హర్యానా అభివృద్ధి కోసం 2013లో బీజేపీ నాయకులు చేసిన అర్ధనగ్న నిరసనని పెట్రోల్ ధరలకి ముడిపెడుతున్నారు

YouTube Poster

కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్రోల్ ధర 61 రూపాయిలు అయిందని సగం బట్టలేసుకొని రోడ్డు పై నిరసన చేసిన బీజేపీ నాయకులు, ఇప్పుడు పెట్రోల్ ధర 95 రూపాయిలు అయ్యాక కూడా నిరసన ఎందుకు తెలపడం లేదని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతుంది. అర్ధనగ్న నిరసన చేస్తున్న బీజేపీ కార్యకర్తల ఫోటో ఈ పోస్టులో షేర్ చేసారు. ఇటివల దేశంలో వరుసగా పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్రోల్ ధరలు పెరిగాయని అర్ధనగ్న నిరసన చేసిన బీజేపీ నాయకుల ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఈ ఫోటోలో అర్ధనగ్న నిరసన చేస్తుంది హర్యానా బీజేపీ నాయకుడు అనిల్ విజ్. 2013 లో హర్యానా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనిల్ విజ్ ఈ నిరసన చేసారు. హర్యానా రాష్ట్రం అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయడం లేదని అనిల్ విజ్ నిరసనలో తెలిపారు. ఈ ఫోటో పెట్రోల్ ధరల నిరసనకు సంబంధించింది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ ‘Dainik Tribune’ 22 సెప్టెంబర్ 2013 నాడు ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. హర్యానా బీజేపీ నాయకుడు అనిల్ విజ్, అప్పటి హర్యానా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అర్ధనగ్న నిరసన చేసినట్టు ఆర్టికల్ తెలిపింది. ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హూడా నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, హర్యానా రాష్ట్ర అభివృద్ధి పనులు చేపట్టడంలో విఫలం అయినట్టు, అనిల్ విజ్ తన నిరసనలో పేర్కొన్నారు. ఈ నిరసనలో పెట్రోల్ ధరల గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. ఈ నిరసన వీడియోని అనిల్ విజ్, తన యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసారు.

2013లో అనిల్ విజ్ చేసిన ఈ నిరసన ఫోటోని కాంగ్రెస్ నాయకుడు RA బ్రార్ మీడియాకి చూపెట్టిన దృశ్యాలని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు బీజేపీ నాయకులు దేశమంతట నిరసన చేపట్టిన దృశ్యాలని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. కానీ, పోస్టులో షేర్ చేసిన ఫోటో పెట్రోల్ ధరల నిరసనకు సంబంధించింది కాదు.         

చివరగా, 2013లో బీజేపీ నాయకులు హర్యానా అభివృద్ధి కోసం అర్ధనగ్న నిరసన చేస్తున్నప్పుడు తీసిన ఫోటోని పెట్రోల్ ధరలకు ముడిపెడుతున్నారు.