ఇటీవల 23 ఆగస్టు 2024న, 41 మంది భారతీయ యాత్రికులు సహా 43 మంది ప్రయాణిస్తున్న బస్సు నేపాల్‌లోని తనహు జిల్లాలో అంబుఖైరేని సమీపంలో మర్స్యంగ్డి నదిలో పడిపోయింది (ఇక్కడ, ఇక్కడ) . పలు రిపోర్ట్స్ ప్రకారం, ఈ ప్రమాదంలో 41 మంది మరణించారని, మృతుల్లో ఎక్కువ మంది మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాకు చెందిన వారని మహారాష్ట్ర రిలీఫ్ అండ్ రీహ్యాబిలిటేషన్ మంత్రి గిరీష్ మహాజన్ 24 ఆగస్టు 2024న విలేకరుల సమావేశంలో పేర్కొన్నట్లు తెలుస్తుంది (ఇక్కడ, ఇక్కడ). ఈ నేపథ్యంలోనే, “గోరఖ్‌పూర్‌కు చెందిన బస్సు డ్రైవర్ ముస్తఫా అలియాస్ ముర్తాజా బస్సును కావాలనే వెయ్యి అడుగుల లోతైన లోయలో పడేశాడు, ఫలితంగా 30 మంది యాత్రికులు మరణించారని , డ్రైవర్ ముస్తఫా బస్సు నుండి దూకి తన ప్రాణాలను కాపాడుకున్నాడని, ఇది టూరిజం జీహాద్” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఇటీవల 23 ఆగస్టు 2024న, నేపాల్‌లోని తనహు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో బస్సు డ్రైవర్ ముస్తఫా అలియాస్ ముర్తాజా మరణించలేదు.
ఫాక్ట్(నిజం): పలు రిపోర్ట్స్ ప్రకారం, 23 ఆగస్టు 2024న, 41 మంది భారతీయ యాత్రికులు సహా 43 మంది ప్రయాణిస్తున్న బస్సు నేపాల్‌లోని తనహు జిల్లాలో అంబుఖైరేని సమీపంలో మర్స్యంగ్డి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ ముస్తఫా మరియు అతని సహాయకుడు కూడా మరణించాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఇటీవల నేపాల్‌లోని తనహు జిల్లాలో అంబుఖైరేని సమీపంలో జరిగిన బస్సు ప్రమాదం గురించి మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా, పలు రిపోర్ట్స్ లభించాయి(ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). ఈ రిపోర్ట్స్ ప్రకారం, మహారాష్ట్రకు చెందిన సుమారు 110 మంది యాత్రికులు గోరఖ్‌పూర్ నుంచి నేపాల్ సందర్శనకు ఉత్తరప్రదేశ్ కు చెందిన కేశర్వాని ట్రాన్స్‌పోర్టుకు చెందిన మూడు బస్సుల్లో వెళ్లారు. 23 ఆగస్టు 2024న 43 మందితో వెళ్తున్న బస్ ఒకటి నేపాల్‌లోని తనాహు జిల్లాలోని అంబుఖైరేని సమీపంలో ఉన్న మార్స్యాంగ్డీ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో మరణించిన 25 మంది యాత్రికుల మృతదేహాలను భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానంలో 24 ఆగస్ట్ 2024 సాయంత్రం మహారాష్ట్రలోని జలగావ్‌కు తరలించారు, డ్రైవర్ మరియు బస్సు క్లీనర్ మృతదేహాలను పోస్ట్‌మార్టం తర్వాత రోడ్డు మార్గంలో ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు పంపించారు. ఈ ప్రమాదంలో 41 మంది మరణించారని మహారాష్ట్ర రిలీఫ్ అండ్ రీహ్యాబిలిటేషన్ మంత్రి గిరీష్ మహాజన్ 24 ఆగస్టు 2024న విలేకరుల సమావేశంలో పేర్కొన్నట్లు తెలుస్తుంది. అలాగే, ఈ ప్రమాదంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బస్సు డ్రైవర్ ముస్తఫాతో పాటు అతని సహాయకుడు కూడా మరణించినట్లు ఈ రిపోర్ట్స్ పేర్కొన్నాయి.
ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ ముస్తఫా మరణించినట్లు తెలుపుతున్న మరిన్ని వార్త కథనాలను ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు. అలాగే అతని అంత్యక్రియలకు సంబంధించిన దృశ్యాలను చూపిస్తున్న న్యూస్ వీడియో రిపోర్టులను ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.
చివరగా, 23 ఆగస్టు 2024న నేపాల్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో బస్సు డ్రైవర్ ముస్తఫా అలియాస్ ముర్తాజా కూడా మరణించాడు.