వై.ఎస్.జగన్ అక్షరాబ్యాసం చేయిపిస్తున్న బాలుడు పలకపై టీడీపీ గుర్తు ‘సైకిల్’ని గీసాడంటూ ఎడిట్ చేసిన ఫోటోను షేర్ చేస్తున్నారు

ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో వై.ఎస్.జగన్ ప్రజలని కలవడానికి వెళ్ళినప్పుడు ఒక బాలుడు తన పలక మీద టీడీపీ గుర్తు ‘సైకిల్’ని గీసేసరికి షాక్ అయిన జగన్ అని క్లెయిమ్ చేస్తూ ఒక ఫోటోను సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) షేర్ చేస్తున్నారు. ఈ క్లెయిమ్‌లో ఎంతవరకు నిజం ఉందో చూద్దాం. 

క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో వై.ఎస్.జగన్ సమక్షంలో ఒక బాలుడు పలకపై టీడీపీ గుర్తు ‘సైకిల్’ని గీశాడు. 

ఫాక్ట్ (నిజం): ఈ ఫోటోని ఎడిట్ చేసారు. అసలు ఫోటోలో బాలుడు తన పలక మీద ‘ABC’ అక్షరాలను రాసాడు, టీడీపీ గుర్తు ‘సైకిల్’ని కాదు. వై.ఎస్.జగన్ ఇటీవల చేసిన బస్సు యాత్రలో ఒక చిన్నారికి అక్షరాబ్యాసం చేయిపించినప్పుడు ఈ ఫోటోను తీశారు. కావున, ఫొటోలో చేసిన క్లెయిమ్ తప్పు

వైరల్ అవుతున్న ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే ఇదే ఫొటోతో 16 ఏప్రిల్ 2024న  ప్రచురించిన ఒక వార్తా కథనం లభించింది. దీని ప్రకారం, ఇటీవల జగన్ నారాయణపురంలో బస్సు యాత్ర ప్రారంభించాడని,  అప్పుడు ఒక చిన్నారికి అక్షరాబ్యాసం చేయించినట్టు ఇందులో పేర్కొన్నారు. అంతేకాక, ఈ కథనంలోని ఫోటోలో బాలుడి పలుక మీద సైకిల్ బొమ్మ కాకుండా ‘ABC’ అక్షరాలు ఉన్నాయి. అలానే, ‘iDream’ యూట్యూబ్ ఛానల్ లో కూడా ఈ సంఘటనకు సంబందించిన వీడియోను ప్రచురించారు. ఇందులో కూడా, ఆ చిన్నారి ‘ABC’ అక్షరాలు రాయడం గమనించవచ్చు. 

అసలు ఫోటోలో ఆ బాలుడి పలక మీదున్న అక్షరాలకు, వైరల్ అవుతున్న ఫోటోలో పలక మీద వున్న దానికి మధ్య తేడాని కింద గమనించవచ్చు. 

చివరగా, వై.ఎస్.జగన్ అక్షరాబ్యాసం చేపిస్తున్న బాలుడు పలకపై టీడీపీ గుర్తు ‘సైకిల్’ని గీసాడంటూ ఎడిట్ చేసిన ఫోటోను షేర్ చేస్తున్నారు.