తెలిసి అధికారికంగా ప్రధాని ఎవరిని అలా నియమించలేరు. DRDO లో నియమిస్తూ ప్రధానమంత్రి నుండి నాకు ఎటువంటి ఆఫర్ రాలేదు’ అని తెలిపాడు. అంతేకాదు, DRDOలో శాస్త్రవేత్త గా నియామకం కావాలంటే కనీసం గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సమానమైన కాలేజీ నుండి సైన్స్ సబ్జెక్టులు, గణితం లేదా మనస్తత్వ శాస్త్రంలో కనీసం ఫస్ట్ క్లాస్ మాస్టర్ డిగ్రీ లేదా ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ లేదా మెటలర్జీలో ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఉండాలని డీఆర్‌డీఓ వెబ్సైటులో చదవొచ్చు.

మీడియా మరియు ప్రముఖలతో ప్రతాప్:

పోస్ట్ లో ప్రతాప్ గురించి ఇచ్చిన విషయాల కోసం ఇంటర్నెట్ లో వెతకగా, వాటిల్లో చాలా విషయాలకు అసలు ఆధారాలు లేవని తెలుస్తుంది. కానీ, తనను అనేక కన్నడ వార్తాసంస్థలు ఇంతకముందు ఇంటర్వ్యూ చేసినట్టు తెలుస్తుంది. ‘DD Chandana’ వారు కూడా తనను ఇంటర్వ్యూ చేసారు (ఆ వీడియో ఇప్పుడు లేదు). 2018 లో ‘Dighvijay 24X7 News’ వారి ఒక వీడియోలో బి.ఎస్.యడ్యూరప్ప, హెచ్.డి.కుమారస్వామి (అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి) మరియు ఇతర ప్రముఖులు ప్రతాప్ కి అభినందనలు తెలిపినట్టు చూడవొచ్చు. ‘టీవీ కన్నడ’ వారు ప్రతాప్ కి అవార్డు కూడా ఇచ్చినట్టు ఇక్కడ చూడవొచ్చు. ప్రతాప్ ఇతర ప్రముఖలతో దిగిన ఫోటోలను ‘droneprathap’ అనే పేరుతో ఉన్న ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ లో చూడవొచ్చు. (ప్రొఫైల్ మరియు ఫోటోల యొక్క ప్రామాణికతను FACTLY నిర్ధారించలేదు)

డ్రోన్లతో ప్రతాప్:

600 వందలకి పైగా డ్రోన్లను తను నిర్మించినట్టు చెప్పినా, ఎక్కడా కూడా తాను నిర్మించిన డ్రోన్ యొక్క ఫోటో లేదు. వివిధ డ్రోన్లతో ప్రతాప్ ఉన్న ఫోటోలు ఇంటర్నెట్ లో ఉన్నాయి. కానీ, అవి వేరు వేరు కంపెనీలు నిర్మించినవి, ప్రతాప్ చేసినవి కాదు. పోస్ట్ లో ఇచ్చిన ఫోటోలో ఉన్న డ్రోన్ కూడా ‘ACSL’ కంపెనీ వారిది. ACSL’ కంపెనీ తో ప్రతాప్ కి ఏమైనా సంబంధం ఉందా అని ఒక ‘రెడ్డిట్’ యూసర్ ఆ కంపనీ వారికి మెయిల్ చేయగా, ఆ డ్రోన్ కి ప్రతాప్ కి ఎటువంటి సంబంధం లేదని వారు బదులిచ్చారు.

అంతేకాదు, కర్ణాటక లో వరదల సమయంలో తాను వాడిన డ్రోన్ రిమోట్ కూడా ‘YUNEEC Typhoon H+’ రిమోట్ లాగా ఉన్నట్టు తెలుస్తుంది.

టోక్యో లో అవార్డు?

టోక్యో లో నిర్వహించిన ఎక్స్పో లో ప్రతాప్ కి మొదటి స్థానం వచ్చినట్టు పోస్ట్ లో ఉంది. ఆ బహుమతి కి సంబంధించిన సర్టిఫికేట్ ఫోటోని వివిధ న్యూస్ బ్లాగ్ వెబ్సైటుల్లో చూడవొచ్చు. ఆ సర్టిఫికేట్ ని సరిగ్గా గమనిస్తే, దాన్ని టోక్యో లో నిర్వహించిన ‘IREX 2017’ ఎగ్జిబిషన్ లో గెలుచుకున్నట్టు ఉంటుంది. అయితే, అది ఒక ట్రేడ్ ఎగ్జిబిషన్. దాంట్లో వివిధ కంపెనీలు తాము రూపొందించిన రోబోట్స్ ని ప్రదర్శిస్తాయి. ఆ ఎగ్జిబిషన్ లో అలాంటి పోటీ ఒకటి జరిగినట్టుగా కానీ, దాంట్లో ప్రతాప్ గెలిచినట్టుగా కానీ ఎక్కడా లేదు. 2017 ఎక్స్పో అయిపోయాక, ఆ ఈవెంట్ కి సంబంధించిన వివరాలు ఇస్తూ రిలీజ్ చేసిన డాక్యుమెంట్ లో కూడా ఆ బహుమతి గురించి లేదు. అంతేకాదు, ప్రతాప్ సర్టిఫికేట్ మీద ఉన్న ‘Airbus Defence and Space’ కంపెనీ పేరు అసలు ఆ డాక్యుమెంట్ లోనే లేదు.

జర్మనీ లో అవార్డు?

అంతేకాదు, తాను జర్మనీ లో ‘CeBIT Drone Expo 2018’ లో గెలిచినట్టు ప్రతాప్ చెప్పుకుంటున్న ‘Albert Einstein Innovation Medal’ గురించి కూడా ఎక్కడా ఎటువంటి సమాచారం లేదు. దాని గురించి వెతికితే ప్రతాప్ సర్టిఫికేట్ ఫోటోలు వస్తాయి తప్ప వేరే ఎక్కడా ఏమీ లేదు. ఆ  సర్టిఫికేట్ ఫోటోలో పైన ‘Albert Einstein Innovation Medal’ అని రాసి ఉంటే, కింద ‘Albert Einstein Innovation Award’ అని రాసి ఉంది. అంతేకాదు, సర్టిఫికేట్ పై ‘Deutsche Messe’ కంపెనీ సీఈఓ గా ‘Wolfram von Fritsch’ పేరు ఉన్నట్టు చూడవొచ్చు. కానీ, జూన్ 2017 లోనే ‘Dr. Wolfram von Fritsch’ నుండి ‘Dr. Jochen Köckler’ ఆ బాధ్యత తీసుకున్నట్టు ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. కానీ, 2018 లో కూడా ప్రతాప్ సర్టిఫికేట్ పై ‘Wolfram von Fritsch’ పేరు ‘Deutsche Messe’ కంపెనీ సీఈఓ గా ఉంది. అంతేకాదు, ‘The Better India’ వారికి జర్మనీ ఈవెంట్ నిర్వాహకులు బదులిస్తూ, తాము అటువంటి అవార్డు ఇవ్వలేదని తెలిపినట్టు ఇక్కడ చదవొచ్చు.

జపాన్ యాత్ర – బులెట్ ట్రైన్ కథ:

ప్రతాప్ ‘IREX 2017’ ఎగ్జిబిషన్ లో పాల్గొనటానికి టోక్యో వెళ్ళినప్పుడు, ‘విమానాశ్రయం నుండి ఎగ్జిబిషన్ సెంటర్‌కు బుల్లెట్ రైలు 2 గంటలు మాత్రమే. సాధారణ రైలుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే బుల్లెట్ రైలు ప్రయాణం ఖరీదైనది. రైలు దిగాడు. ఎగ్జిబిషన్ సెంటర్ అక్కడి నుండి 8 కి.మీ.’, అని పోస్ట్ లో రాసి ఉన్నట్టు చూడవొచ్చు. కానీ గూగుల్ మ్యాప్ లో చూడగా, టోక్యో లోని రెండు అంతర్జాతీయ విమానాశ్రయాల నుండి ఎగ్జిబిషన్ జరిగిన ప్రదేశం (టోక్యో బిగ్ సైట్) కేవలం 15 కిలోమీటర్లు (హనేడ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి) మరియు  65 కిలోమీటర్లు (నరిటా ఇంటర్నేషనల్ విమానాశ్రయం నుండి) మాత్రమే అని తెలుస్తుంది. విమానాశ్రయం నుండి ఎగ్జిబిషన్ కి వెళ్ళడానికి బులెట్ రైలు అవసరం లేదు. అంతేకాదు, బులెట్ రైలు ఒక పట్టణం నుండి ఇంకో పట్టణానికి పోవడానికి. కాబట్టి, జపాన్ లోని వేరే సిటీ విమానాశ్రయంలో దిగి ఎగ్జిబిషన్ కి రావాలనుకుంటే తప్ప బులెట్ రైలు లో ఎగ్జిబిషన్ కి రెండు గంటలు పట్టదు.

ప్రతాప్ చెప్పిన ఇంకొన్ని విషయాలకు కూడా ఆధారాలు లేవు అని చెప్తూ, ఇంతకముందు ‘OpIndia’ వారు కూడా ఈ విషయం పై ఆర్టికల్ రాసారు. అయితే తన దగ్గర కావాల్సిన ఆధారాలు ఉన్నాయని, త్వరలోనే ప్రెస్ మీట్ పెట్టి అందరకి తెలియజేస్తని ప్రతాప్ తాజాగా కన్నడ మీడియా వారితో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన్నట్టు ఇక్కడ చూడవొచ్చు. ఈ విషయాల పై వివరణ కోసం FACTLY కూడా ప్రతాప్ కి ఫోన్ చేయగా, తన నుండి ఎటువంటి స్పందన లేదు. తన నుండి సమాధానం వచ్చాక ఈ ఆర్టికల్ అప్డేట్ చేయబడుతుంది.

చివరగా, ‘డ్రోన్ బాయ్’ ప్రతాప్ ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ DRDOలో శాస్త్రవేత్తగా నియమించలేదు. ఇంకా తన గురుంచి ప్రతాప్ చెప్పిన చాలా విషయాలకు ఆధారాలు లేవు.

అదనపు సమాచారం (JULY 17, 2020):

‘16 జులై 2020’ వరకైతే ‘FACTLY’ కి ప్రతాప్ నుండి ఎటువంటి సమాధానం రాలేదు. కానీ అతను తన అంతర్జాతీయ విజయాల గురించి సమాధానం ఇవ్వడానికి ‘Btv News Kannada’ ఛానల్ వారి ఒక కార్యక్రమం లో పాల్గొన్నాడు. ఆ కార్యక్రమం లో ప్రతాప్ కొన్ని సర్టిఫికెట్లని చూపించి అవి వాస్తవమైనవని పేర్కొన్నాడు. అయితే, ఆ సర్టిఫికెట్లు వాస్తవమైనవే అని నిరూపించడానికి ఎటువంటి సాక్ష్యాలు చూపించలేదు. కానీ, తన డ్రోన్ ఫోటోలు పబ్లిక్ డొమైన్‌లో లేకపోవడం గురించి ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రతాప్ తన మొబైల్ లో అతను డ్రోన్ తో పాటు ఉన్న ఒక ఫోటోని చూపించి దానిని తానే తయారు చేసినట్లుగా చెప్తాడు. ‘ఈ రోజు, నేను నా డ్రోన్లలో ఒక దాన్ని చూపించబోతున్నాను’ అని ప్రతాప్ అంటాడు. అంతేకాదు, అదే డ్రోన్‌ కి తాను అవార్డ్ ని కూడా గెలుచుకున్నానని చెప్పాడు. 

కానీ, ఆ ఫోటో అంతకుముందే పబ్లిక్ డొమైన్‌లో ఉంది. దానిని ‘The Better India’ జనవరి 2020 లో ప్రతాప్ గురించి రాసిన కథనం లో చూడవచ్చు.

bty

అయితే, ఆ డ్రోన్ పక్కకే ఉన్న పేపర్ మీద ‘BillzEye’ అనే పేరుని చూడవచ్చు. దాంతో, ‘BillzEye’ గురించి సమాచారం కోసం వెతికినప్పుడు, ‘BillzEye’ అనేది ‘మల్టీకాప్టర్ సిస్టమ్స్’ లో ప్రత్యేకత కలిగిన ఒక జర్మన్ కంపెనీ అని తెలిసింది.

‘BillzEye’ వారి ఫేస్‌బుక్ ఖాతాలో ప్రతాప్ ఫోటోలో ఉన్నటువంటి విజువల్స్ తో ఉన్న వీడియో ని పోస్ట్ చేసింది. ఆ వీడియో యొక్క వివరణ లో ఆ విజువల్స్ హానోవర్ (జర్మని) లో జరిగిన ‘CeBIT’ ఈవెంట్ వని ఉంది. ప్రతాప్ తాను ‘Albert Einstein Innovation Medal’ గెలుచుకున్నట్లుగా తెలిపిన ఈవెంట్ అదే. ఇంటర్వ్యూలో ప్రతాప్ ఆ ఫోటోని చూపిస్తూ, తాను అవార్డ్ గెలుచుకున్నానని సూచించింది ‘Albert Einstein Innovation Medal’ గురించే. కానీ, ‘BillzEye’ ప్రతాప్ పేరుని గానీ ఆ అవార్డు గురించి కానీ ఎక్కడా పేర్కొనలేదు. కొంతమంది యూజర్స్ ‘CeBIT2018’ లో ప్రదర్శించిన అదే డ్రోన్ యొక్క ఫోటోని కూడా పోస్టు చేశారు. ఆ పోస్టులను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 

ప్రతాప్ ఫొటోలో టేబుల్ పై ఉన్న అదే రెడ్ డ్రోన్ కి మరియు కొన్ని పరికరాల కి సంబంధించిన ఇతర ఫోటోలను ‘BillzEye’ వెబ్సైట్ లో లభించాయి. వెబ్సైట్ లో ఆ డ్రోన్ యొక్క పేరు ని ‘Thermographic copter BETH-001’ అని పేర్కొన్నారు. టేబుల్ పైన ఉన్న హెడ్సెట్ మీద ‘FAT SHARK’ అనే పేరు ఉంది. ‘FAT SHARK’ కంపెనీ డ్రోన్ పైలెట్స్ కోసం ‘FPV’ (ఫస్ట్-పర్సన్ వ్యూ) గాగుల్స్ ని ఉత్పత్తి చేస్తాడని తెలిసింది. 

‘BillzEye’ తమ వెబ్సైట్ లో మరియు ఫేస్బుక్ పేజ్ లో తాము ‘BVCP’ (Bundesverband Copter Piloten e.V.) అధికారిక సభ్యులమని పేర్కొన్నారు. అదే పేరుని మరియు లోగోని ప్రతాప్ వెనుకాల ఉన్న గోడపై చూడవచ్చు.  

‘BillzEye’ డ్రోన్ ని ప్రదర్శించింది ‘CeBIT2018’ లోని ‘BVCP’ స్టాల్ లో. ‘BVCP’ వెబ్సైట్ లోని ఒక కథనానికి ‘Impressions of CEBIT 2018’ (గూగుల్ ద్వారా జర్మన్ నుండి అనువదించబడింది) అని ఉంది. ‘BillzEye’ ఓనర్ ‘బిల్ గట్బైర్’ పేరుతో పాటూ మరికొంతమంది ఇతరుల పేర్లని ఆ కథనంలో చూడవచ్చు. కానీ, అందులో ఎక్కడా కూడా ప్రతాప్ పేరు పేర్కొని లేదు. అంతేకాదు, ఫొటోలోని డ్రోన్ ఆ ఈవెంట్ లో అవార్డ్ గెలిచినట్లుగా ఎక్కడా పేర్కొనలేదు. ఆ కథనంలో ఉన్న ఫోటోలలో ఎక్కడా కూడా ప్రతాప్ కనిపించడు. 

ఒక వేల ప్రతాప్ ‘BillzEye’ టీం సభ్యుడే అయితే, అతను నిజంగానే ‘Albert Einstein Innovation Medal’ గెల్చుకున్నట్లైతే (ఇంకా ధ్రువీకృతం అవలేదు), ప్రతాప్ పేరుతో పాటూ ‘BillzEye’ కంపెనీ లో అతని హోదాని పేర్కొని ఉండేది, అతని కాలేజీ పేరు కాదు. కానీ, ప్రతాప్ యొక్క సర్టిఫికెట్ మీద అతని కాలేజ్ పేరు పేర్కొని ఉంది, ఎక్కడా కూడా BillzEye’ కంపెనీ పేరు లేదు. FACTLY స్పష్టత కోసం ‘BillzEye’ కంపెనీ ని సంప్రదించింది, వారి నుండి సమాధానం రాగానే ఈ కథనం అప్డేట్ చేయబడుతుంది.