నాసాకు చెందిన సునీతా విలియమ్స్, క్రూ-9 మిషన్ యొక్క వ్యోమగాములు 18 మార్చి 2025న SpaceX యొక్క డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో భూమిపైకి చేరుకున్న నేపథ్యంలో, తాను అంతరిక్షంలో ఉన్న సమయంలో ఖురాన్ చదివానని, దాని నుంచి ఎంతో ధైర్యాన్ని, స్ఫూర్తిని పొందానని బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీతా విలియమ్స్ చెప్పినట్లు ఒక పోస్టు (ఆర్కైవ్) సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. ఇదే విషయాన్ని నిర్థారించాలని కోరుతూ మా వాట్సాప్ టిప్‌లైన్‌కు (+91 9247052470) కూడా పలు అభ్యర్ధనలు వచ్చాయి. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: అంతరిక్షంలో ఉన్న సమయంలో ఖురాన్ చదవడం వల్ల తనకి ధైర్యం వచ్చిందని సునీతా విలియమ్స్ బీబీసీకి తెలిపారు.
ఫాక్ట్: ఇది అవాస్తవం. సునీత విలియమ్స్ ఈ విధంగా బీబీసీతో చెప్పినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా వైరల్ పోస్టులోని సమాచారం గురించి ఇంటర్నెట్లో వెతకగా, బీబీసీ ఈ సమాచారాన్ని ప్రచురించినట్లు మాకు ఎటువంటి ఆధారాలు లభించలేదు.
ఇక, సునీత విలియమ్స్ భూమి మీదకు వచ్చే సమయంలో బీబీసీ ప్రచురించిన వార్తా కథనం (ఆర్కైవ్) ప్రకారం వైద్య పరీక్షల నిమిత్తం సునీత విలియమ్స్ బృందం మీడియా సమావేశంలో పాల్గొనడం లేదని నాసా అధికారులు వెల్లడించలేదు.
అలాగే, అంతరిక్షంలో ఉన్న సమయంలో సునీతా విలియమ్స్, నాసా అధికారులు వివిధ మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) కూడా సునీతా విలియమ్స్ రంజాన్ స్పూర్తితో ఉపవాసం ఉంటున్నట్లు చెప్పలేదు. ఇక మీడియా కథనాల ప్రకారం, సునీత విలియమ్స్ 2024లో అంతరిక్షానికి వెళ్లేటప్పుడు గణేశుని ప్రతిమని తీసుకెళ్లారని ఆమె సోదరి ఫల్గుణి పాండ్య పేర్కొన్నారు. అలాగే, 2013లో మీడియా సమావేశంలో, తాను (2012లో) అంతరిక్షంలోని వెళ్ళినప్పుడు గణేష్ ప్రతిమ, భగవద్గీత, ఉపనిషత్తులని తీసుకెళ్లానని ఆమె పేర్కొన్నారు.
చివరిగా, సునీతా విలియమ్స్ కి అంతరిక్షంలో ఖురాన్ స్పూర్తిని ఇచ్చిందని బీబీసీ ఎటువంటి వార్తా కథనాన్ని ప్రచురించలేదు.