లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా కేరళలో వేలాది మంది మహిళలు వీధుల్లోకి వచ్చారని చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా కేరళలో వేలాది మంది మహిళలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్న వీడియో.
ఫాక్ట్: వీడియోలో కనిపిస్తున్నది లవ్ జిహాద్‌కు సంబంధించిన ర్యాలీ కాదు. కేరళలోని VTM NSS కాలేజీ విద్యార్ధి సంఘం ఎన్నికలలో ABVP అభ్యర్ధులు గెలిచినందున, 08 డిసెంబర్ 2022న వారి ప్రమాణ స్వీకారం అయ్యాక విద్యార్ధులు విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ వీడియోలో ఎక్కడా కూడా లవ్ జిహాద్‌కు సంబంధించిన నినాదాలు చేయలేదు. కావున పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
ముందుగా కేరళలో ఇటీవల లవ్ జిహాద్ వ్యతిరేఖ ర్యాలీలు ఏమైనా జరిగాయా అని ఇంటర్నెట్లో వెతకగా ఎలాంటి వార్తా కథనాలు లభించలేదు. ఇక వైరల్ వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వీడియోని 10 డిసెంబర్ 2022న యూట్యూబ్‌లో అప్లోడ్ చేసినట్లు గుర్తించాము. అయితే ఈ వీడియో టైటిల్ మాత్రం, “Dhanuvachapuram VTM NSS college ABVP election victory” అని ఉంది.
ఈ కాలేజీకు సంబంధించిన ఫేస్‌బుక్ పేజీను పరిశీలించాము. దాంట్లో ఉన్న సమాచారం ప్రకారం, 05 డిసెంబర్ 2022న జరిగిన స్టూడెంట్ యూనియన్ ఎన్నికలలో ABVPకి చెందిన అభ్యర్ధులు గెలిచారు. 08వ తేదీన ప్రమాణ స్వీకారం అయ్యాక విద్యార్ధులు అందరూ విజయోత్సవ ర్యాలీ చేశారు. ఆ వీడియోనే ఇప్పుడు వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో ఉన్న దృశ్యాలను కాలేజీ ఫేస్‌బుక్ పేజీలో ఉన్న దృశ్యాలకు పోల్చి చూస్తే రెండూ ఒకటే అని స్పష్టం అవుతుంది.
ఇక ఈ ర్యాలీ వీడియోలో వాళ్ళు చేసిన నినాదాలలో ఎక్కడా కూడా లవ్ జిహాద్ గురించి లేదు. “SFI డౌన్ డౌన్” , “సావర్కర్, రాజ్ గురు, సుఖదేవ్ వర్ధిల్లాలి”, “ కాషాయ జెండా వర్ధిల్లాలి” మొదలగు నినాదాలు చేశారు. ర్యాలీలో కనిపించిన ఈ బ్యానర్ పైన కూడా లవ్ జిహాద్ పదాలు లేవు. ఈ ఎన్నికల గెలుపు సందర్భంగా ABVP అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా చేసిన ట్వీట్ ను ఇక్కడ చూడవచ్చు.
చివరిగా, కేరళలో కాలేజీ ఎన్నికల గెలుపు సందర్భంగా జరిగిన ర్యాలీని లవ్ జిహాద్‌కు వ్యతిరేకంగా కేరళలో మహిళలు నిరసన తెలుపుతున్నట్టు షేర్ చేస్తున్నారు.