కర్ణాటకలో బలవంతపు మతమార్పిడి గురుంచి చేసిన చట్టాన్ని తప్పుగా షేర్ చేస్తున్నారు

కర్ణాటకలో మతమార్పిడి చేస్తే పది సంవత్సరాల జైలు శిక్ష అని అంటూ ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. కర్ణాటక మత స్వేచ్చా హక్కు బిల్లు 2021 శాసనసభలో ఇటీవల ప్రవేశపెట్టడంతో ఈ పోస్ట్ బాగా వైరల్ అయ్యింది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కర్ణాటకలో మతమార్పిడి చేస్తే పది సంవత్సరాల జైలు శిక్ష.

ఫాక్ట్: కర్ణాటకలో మతమార్పిడి చేస్తే పది సంవత్సరాల జైలు శిక్ష అని కొత్త బిల్లులో లేదు. బలవంతంగా లేదా మోసపూరితంగా మతం మార్చడం లేదా పెళ్లి చేసినట్లు రుజువైతే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించాలని కర్ణాటకలో ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులో ప్రతిపాదించారు. మతమార్పిడికి సంబంధించి బిల్లు తీసుకురావటం ఇది కొత్త కాదు; మరో తొమ్మిది రాష్ట్రాలు ఇంతకముందే దీనికి సంబంధించి చట్టాలు చేసాయి. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. 

పోస్టులో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, కర్ణాటకలో అటువంటి చట్టం ఉన్నట్టు ఎటువంటి సమాచారం లేదు.

కానీ, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మతమార్పిడికి సంబంధించి 21 డిసెంబర్ 2021న అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. బలవంతంగా లేదా మోసపూరితంగా మతం మార్చడం లేదా పెళ్లి చేసినట్లు రుజువైతే 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించాలని బిల్లులో ప్రతిపాదించారు. అయితే, విపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. మైనారిటీలను టార్గెట్ చేసేందుకే ఈ బిల్లును తీసుకొచ్చారని ఆరోపిస్తున్నాయి. బిల్లుతో ఎవరినీ టార్గెట్ చేయడంలేదని, బలవంతపు మతమార్పిడులను నిరోధించేందుకే ఈ బిల్లు తెచ్చామని సీఎం బస్వరాజ్ బొమ్మై తెలిపారు. ఈ ఆర్టికల్ రాసే సమయానికి అది కేవలం బిల్లు మాత్రమే, ఇంకా చట్టం అవలేదు.

భారత రాజ్యాంగం ప్రకారం ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు. ఏ మతానికైనా మారడానికి వీలుంటుంది. తమకు తామే మార్చుకొని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే అటువంటి మార్పిడులను గురించి ఈ బిల్లులో 10 ఏళ్ల జైలు శిక్ష ఏమి లేదు.

మతమార్పిడికి సంబంధించి బిల్లు తీసుకురావటం ఇది కొత్త కాదు; వేరే కొన్ని రాష్ట్రాల్లో ఇంతకముందే మతమార్పిడిపై చట్టాలు చేసారు. ఈ 2018 డాక్యుమెంట్ ప్రకారం, మతమార్పిడి నిరోధక చట్టాలు దాదాపు ఎనిమిది రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్ కూడా ఈ లిస్టులో చేరినట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం మతమార్పిడికి సంబంధించి ఎటువంటి చట్టం తీసుకురాలేదు.

చివరగా, కర్ణాటకలో మతమార్పిడి చేస్తే పది సంవత్సరాల జైలు శిక్ష అని తప్పుదోవ పట్టిస్తున్నారు.