షాజహాన్ తాజ్ మహల్‌ను నిర్మించారనడానికి ఆధారాలు లేవని పురావస్తు శాఖ అధికారులు ప్రకటించలేదు

తాజ్ మహల్‌ను మొఘల్ రాజు షాజహాన్ నిర్మించారని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని ఇటీవల పురావస్తు శాఖ అధికారులు ప్రకటించారు, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

YouTube Poster

క్లెయిమ్: షాజహాన్ తాజ్ మహల్‌ను నిర్మించారనడానికి ఆధారాలు లేవని పురావస్తు శాఖ అధికారులు ఇటీవల ప్రకటించారు.

ఫాక్ట్ (నిజం): తాజ్ మహల్‌ను నిర్మించింది మొఘల్ రాజు షాజహాన్ అని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ASI), UNESCO తదితర వెబ్సైటులో స్పష్టంగా తెలిపారు. షాజహాన్, తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్ధం తాజ్ మహల్‌ను నిర్మించారు. తాజ్ మహల్‌ను షాజహాన్ నిర్మించలేదని పురావస్తు శాఖ అధికారులు ఇటీవల ఎటువంటి ప్రకటన చేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు

ఈ పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన స్పష్టత కోసం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) వెబ్సైటులో వెతికితే, తాజ్ మహల్‌ను షాజహాన్ నిర్మించారని చెప్పడానికి ఆధారాలు లేవని తెలుపుతూ ASI ఎటువంటి ప్రెస్ రిలీజ్ ఇవ్వలేదని తెలిసింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెబ్సైటులో తాజ్ మహల్‌ చరిత్రను వివరిస్తూ, తాజ్ మహల్‌ను నిర్మించింది మొఘల్ రాజు షాజహాన్ అని స్పష్టంగా తెలిపారు. షాజహాన్, తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్ధం తాజ్ మహల్‌ను నిర్మించినట్టు ఈ వెబ్సైటులో స్పష్టం చేసారు. 17 సంవత్సరాల సుదీర్ఘ శ్రమ తరువాత తాజ్ మహల్‌ నిర్మాణం 1648 సంవత్సరంలో పూర్తి అయినట్టు ఈ వెబ్సైటులో తెలిపారు.

తాజ్ మహల్‌ చరిత్రకు సంబంధించి ‘UNESCO’, ‘New 7 Wonders of the World’ వెబ్సైటులలో తెలిపిన సమాచారంలో కూడా తాజ్ మహల్‌ను నిర్మించింది మొఘల్ రాజు షాజహాన్ అని తెలిపారు. ఈ వివరాల ఆధారంగా, తాజ్ మహల్‌ను షాజహాన్ కట్టించలేదని పేర్కొంటూ పురావస్తు శాఖ అధికారులు ఎటువంటి ప్రకటన చేయలేదని స్పష్టమయ్యింది.

చివరగా, షాజహాన్ తాజ్ మహల్‌ను నిర్మించారనడానికి ఆధారాలు లేవని పురావస్తు శాఖ అధికారులు వెల్లడించలేదు.