Fake News, Telugu
 

ప్రభుత్వ డేటా ప్రకారం మోదీ హయాంలో చైనా నుండి సుమారు 196.8 కోట్ల అమెరికన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి

0

2014 వరకు మన దేశంలో చైనా పెట్టుబడులు కేవలం 160 కోట్ల డాలర్లు మాత్రమే అని, కానీ మోదీ ప్రభుత్వ హయాంలో ఇప్పటి వరకు చైనా నుంచి వచ్చిన పెట్టుబడులు 2600 కోట్ల డాలర్లు అని చెప్తూ, ఇదేనా మోదీ చెప్పిన ‘మేక్ ఇన్ ఇండియా’ అని వ్యంగ్యంగా ఒక పోస్ట్ ని కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: మోదీ ప్రభుత్వ హయాంలో లో 2600 కోట్ల డాలర్ల చైనా పెట్టుబడులు భారతదేశంలోకి వచ్చాయి.

ఫాక్ట్ (నిజం): గత ఇరవై ఏళ్ల మొత్తాన్ని తీసుకున్నా, చైనా నుండి భారతదేశంలోకి వచ్చిన పెట్టుబడులు పోస్ట్ లో చెప్పిన 2600 కోట్ల అమెరికన్ డాలర్ల కంటే చాలా తక్కువ. మోదీ ప్రభుత్వ హయాంలో సుమారు 196.8 కోట్ల అమెరికన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి.కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

వివిధ దేశాల నుండి భారతదేశంలోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (Foreign Direct Investment – FDI) వివరాలను భారత ప్రభుత్వ వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ వారి ‘Department for Promotion of Industry and Internal Trade (DPIIT)’ వెబ్సైటులో చూడవొచ్చు. ఆ వెబ్సైటులో ఇచ్చిన డేటా ప్రకారం ఏప్రిల్ 2000 – మార్చి 2020 మధ్య చైనా నుండి భారతదేశంలోకి 2,378.71 మిలియన్ అమెరికన్ డాలర్ల (అంటే 237.8 కోట్ల అమెరికన్ డాలర్లు) FDI పెట్టుబడులు వచ్చాయి. గత ఇరవై ఏళ్ల మొత్తాన్ని తీసుకున్నా, పోస్ట్ లో చెప్పిన 2600 కోట్ల యూఎస్ డాలర్ల కంటే చైనా నుండి భారతదేశంలోకి వచ్చిన పెట్టుబడులు చాలా తక్కువ అని చూడవొచ్చు.

అయితే, మోదీ ప్రభుత్వ హయంలో ఎంత మొత్తం పెట్టుబడులు వచ్చాయో తెలుసుకోవడానికి మే 2014 కంటే ముందు వచ్చిన పెట్టుబడి మొత్తాన్ని తీసేయాలి (ఎందుకంటే మోదీ మే 2014 లో ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసారు). ఏప్రిల్ 2000 – మే 2014 మధ్య చైనా నుండి భారతదేశంలోకి 410.14 మిలియన్ అమెరికన్ డాలర్ల (అంటే 41.01 కోట్ల అమెరికన్ డాలర్లు) FDI పెట్టుబడి వచ్చింది. అంటే, మోదీ ప్రభుత్వ హయంలో సుమారు 196.8 కోట్ల యూఎస్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.

అయితే, చైనా పెట్టుబడులు సింగపూర్ మరియు ఇతర ఆసియా దేశాల ద్వారా వస్తాయని కొందరు అభిప్రాయపడినప్పటికీ, అది ఎంత అనే ఖచ్చితమైన సమాచారం లేదు.

చివరగా, ప్రభుత్వ డేటా ప్రకారం మోదీ హయంలో చైనా నుండి సుమారు 196.8 కోట్ల అమెరికన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll