భగత్ సింగ్‌కి ఉరి శిక్ష వేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది 07 అక్టోబర్ 1930న, ఉరితీసింది 23 మార్చి 1931న; ‘వాలెంటైన్స్ డే’ రోజున కాదు

YouTube Poster

భారత దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న  భగత్ సింగ్, రాజ్ గురు, మరియు సుఖ్ దేవ్ లను 1931వ సంవత్సరం, ఫిబ్రవరి 14న (‘వాలెంటైన్స్ డే’) బ్రిటీష్ వాళ్ళు ఉరి తీసారని, అలాంటి రోజున ఎవరో వాలెంటైన్ కోసం సంబరాలు జరుపుకోవటం దురదృష్టకరమని చెప్తూ, ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భగత్ సింగ్, రాజ్ గురు, మరియు సుఖ్ దేవ్ లను 1931లో ఫిబ్రవరి 14న (వాలెంటైన్స్ డే) ఉరి తీశారు.

ఫాక్ట్: భగత్ సింగ్, రాజ్ గురు, మరియు సుఖ్ దేవ్ లను ఉరి తీసింది 23 మార్చి 1931న , పోస్టులో చెప్పినట్టు ‘వాలెంటైన్స్ డే’ రోజున కాదు. అంతేకాదు, వారికి ఉరి వేస్తూ కోర్టు తీర్పు కూడా 07 అక్టోబర్ 1930 న ఇచ్చింది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

దేశ స్వాతంత్రం కోసం భగత్ సింగ్, రాజ్ గురు, మరియు సుఖ్ దేవ్ లు చేసిన త్యాగానికి గుర్తుగా ప్రతీ సంవత్సరం, మార్చి 23 న ‘షహీద్ దివాస్/అమర వీరుల దినోత్సవం’ జరుపుతారు. ‘DD News’ లో అమర వీరుల దినోత్సవం రోజు ప్రసారం చేసిన వీడియోని ఇక్కడ చూడవచ్చు.

25 మార్చి 1931న ‘The Tribune’ అనే దిన పత్రికలో వారిని ఉరి తీసినట్టు వచ్చిన వార్తని ‘Prasar Bharati’ ట్వీట్ చేసింది. ‘The Hindu’ దిన పత్రికలో కూడా 24 మార్చి 1931న ఆ విషయం పై ప్రచురించిన ఆర్టికల్ ని చూడవచ్చు.

1931 మార్చి నెలలో భారత దేశం లోని అంతర్గత రాజకీయ పరిస్థితుల పైన ప్రతీ రెండు వారాలకు రాసిన రిపోర్ట్ లను ‘National Archives of India’ పోర్టల్ నుండి ‘Factly’ టీమ్ తీసుకుంది. ఆ రిపోర్ట్స్ ని ప్రతీ నెల బ్రిటిష్ ప్రభుత్వానికి పంపేవారు. వాటి ద్వారా భగత్ సింగ్, రాజ్ గురు, మరియు సుఖ్ దేవ్ లు 23 మార్చి 1931న ఉరి తీయబడ్డారని స్పష్టం అవుతుంది.

భగత్ సింగ్, రాజ్ గురు, మరియు సుఖ్ దేవ్ లకు ఉరి శిక్ష ఖరారు అయిన రోజు 14 ఫిబ్రవరి అని మరికొందరు సోషల్ మీడియాలో షేర్ (ఆర్కైవ్డ్) చేస్తున్నారు.

అయితే, అది కూడా తప్పే. వారికి ఉరి వేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది 07 అక్టోబర్ 1930న అని వివిధ ఆర్కైవ్స్ డాకుమెంట్స్ లో ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. ఇదే విషయం ‘The Economic Times’ ఆర్టికల్ లో కూడా చదవొచ్చు.

చివరగా, భగత్ సింగ్, రాజ్ గురు, మరియు సుఖ్ దేవ్ లకు ఉరి వేస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది 07 అక్టోబర్ 1930 న మరియు వారు ఉరితీయబడింది 23 మార్చి 1931న; ‘వాలెంటైన్స్ డే’ రోజున కాదు.