‘పాకిస్థాన్ మీద భారత్ యుద్ధం చేస్తే, 25 కోట్ల భారత దేశ ముస్లింలు భారత్ కు బుద్ధి చెపుతారు’ అని అసదుద్దీన్ ఒవైసీ అనలేదు

ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ‘పాకిస్థాన్ మీద భారత్ యుద్ధం చేస్తే, 25 కోట్ల భారతదేశ ముస్లింలు భారత్ కు బుద్ధి చెపుతారు’ అని అన్నట్లుగా సోషల్ మీడియా లో గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ ఆరోపణలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : పాకిస్థాన్ మీద భారత్ యుద్ధం చేస్తే, 25 కోట్ల భారతదేశ ముస్లింలు భారత్ కు బుద్ధి చెపుతారు అని అసదుద్దీన్ ఒవైసీ అన్నాడు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో ఆరోపించిన వ్యాఖ్యలు అసదుద్దీన్ ఒవైసీ చేసినట్లుగా ఏ ప్రఖ్యాత వార్తా పత్రిక కానీ, మీడియా సంస్థ కానీ రిపోర్ట్ చేయలేదు. కావున, ఆ వ్యాఖ్యలను అసదుద్దీన్ ఒవైసీ చేసాడనే ఆరోపణ తప్పు.

పోస్ట్ లోని విషయం గురించి గూగుల్ లో వెతకగా, ‘Kashmir Observer’ అనే వెబ్సైటు మరియు ‘Kashmir Watch’ అనే మరొక వెబ్సైటు అసదుద్దీన్ ఆ వ్యాఖ్యలు చేసాడని 2014లో కథనాలు ప్రచురించినట్లుగా సమాచారం లభించింది. కానీ, ఏ విశ్వసనీయ వార్తా సంస్థ లో కూడా ఆ వ్యాఖ్యలు అసదుద్దీన్ చేసినట్లుగా రిపోర్ట్ అవ్వలేదు. అసదుద్దీన్ ని ఆ వ్యాఖ్యలకు సంబంధించి ట్విట్టర్ లో ఒక యూసర్ అడిగినప్పుడు, ఆయన వాటిని ఖండిస్తూ తాను అలా అన్నట్లుగా  ప్రచురించిన ‘Kashmir Observer’ వారు తనకి క్షమాపణ చెపితే సరే అనీ లేకపోతే వారి పై కేసు పెడతానని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా సెప్టెంబర్ 2, 2014న ట్వీట్ చేసాడు. ఆ సందర్భం లోనే చేసిన మరికొన్ని ట్వీట్ లను ఒక న్యూస్ బ్లాగ్ ప్రచురించిన ఆర్టికల్ లో చూడవచ్చు.

2015లో ‘Headlines Today’ వార్తా సంస్థ వారు ఒక ఇంటర్వ్యూ లో అసదుద్దీన్ ని ఆ వ్యాఖ్యల గురించి అడిగినప్పుడు, తాను అలా అనలేదని చెప్తూ తాను అలా అన్నట్లుగా ప్రచురించిన న్యూస్ వెబ్సైట్ల పై ఆయన కేసు పెట్టడంతో కొన్ని సంస్థల వారు తాము ప్రచురించిన ఆ కథనం నిరాధారమైనదని ఒప్పుకుంటూ తనను క్షమాపణలు కోరినట్లుగా అసదుద్దీన్ చెప్పారు. ఒక వేల అసదుద్దీన్ నిజంగానే అటువంటి వ్యాఖ్యలు చేసినట్లయితే దేశం లోని అన్ని ప్రముఖ వార్తా పత్రికలూ మరియు మీడియా సంస్థలు దాని గురించి ప్రచురించేవి. కానీ, అటువంటి న్యూస్ ఎవరు కూడా ప్రచురించలేదు.

చివరగా, ‘పాకిస్థాన్ మీద భారత్ యుద్ధం చేస్తే, 25 కోట్ల భారతదేశ ముస్లింలు భారత్ కు బుద్ధి చెపుతారు’ అని అసదుద్దీన్ ఒవైసీ అనలేదు. 

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?