కర్ణాటకలో జరిగిన కత్తి దాడి ఘటనలోని బాధితురాలు, నిందితుడు ఒకే మతస్థులు

కర్ణాటకలోని హుబ్బలిలో ఒక ముస్లిం అబ్బాయి తన ప్రేమను తిరస్కరించిదన్న కారణంతో ఒక హిందూ యువతిపై కత్తితో దాడి చేసాడని చెప్తూ, ఈ ఘటనకి సంబంధించిన వీడియో షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కర్ణాటకలోని హుబ్బలిలో ఒక ముస్లిం అబ్బాయి తన ప్రేమను తిరస్కరించిందన్న కారణంతో ఒక హిందూ యువతిపై కత్తితో దాడి చేసాడు.

ఫాక్ట్ (నిజం): ఈ ఘటనకి సంబంధించి రిజిస్టర్ అయిన FIR ప్రకారం దాడిలో గాయపడ్డ యువతి కూడా ఇస్లాం మతానికి చెందింది. ఈ ఘటనలో గాయపడ్డ మరియు గాయపరిచిన వారు ఇద్దరు ఒకే మతానికి(ఇస్లాం) చెందిన వారు. పోలీస్ వారిని మేము సంప్రదించినప్పుడు కూడా ఈ విషయాన్ని ద్రువీకరించారు. దీన్నిబట్టి ఈ ఘటనలో గాయపడ్డ యువతీది హిందూ మతం కాదని కచ్చితంగా చెప్పొచ్చు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ ఘటనకి సంబంధించి మరింత సమాచారం కోసం గూగుల్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా ఈ ఘటనకి సంబంధించిన వార్తను ప్రచురించిన కొన్ని వార్తా కథనాలు మాకు కనిపించాయి. ఈ కథనాల ప్రకారం హుబ్బలిలోని దేశ్ పండే నగర్ లో ఇస్మాయిల్ అనే వ్యక్తి తను ప్రేమించిన ఆశ అనే యువతీ పై కత్తితో దాడి చేసాడు అని తెలిసింది. కానీ ఈ కథనాలలో ఎక్కడ కూడా వారిద్దరూ వేరు వేరు మతాలకి చెందిన వారని ఎక్కడా పేర్కొనలేదు.

బాధితురాలు మతం తెలుసుకోవడానికి ఈ ఘటనకి సంబంధించి రిజిస్టర్ అయిన FIR ఉన్న సమాచారం వెతకగా, FIR లో గాయపడ్డ యువతీ పేరు ఆశ అని, ఆమె తల్లితండ్రుల పేర్లు బిబిజాన్ మరియు దవల్సాబ్ ధోబి అని, వీరు ముస్లిం మతానికి చెందిన వారని స్పష్టంగా రాసి ఉంది.

ఐతే ఈ విషయం గురించి మరింత సమాచారం కోసం FACTLY హుబ్బల్లి  సబ్ అర్బన్ పోలీస్ స్టేషన్ SI హోలేయన్నవార్ ని ఫోన్ ద్వారా సంప్రదించగా అతను ఈ ఘటనకు సంబంధించి గాయపడ్డ మరియు గాయపరిచిన వారు ఇద్దరు ఒకే మతానికి (ముస్లిం) చెందిన వారని నిర్ధారించారు. దీన్నిబట్టి ఈ ఘటనలో గాయపడ్డ యువతీది హిందూ మతం కాదని కచ్చితంగా చెప్పొచ్చు.

చివరగా, కర్ణాటకలో జరిగిన కత్తి దాడి ఘటనలోని బాధితురాలు మరియు నిందితుడు ఇరువురు ఒకే మతానికి (ఇస్లాం) చెందినవారు. పోస్టులో ఈ ఘటనను లవ్ జిహాద్ అని తప్పుగా పేర్కొన్నారు.