ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుపతి వేంకటేశ్వరుని ఉచిత దర్శనం సీనియర్ సిటిజన్ల కోసం రెండు స్లాట్లు ఏర్పాటు చేశారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతూ ఉంది. ఒకటి ఉదయం 10 గంటలకు కాగా మరొక స్లాట్ మధ్యాహ్నం 3 గంటలకు ఏర్పాటు చేసినట్టు ఈ సమాచారంలో చెప్తున్నారు. ఈ కథనం ద్వారా ఆ వార్తకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తిరుపతి వేంకటేశ్వరుని ఉచిత దర్శనం సీనియర్ సిటిజన్ల కోసం రెండు స్లాట్లు ఏర్పాటు చేశారు.
ఫాక్ట్(నిజం): తిరుమలలో వయోవృద్ధుల ప్రత్యేక దర్శనం కోసం ఇప్పటికైతే కేవలం ఒకటే స్లాట్ అందుబాటులో ఉంది. సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 03 గంటల సమయంలో సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక స్లాట్‌ను కేటాయించారు. కరోనా ముందు వయోవృద్ధులకు రెండు స్లాట్‌లు ఉండేవని, ఆ తరవాత తీసేసారని తెలిసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి సంబంధించి సీనియర్ సిటిజన్ల కోసం ప్రస్తుతం ఒకటే స్లాట్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం షేర్ అవుతున్న వార్తకు సంబంధించి మరింత సమాచారం కోసం TTD వెబ్‌సైట్‌లో వెతకగా అందులోని సమాచారం ప్రకారం ఇప్పటికైతే సీనియర్ సిటిజన్ల కోసం కేవలం ఒక స్లాట్ మాత్రమే ప్రత్యేకంగా కేటాయించబడి ఉంది.
సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 03 గంటల సమయంలో సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక స్లాట్‌ను కేటాయించారు. రోజుకు వెయ్యి మందికి మాత్రమే ఈ ప్రత్యేక దర్శనం వీలుంటుంది. దీనిబట్టి సీనియర్ సిటిజన్ల దర్శనం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండు స్లాట్లు ఏర్పాటు చేశారు అన్న వార్తలో నిజం లేదని స్పష్టమవుతుంది.
ఇటీవల వయోవృద్ధుల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయని, ఇవి పూర్తిగా నిజం కావని, ఇప్పటికైతే కేవలం 03 గంటల సమయంలో వయోవృద్ధుల దర్శనం స్లాట్ అందుబాటులో ఉందని TTD ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేసింది.
కాగా మేము TTD హెల్ప్‌డెస్క్‌తో మాట్లాడగా, కరోనా ముందు వయోవృద్ధులకు రెండు స్లాట్‌లు ఉండేవని, ఆ తరవాత తీసేసారని తెలిసింది. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆర్కైవ్స్‌లో వెతకగా, డిసెంబర్ 2014లో ఆర్కైవ్ చేసిన TTD వెబ్‌సైట్‌లో వయోవృద్ధుల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి ఉదయం 10 గంటలకు ఒక స్లాట్ మరియు మధ్యాహ్నం 3 గంటలకు ఉండేవని తెలిసింది. 2012లో రాసిన ఒక ట్రావెల్ బ్లాగ్‌లో కూడా వయోవృద్ధుల దర్శనానికి రెండు స్లాట్‌లు ఉండేవని తెలుస్తుంది. దీన్నిబట్టి వయోవృద్ధుల దర్శనానికి రెండు స్లాట్లు ఏర్పాటు చేయడం చాలా కాలం నుండే ఉందని తెలుస్తుంది.
చివరగా, తిరుమలలో వయోవృద్ధుల ప్రత్యేక దర్శనం కోసం ఇప్పటికైతే కేవలం ఒకటే స్లాట్ అందుబాటులో ఉంది.