Fake News, Telugu
 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గడిచిన రెండేళ్లలో పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకంపై విధించే VAT ద్వారా 21,182 కోట్ల ఆదాయం చేకూరింది, 4 లక్షల కోట్లు కాదు

0

ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్రోల్/డీజిల్ పైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు, ఆయా ప్రభుత్వాలకు వెళ్ళే వాటా మొదలైన అంశాలను వివరిస్తూ ప్రముఖ దినపత్రికలలో ఒక ప్రకటన విడుదల చేసింది. ఐతే ఈ ప్రకటన నేపథ్యంలోనే ‘గత రెండేళ్లలో పెట్రోల్/డీజిల్ పైన టాక్స్‌ల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదాయం అక్షరాల ₹4,38,706 కోట్ల రూపాయలు’ అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఐతే ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: గత రెండేళ్లలో పెట్రోల్/డీజిల్ పైన టాక్స్‌ల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదాయం అక్షరాల ₹4,38,706 కోట్ల రూపాయలు.

ఫాక్ట్ (నిజం): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకంపై విధించే సేల్స్ టాక్స్/ VAT ద్వారా 2019-20 సంవత్సరంలో 10,168 కోట్ల ఆదాయం చేకూరగా, 2020-21లో  11,014 కోట్ల ఆదాయం చేకూరింది. అంటే రెండు సంవత్సరాలకు కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాకి 21,182 కోట్లు చేరాయి. వైరల్ పోస్టులో తెలిపింది అన్ని రాష్ట్రాలకు కలిపి పెట్రోలియం రంగం నుండి వచ్చిన వచ్చిన ఆదాయ వివరాలు, కేవలం ఆంధ్ర ప్రదేశ్ కి కాదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖలో మినిస్టర్ అఫ్ స్టేట్ అయిన రామేశ్వర్ తెలి ఇటీవల 28 జూలై 2021న రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖిత పూర్వకంగా ఇచ్చిన జవాబులో గత ఐదేళ్లలో మొత్తం పెట్రోలియం రంగం  నుండి కేంద్ర, రాష్ట్ర ఖజానాలకు చేకూరిన ఆదాయ వివరాలు పేర్కొన్నారు. వైరల్ అవుతున్న పోస్టులో పేర్కొన్న వివరాలు రాజ్యసభలో తెలిపిన ఈ వివరాల నుండి సేకరించినవే.

ఐతే ఇక్కడ రెండు గమనించాల్సిన విషయాలు ఉన్నాయి,

  • ఒకటి కేంద్ర మంత్రి తెలిపింది పెట్రోలియం రంగం నుండి అన్ని రాష్ట్రాలకు కలిపి చేకూరిన ఆదాయ వివరాలు, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకు చేకూరిన ఆదాయం కాదు.
  • రెండోవది, కేంద్ర మంత్రి తెలిపిన వివరాలు మొత్తం ‘పెట్రోలియం రంగం’ (పన్నులు, సుంకాలు, రాయల్టీ, డివిడెండ్‌లు, ఆదాయపు పన్ను మొదలైనవి) నుండి రాష్ట్ర ఖజానాలకు చేకూరిన ఆదాయం గురించి, కేవలం పెట్రోల్/డీజిల్ పైన విధించిన టాక్స్‌ల వల్ల వచ్చిన ఆదాయం మాత్రమే కాదు.

కేంద్ర మంత్రి అందించిన వివరాల ప్రకారం మొత్తం పెట్రోలియం రంగం నుండి అన్ని రాష్ట్రాలకు కలిపి 2019-20 సంవత్సరంలో 2,21,056 కోట్ల ఆదాయం చేకూరగా, 2020-21(P)లో  2,17,650 కోట్ల ఆదాయం చేకూరింది. ఐతే ఈ రెండు సంవత్సరాలకు సంబంధించిన ఈ వివరాలను కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే చేరిన ఆదాయంగా తప్పుగా అర్థం చేసుకున్నారు.

పెట్రోలియం ప్లానింగ్ అండ్ ఎనాలిసిస్ సెల్ వెబ్సైటులో కేంద్ర, రాష్ట్ర ఖజానాకు పెట్రోలియం రంగం నుండి చేకూరిన ఆదాయానికి సంబంధించిన వివరాలు కూడా పైన తెలిపిన విధంగానే ఉన్నాయి. ఐతే అన్ని రాష్ట్రాలకు కలిపి ఏ రూపంలో (ఉదాహారణకి టాక్స్, రాయల్టీ మొదలినవి) ఎంత ఆదాయం చేకూరిందో పెట్రోలియం ప్లానింగ్ అండ్ ఎనాలిసిస్ సెల్ వెబ్సైటులో కూలంకషంగా పేర్కొన్నారు, ఈ వివరాలు ఇక్కడ చూడొచ్చు.

ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకంపై విధించే సేల్స్ టాక్స్/ VAT ద్వారా 2019-20 సంవత్సరంలో 10,168 కోట్ల ఆదాయం చేకూరగా, 2020-21లో  11,014 కోట్ల ఆదాయం చేకూరింది. అంటే రెండు సంవత్సరాలకు కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఖజానాకి VAT ద్వారా 21,182 కోట్లు చేరాయి. దీన్ని బట్టి పోస్టులో చెప్తున్న వివరాలు కరెక్ట్ కాదని స్పష్టమవుతుంది. ఐతే పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకంపై విధించే సేల్స్ టాక్స్/ VAT ద్వారా ఏ రాష్ట్రం ఎంత ఆదాయాన్ని ఆర్జించిందో పెట్రోలియం ప్లానింగ్ అండ్ ఎనాలిసిస్ సెల్ వెబ్సైటులో చూడొచ్చు.

చివరగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గడిచిన రెండేళ్లలో పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకంపై విధించే టాక్స్ ద్వారా 21,182 కోట్ల ఆదాయం చేకూరింది, 4 లక్షల కోట్లు కాదు.

Share.

About Author

Comments are closed.

scroll