చైనాలో చేసే M.B.B.S భారత్ లో చెల్లదని కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు ఉన్నది ఫేక్ పోస్ట్

చైనాలో చేసే M.B.B.S భారత్ లో చెల్లదని కేంద్ర ప్రభుత్వం తెలిపినట్టు చెప్తున్న ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కేంద్ర ప్రభుత్వం: ‘చైనాలో చేసే M.B.B.S భారత్ లో చెల్లదు’.

ఫాక్ట్ (నిజం): ): కేంద్ర ప్రభుత్వం తాజాగా అలాంటి ప్రకటన చేసినట్టు ఎక్కడా కూడా సమాచారం లేదు. భారతదేశంలో కాకుండా ఇతర దేశాల్లో (చైనా లోనే కాదు) M.B.B.S లేదా దానికి సమానమైన కోర్సు చేస్తే, వారు భారతదేశంలో ప్రాక్టిస్ చేయాలంటే ‘Foreign Medical Graduates Exam (FMGE)’ అనే పరీక్ష పాస్ అవ్వాలి. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని విషయం గురించి ఇంటర్నెట్ లో వెతకగా, కేంద్ర ప్రభుత్వం తాజాగా అలాంటి ప్రకటన చేసినట్టు ఎక్కడా కూడా సమాచారం లేదు. భారతదేశంలో కాకుండా ఇతర దేశాల్లో (చైనా లోనే కాదు) M.B.B.S లేదా దానికి తగ్గ కోర్సు చేస్తే, వారు భారతదేశంలో ప్రాక్టిస్ చేయాలంటే ‘Foreign Medical Graduates Exam (FMGE)’ అనే పరీక్ష పాస్ అవ్వాలని ‘Embassy of India – Beiing, China’ వెబ్సైటులో చూడవొచ్చు. చైనా లో చదవాలనుకునే విద్యార్థులు ‘NEET-UG’ పరీక్ష క్లియర్ చేసి ఉండాలని ఆ వెబ్సైటులో రాసి ఉన్నట్టు చూడవొచ్చు.

ప్రతి సంవత్సరం చైనా ‘Ministry of Education (MOE)’ వారు చైనాలో ఏ కాలేజీలలో విదేశీ విద్యార్థులు మెడికల్ కోర్సు ఇంగ్లీష్ మీడియంలో నమోదుచేసుకోవచ్చో తెలుపుతూ ఒక లిస్టు విడుదల చేస్తారని, కేవలం ఆ కాలేజీలలో చదివిన వారికే MCI వారు అర్హత సర్టిఫికేట్ ఇస్తారని, మరియు వారికే FMGE పరీక్ష రాసే అర్హత ఉంటుందని ఎంబసీ వెబ్సైటులో  చదవొచ్చు. 

గుర్తింపు పొందిన విదేశీ వైద్య సంస్థలు / విశ్వవిద్యాలయాల లిస్టును ‘Medical Council of India (MCI)’  వారి వెబ్సైటులో చూడవొచ్చు. 2019-2020 అకాడమిక్ సంవత్సరానికి నలభై ఐదు చైనా కాలేజీ పేర్లను ఇచ్చారు. 

అంతేకాదు, తాజాగా రిలీజ్ చేసిన ‘FMGE’ పరీక్ష బులెటిన్ లో కూడా పోస్ట్ లో చెప్పినట్టు చైనాలో చేసే M.B.B.S భారత్ లో చెల్లదని ఏమీ లేదు. అయితే, ‘FMGE’ పరీక్ష హాజరయ్యే విద్యార్థుల ఉత్తీర్ణత శాతం చాలా తక్కువగా ఉందని, 20 శాతం కంటే తక్కువ అని ఎంబసీ వెబ్సైటులో చూడవొచ్చు. 2018-19 సంవత్సరానికి ‘FMGE’ పరీక్ష లో హాజరైన వాళ్ళలో ఎక్కువ మంది చైనా లో మెడికల్ కోర్సు చేసినవారేనని ఇక్కడచూడవొచ్చు. మరిన్ని వివరాల కోసం  ‘FMGE’ పరీక్ష పై 2018 లో FACTLY రాసిన ఆర్టికల్ ని ఇక్కడ చదవొచ్చు. 

The National Medical Commission Act, 2019’ ప్రకారం ఆ చట్టం వచ్చిన మూడేళ్ళలో భారత్ లో చివరి సంవత్సరం అండర్ గ్రాడ్యుయేట్ చదువుతున్న విద్యార్థులకు మరియు విదేశాలలో చదివిన విద్యార్థులకు భారతదేశంలో ప్రాక్టిస్ చేయడానికి లైసెన్స్ ఇవ్వడానికి ‘National Exit Test’ నిర్వహించాలి. అయితే, ఆ పరీక్ష ఇంకా మొదలు అవ్వలేదు.

చివరగా, చైనాలో చేసే M.B.B.S భారత్ లో చెల్లదని కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు ఉన్నది ఫేక్ పోస్ట్.